గ్రహాల ‘ఢీ’తోనే  జీవం పుట్టుక!

25 Jan, 2019 01:41 IST|Sakshi

పరి పరిశోధన 

భూమి మీద జీవం ఎలా పుట్టిందన్న ఆసక్తికరమైన ప్రశ్నకు రైస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త సమాధానాన్ని ప్రతిపాదిస్తున్నారు. కోటానుకోట్ల ఏళ్ల క్రితం ఇంకో గ్రహం ఒకటి భూమిని ఢీకొట్టిందన్న విషయం మనకు తెలుసు కదా. మన ఉపగ్రహం జాబిల్లి పుట్టుకకు కారణమైన సంఘటన జీవం ఏర్పడేందుకూ దోహదపడిందని వీరు అంటున్నారు. భూమి ఏర్పడి దాదాపు 450 కోట్ల ఏళ్లు అయి ఉంటుందని అంచనా. ఏర్పడిన తొలినాళ్లలో అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన గ్రహశకలాలు బోలెడు భూమిని ఢీకొట్టాయి.

ఈ పేలుళ్ల ఫలితంగా అప్పట్లో భూమి మీద లెక్కలేనన్ని భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లూ జరుగుతూండేవని శాస్త్రవేత్తల అంచనా. ఈ క్రమంలోనే ఓ భారీ గ్రహశకలం ఢీకొన్న ఫలితంగా భూమి నుంచి వేరుపడ్డ ఒక భాగం చంద్రుడిగా అవతరించిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే రైస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఇంకో అధ్యయనం చేయడం ద్వారా ఈ సంఘటన జీవం పుట్టుకకు కూడా కారణమని చెబుతున్నారు.

జీవం మనుగడకు అత్యంత కీలకమైన కార్బన్, నైట్రోజన్‌ తదితర పదార్థాలు భూమి మీద ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చాయన్న అంశం ఆధారంగా తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త దమన్‌వీర్‌ గ్రేవాల్‌ చెబుతున్నారు. కంప్యూటర్‌ సిములేషన్‌ ద్వారా అప్పటి పరిస్థితులను, రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించామని, జీవం ఏర్పడేందుకు అవసరమైన నిష్పత్తిలో ఈ మూలకాలు 440 కోట్ల ఏళ్ల క్రితం ఉన్నట్లు తెలిసిందని వివరించారు.  

మరిన్ని వార్తలు