నెలంతా రోజా పరిమళాలు

5 May, 2019 00:43 IST|Sakshi

సాయంత్రాలు ఇఫ్తార్‌ విందులతో వీధులన్నీ ఘుమఘుమలాడ బోతున్నాయి. పిల్లలూ పెద్దల హడావిడితో వాతావరణమంతా సందడిగా మారనుంది. మసీదు మినార్లనుండి సైరన్‌ మోతలు వీనులవిందు చేయనున్నాయి. మండువేసవిలోనూ నిండు వసంతం కుండపోతలా వర్షించనుంది. మానవాళి పాపాలను తొలగించి, పునీతం చేసే పవిత్రరమజాన్‌ నెల ప్రారంభం కాబోతున్నది. మనిషిలోని దుర్లక్షణాలను హరింప చేసి, ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి వంటి సానుకూల భావనలను పెంపొందింపచేసే పవిత్ర రమజాన్‌ మానవాళికి సరైన జీవన సూత్రాలను ప్రబోధించే మార్గదర్శి. రమజాన్‌ ఒక అలౌకిక భావన. తేజోమయ ఆధ్యాత్మిక తరంగం. సత్కార్యాల సమాహారం. వరాల వసంతం. మండువేసవిలో నిండువసంతం.

మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికీ, జీవనసాఫల్యానికి అవసరమైన సమస్తమూ దీనితో ముడివడి ఉన్నాయి. రమజాన్‌ లో పవిత్ర ఖురాన్‌ గ్రంథం అవతరించింది. సమస్త మానవాళికీ ఇది ఆదర్శ ప్రబోధిని. కారుణ్య సంజీవిని. మార్గప్రదాయిని. రమజాన్‌లో ఉపవాసాలు విధిగా నిర్ణయించ బడ్డాయి. ఇవి మానవుల్లో దైవభక్తినీ, దైవభీతిని ప్రోదిచేస్తాయి. స్వర్గానికి బాటలు వేస్తాయి. వెయ్యి నెలలకన్నా విలువైన రాత్రి ‘షబేఖద్ర్‌’ కూడా రమజాన్‌ లోనే ఉంది. ఈ ఒక్కరాత్రి ఆరాధన వెయ్యినెలల ఆరాధనకన్నా మేలైనది.రమజాన్‌లో సత్కార్యాల ఆచరణ ఎక్కువగా కనబడుతుంది. దుష్కార్యాలు ఆగిపోతాయి. సమాజంలో ఒక చక్కని అహ్లాదకరమైన మార్పు కనిపిస్తుంది. ఐదుపూటల నమాజుతోపాటు, అదనంగా తరావీహ్‌ నమాజులు ఆచరించబడతాయి.

సాధారణ దానధర్మాలతోపాటు, ఫిత్రా’అనబడే ప్రత్యేక దానం కూడా రమజాన్‌ లోనే చెల్లిస్తారు. దీనివల్ల సమాజంలోని పేదసాదలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. చాలామంది ‘జకాత్‌ ’ కూడా రమజాన్‌ లోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదల అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. అంతేకాదు, రమజాన్‌ నెలతో అనుసంధానమై ఉన్న విషయాలు అనేకం ఉన్నాయి. ప్రధాన ఆరాధన, ప్రత్యేక ఆరాధన ‘రోజా’ (ఉపవాసవ్రతం) యే. దేవుడు ఈ నెలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందే ప్రయత్నం చెయ్యాలి.నిజానికి ఉపవాస వ్రతమన్నది కేవలం ముహమ్మద్‌ ప్రవక్త అనుచరులకు మాత్రమే, అంటే ముస్లింలకు మాత్రమే పరిమితమైన ఆరాధన కాదు. ఇది సార్వకాలికమైన, సార్వజనీనమైన ఆరాధన.

దీనికి చాలా ఘనమైన, ప్రాచీన సామాజిక నేపథ్యం ఉంది. ఇది అనాదిగా అన్నికాలాల్లో. అన్ని సమాజాల్లో చెలామణిలోఉన్నట్లు దైవగ్రంథం పవిత్రఖురాన్‌ చెబుతోంది.‘విశ్వాసులారా..! పూర్వప్రవక్తల అనుయాయులకు ఏవిధంగా ఉపవాసాలు విధించబడ్డాయో, అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా విధిగా ఉపవాసాలు పాటించాలని నిర్ణయించాము. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.’అంటే, ఉపవాస వ్రతం కేవలం ఈనాటి ముస్లిం సముదాయానికి మాత్రమే ప్రత్యేకమైనది, పరిమితమైనది కాదని, పూర్వకాలం నుండీ ఆచరణలో ఉన్న సనాతన ధర్మాచారమని మనకు అర్ధమవుతోంది. ఈ రోజు కూడా ప్రపంచంలోని అన్నిదేశాల్లో అన్నిజాతులు, అన్ని మతాల వారిలో ఏదో ఒక రూపంలో ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది.

మానవ సమాజంలో మంచి, మానవీయత, భయభక్తుల వాతావరణాన్ని జనింపజేయడం, విస్తరింపజేయడమే ఈ ఉపవాసాల ఆచరణలోని అసలు ఉద్దేశ్యం. అందుకే దేవుడు సృష్టిలో ఏ జీవరాసికీ ఇవ్వనటువంటి ప్రత్యేకత, బుధ్ధికుశలత, విచక్షణా జ్ఞానం ఒక్కమానవుడికే ప్రసాదించాడు. కాని మనిషి తనస్థాయిని గుర్తించక, దేవుడు ప్రసాదించిన బుద్ధీజ్ఞానాలను, శక్తియుక్తులను దుర్వినియోగ పరుస్తూ, ఇష్టానుసారం జీవితం గడుపుతూ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఎలా బతికినా ఇహలోక జీవితం సుఖంగా, సాఫీగా గడిచిపోతున్నదంటే ఇక ఏం చేసినా చెల్లిపోతుందని కాదు. ఏదో ఒకనాడు వీటన్నిటికీ దైవం ముందు హాజరై సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది, ఫలితం అనుభవించవలసి ఉంటుంది.అందుకని మానవుడు తన స్థాయిని గుర్తించాలి.

మానవ సహజ బలహీనతలవల్ల జరిగిన తప్పుల్ని తెలుసుకోవాలి. పశ్చాత్తాపంతో దైవం వైపుకు మరలి సత్కార్యాల్లో లీనమై పోవాలి. దానికోసం పవిత్ర రమజాన్‌కు మించిన అవకాశం మరొకటి లేదు. ఈ నెలలో సత్కార్యాల పుణ్యం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. గోరంతచేసి కొండంత పొందవచ్చు. ఒక నఫిల్‌కు సున్నత్‌తో సమానంగా, సున్నత్‌కు ఫర్జ్‌తో సమానంగా, ఒక పర్జ్‌కు 70 ఫరజ్‌లతో సమానంగా పుణ్యఫలం లభిస్తుంది. మానవుడి ప్రతి ఆచరణకు పదినుండి ఏడు వందల రెట్లవరకు పుణ్యఫలం పెరిగిపోతుంది. అయితే ఒక్క ఉపవాసం మాత్రం వీటన్నిటికంటే అతీతం, ప్రత్యేకం. దీనికి ఒక పరిమితి అంటూ లేదు. ఉపవాసం ప్రతిఫలం అనంతం. అనూహ్యం. విశ్వప్రభువైన అల్లాహ్‌ తన అనంత ఖజానాలోంచి ఉపవాస ప్రతిఫలాన్ని స్వయంగా తానే అనుగ్రహిస్తానంటున్నాడు.

అల్లాహు అక్బర్‌! కనుక అత్యంత భక్తిశ్రద్ధలతో రోజా పాటించి పరమ ప్రభువైన అల్లాహ్‌ నుండి నేరుగా ప్రతిఫలాన్ని అందుకొనే ప్రయత్నం చెయ్యాలి.మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్ధితో ఉపవాసాలు పాటించేవారి అంతర్గతంతో పాటు, బాహ్య శరీరంలోని పవిత్రాత్మనిత్యం జాగృతమై ఉంటుంది. అనుక్షణం వారు అప్రమత్తంగా ఉంటూ, అన్నిరకాల దోషాలనుండి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మానవ సహజ బలహీనతవల్ల ఏవో చిన్న చిన్న పొరపాట్లు దొర్లిపోవచ్చు. ఇలాంటి చిన్నా చితకా పొరపాట్లనుండి ఉపవాసాన్ని దోషరహితంగా, లోపరహితంగా తీర్చిదిద్దడానికి ముహమ్మద్‌ ప్రవక్త(స)ఫిత్రాలు చెల్లించమని ఉపదేశించారు.

వీటివల్ల మరో గొప్ప సామాజిక ప్రయోజనం కూడా ఉంది. సమాజంలోని పేదసాదలకు ఈ ఫిత్రాల ద్వారా కాస్తంత ఆర్ధిక వెసులుబాటు కలుగుతుంది. అందుకే ప్రవక్తమహనీయులు ఫిత్రాదానాన్ని ‘దీనులు, నిరుపేదల భృతి’ అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంతో, సుఖసంతోషాలతో జీవితం గడుపుతూ, పరలోక సాఫల్యం పొందాలన్నది ఇస్లామ్‌ ఆశయం. అందుకే జకాత్‌ , ఫిత్రాద్‌ ఖ, ఖైరాత్‌ అంటూ రకరకాల దానధర్మాలను ప్రోత్సహిస్తూ, సమాజంలో పేదరిక నిర్మూలనకు నిర్దిష్టమైన కార్యాచరణను ప్రతిపాదించింది.

పవిత్రఖురాన్‌ మార్గదర్శకంలో, ప్రవక్తవారి ఉపదేశానుసారం మనం మన జీవితాలను సమీక్షించుకుంటే, సంస్కరణ ఎక్కడ అవసరమో గుర్తించే వీలు కలుగుతుంది. తద్వారా ఆచరణకు మార్గం సుగమం అవుతుంది. ఇలాంటి స్వీయసమీక్షకు, సింహావలోకనానికి రమజాన్‌ కంటే మంచి తరుణం మరొకటి ఉండబోదు. అల్లాహ్‌ అందరికీ రమజాన్‌ శుభాలను సొంతం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించమని వినమ్రంగా వేడుకుందాం.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు