నేపాళం ప్రశాంతతకు భూపాలం

8 May, 2014 22:43 IST|Sakshi
నేపాళం ప్రశాంతతకు భూపాలం

యాత్ర
 
కొలువుదీరిన హిమవత్పర్వతాలు... ఆకట్టుకునే ప్రకృతి సోయగాలు... అడుగడుగునా ప్రశాంత నిలయాలు...బుద్ధుని జన్మస్థలి అయిన నేపాల్ యాత్రానుభవాలు జీవితకాలం హృదయంలో పదిలపరచుకునే ఆనందామృతాలు...హాయిగా పాడుకునే భూపాల రాగాలు
 
‘విజయవాడ, విశాఖపట్నం, కాకినాడల్లో ఉన్న 30 మంది మిత్ర బృందంతో కలసి కొన్నాళ్లుగా అనుకుంటున్న నేపాల్‌కు రైలులో బయల్దేరాం.ఆ ప్రయాణ అనుభూతులు, పర్యావరణ అందాలు, ప్రశాంతత.. నాలుగు నెలలు దాటినా ఇప్పటికీ మరపురానివే.
 
ఆ రోజు ఉదయం 5 గంటలకు విజయవాడలో త్రివేండ్రం-గోరఖ్‌పూర్ రైలు ఎక్కి, సాయంత్రం 6 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకున్నాం. ముందుగా బుక్ చేసి ఉంచిన రూముల్లో కాసేపు సేద తీరి, గోరఖ్‌పూర్‌లో ప్రముఖ దేవాలయమైన గోరఖ్‌నాథ్ మందిరాన్ని సందర్శించుకున్నాం. అక్కడి ఆలయప్రాంగణంలోని ప్రశాంతత నూ అలుపు తీర్చేసింది. గోరఖ్‌పూర్ వాసులు రసాయన ఎరువులు లేకుండా పంటలు పండిస్తారని అక్కడివారు చెప్పారు. వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాం. ఆ రాత్రి అక్కడే బస చేసి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు నేపాల్‌లోని పర్యాటక కేంద్రమైన లుంబినికి చేరాం.
 
బుద్ధుడు పుట్టిన పుణ్యస్థలి... లుంబిని

ప్రసవ సమయంలో రాణీ మాయాదేవి ప్రయాణిస్తుండగా రూపాందేహి జిల్లా ప్రాంతంలోని లుంబినిలో ఒక చెట్టు క్రింద సిద్ధార్థుడు జన్మించాడని కథనం. అతని తండ్రి చక్రవర్తి అవడం వల్ల అతని హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని చెబుతుంటారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రముఖ బుద్ధ పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇక్కడి ప్రాంతాన్ని తిలకిస్తే అడవిలో ఉన్నామనే అనుభూతితో పాటు మరెన్నో దేశాలను ఏకకాలంలో సందర్శించామనే ఆనందమూ కలుగుతుంది. మనదేశంతో పాటు చైనా, జపాన్, శ్రీలంక, థాయిలాండ్ ఇతర దేశాల బుద్ధుని దేవాలయాలు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ మొత్తాన్ని పూర్తిగా అధ్యయనం చే స్తూ తిలకించాలంటే కొన్ని రోజులు పడుతుంది. పైపైన చూసేందుకు మాత్రం నడుస్తూ, రిక్షాలు, మినీ వ్యానులలో వెళ్లవచ్చు. ఇక్కడి మ్యూజియం బుద్ధునిపై పరిశోధనలు చేయడానికి చక్కగా దోహదపడుతుంది.
 
విదేశీయులతో కళ కళ...

ప్రపంచంలో ఏ దేశంలోనూ కనిపించనంత మంది విదేశీయు లు నేపాల్‌లో కనిపించారు. ఇందుకు ప్రపంచంలో అతి పెద్ద పర్వాతాల్లో 8 ఇక్కడే ఉండటం, బౌద్ధమత సంప్రదాయాలు, చల్లటి వాతావరణం ప్రధాన కారణాలుగా తెలుసుకున్నాం. ఎవరెస్ట్ శిఖరాన్ని ఇక్కడ నుంచే అధిరోహిస్తారు. ఎక్కలేని వారు హెలికాప్టర్ ద్వారా శిఖరపు అంచులను తిలకించి రావచ్చు.
 
అత్యంత ఆనందం రోప్ వే...

ఖాట్మండ్‌కు వంద కిలోమీటర్ల దూరంలో గోర్ఖాజిల్లాలో మనోకామనా దేవాలయం ఉంది. ఈ ఆలయానికి కిందనుంచి పైకి వెళ్లడానికి రోప్ వేలో వెళుతుంటే అక్కడ ప్రవహిస్తున్న నదీ ప్రవాహంతో పాటు ప్రకృతి అందాలు సుందరంగా కనిపిస్తుంటాయి.
 
పశుపతినాథుడు...

ఖాట్మండ్ లోయలో భాగమతీ నదికి ఆనుకుని ఉన్న పశుపతినాథ్ దేవాలయంలోకి అడుగుపెట్టగానే నేపాలీల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కనిపిస్తాయి. శక్తి పీఠాల్లో ఒకటైన గుజ్జేశ్వర అమ్మవారి దేవాలయం ఖాట్మండ్‌లోనే ఉంది. అమ్మవారి విగ్రహం ఉన్న చోట నీరు ఎంత పోసినా, తీసినా ఒకే కొలమానంలో ఉంటుంది. నేపాల్ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు భక్తాపూర్ రాజధానిగా ప్రసిద్ధి చెందింది. ప్రజా దర్బారు, ప్రత్యేక కొలను ఇక్కడ కనిపించాయి. ప్రస్తుతం వాటిని మ్యూజియంలా ఏర్పాటు చేశారు.
 
నేపాల్‌లో బెజవాడ భోజనం...

మేం నేపాల్‌లో హోటల్ కల్పబ్రిక్షలో బస చేశాం. ఆ హోటల్ నిర్వాహకుడు హైదరాబాద్‌కు చెందిన ప్రేమ్‌బజ్‌గల్ కావడంతో మాకు కలిసి వచ్చింది. ప్రయాణం మొత్తంలో తెలుగింటి వంటలను ఆస్వాదించాం. ఒక్కొక్కరికి పదివేల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యింది. వారం రోజులు పాటు సాగిన మా ప్రయాణ అనుభూతులను నెమరువేసుకుంటూ విజయవాడకు చేరుకున్నాం.’
 
- వి.సత్యనారాయణ, విజయవాడ
 

మరిన్ని వార్తలు