ప్రకృతికాంత పారవశ్యం

16 Dec, 2019 00:17 IST|Sakshi

ధనుర్మాస స్వగతం

హేమంతం వస్తే చాలు ఇంటింటా బంతులు, చేమంతులతో నా పాదాలకు పసుపు పసుపు పూసి, ఎర్రటి కారబ్బంతులతో పారాణి తీర్చి దిద్దుతారు.కుసుమ లావణ్య వతులకు ఈ మాసమంటే ఎంత సరదానో.

నా మనసు పరవళ్లు తొక్కుతోంది. నేటి నుంచి నెలనాళ్లు నాకు ప్రతి రోజూ పండుగే. ‘మల్లెలతో వసంతం... చేమంతులతో హేమంతం... వెన్నెల పారిజాతాలు..’ అని దేవులపల్లి కృష్ణశాస్త్రి నన్ను ఎంత అందంగా వర్ణించాడో! హేమంతం వస్తే చాలు ఇంటింటా బంతులు, చేమంతులతో నా పాదాలకు పసుపు పసుపు పూసి, ఎర్రటి కారబ్బంతులతో పారాణి తీర్చి దిద్దుతారు. తెలతెలవారుతుండగా ఇంకా తెలి మేను ముసుగు తొలగించకుండానే నా చిట్టితల్లులు పరికిణీని నడుములోకి దోపి, ముంగిళ్లకు కళ్లాపి స్నానం చేయించి, తెల్లటి ముగ్గుల రంగవల్లులతో వస్త్రధారణ చేసి, ప్రతి గుమ్మాన్ని అందమైన ముద్దుగుమ్మగా తీర్చిదిద్దుతారు. నాకు ఇంటింటా చీర సారె పెట్టినట్లే కదా. నేను ధరించే చీర మీద ఎన్ని అందాలో! ఒకరు పారిజాతాలు, ఒకరు నక్షత్రాలు, ఒకరు మారేడు దళాలు, మరొకరు జాజి తీగెలు, ఒకరు సన్నాయి మేళాలు, మరొకరు పొంగలి కుండలు, చెరకు గడలు, దీపాలు.. ఒక్కొక్కరు ఒక్కో అందమైన రంగవల్లితో చీర తయారుచేసి, నన్ను అలంకరిస్తుంటే, వారి కంటె ఎక్కువగా నేను ఆనందిస్తుంటాను.

వాకిట గొబ్బిళ్లు మాత్రం!
కుసుమ లావణ్యవతులకు ఈ మాసమంటే ఎంత సరదానో. వారికేంటి సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మ మాసాలలో మార్గశిర మాసం తానే అన్నాడు. నా జన్మ ధన్యమైనట్లే కదా. పిల్లలంతా గోమయాన్ని ఇచ్చే ఇళ్లకు తెల్లవారుజామునే వెళ్లి, వరుసలో నిలబడి, కావలసినంత పేడ తెచ్చుకుని, గొబ్బిళ్లుగా తీర్చిదిద్ది, పసుపు, కుంకుమలతో వాటిని అలంకరించి, తెల్లని కాంతులు జత చేసి, ఆ పైన గొబ్బిపూలతోను, రకర కాల రంగురంగుల పూలతో అలంకరిస్తుంటే.. నన్ను అలంకరించినట్లే భావిస్తాను. ఇక నా శ్రీకృష్ణుడికి ఈ మాసమంతా రుచికరమైన ప్రసాదాల ఆరగింపులే. అసలే వెన్న దొంగ, ఈ కమ్మటి వాసనలకు ఆ బాలగోపాలుడు ఎక్కడికీ పోలేడు.

హరిదాసులు.. హరి విల్లులు
హరిదాసులు విష్ణువుకి దాసులైపోతారు. ఒక చేతిలో చిటి వీణ, ఒక చేతిలో తాళాలు, తల మీద భిక్ష పాత్ర, నుదుటన విష్ణు తిరునామాలు పెట్టుకుని ‘హరీ! హరిలో రంగ హరీ! వైకుంఠధామా హరీ’ అంటూ పాదాలను అల్లుకున్న చిరు మువ్వలు సవ్వడి చేస్తూ, చేతిలోని చిటివీణెను, తాళాలను లయబద్ధంగా మేళవిస్తుంటే, శ్రీకృష్ణదేవరాయల మాలదాసరి నా మనసుకు స్ఫురిస్తాడు. హరికథలు చెప్పే ఆదిభట్ల నారాయణదాసు కూడా కళ్ల ముందు గజ్జెలు ఘల్లుమనేలా గాలిలోకి ఎగురుతున్నట్లు కనిపిస్తాడు.

నా హృదయం ఇందుకు సంబరంగా సన్నగా  సవ్వడులు చేస్తుంది.  గంగిరెద్దుల వారు ఇంటింటికీ వచ్చి ‘అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు’ అని అందరికీ సలాములు చేయిస్తుంటారు. గంగిరెద్దుల వీపులు ఇంద్రధనుస్సులా రంగురంగుల చీరెసారెలతో నిండిపోతాయి. ఎంత వింతో కదా.. గంగిరెద్దు చీరలను ధరించడం!  పాడి సంపద సమృద్ధిగా ఉంటేనే కదా నా సంతానమంతా కడుపునిండుగా భోజనం చేయగలుగుతారు. పంట చేతికి వచ్చి, సంపదలతో తులతూగుతూ, నన్ను ఆరాధిస్తూంటే తృప్తిగా ఉంటుంది నాకు.

ఇలలో వేల్పుల కొలువు
ఇవన్నీ చెప్పి, బొమ్మల కొలువు గురించి మాట్లాడకపోతే ఎలా! ధనుర్మాసానికి వీడ్కోలు పలుకుతూ భోగి నాడు భోగిమంటలు వేసుకుని, సాయంత్రం భోగిపళ్లు పోసుకుంటూ ఎంత భోగం అనుభవిస్తారో చిన్నారులు. వాటితో పాటు ఆడపిల్లలంతా వారిలోని ఆలోచనాశక్తికి పదునుపెట్టి, బొమ్మలకొలువులు ఏర్పాటుచేసి, ఇరుగుపొరుగులను పేరంటాలకు పిలుచుకుని, ఒకరికి ఒకరు అండగా ఉన్నామన్న భరోసా ఇస్తుంటే, ఒక తల్లిగా నాకు ఆనందమే కదా! ఆఖరి రోజున ఈ మాసాన్ని రథమెక్కించి సాగనంపుతుంటుంటే, ఆ భోగం చూడటానికి ఎన్ని కన్నులున్నా చాలవు కదా అనిపిస్తుంది. నన్ను మకరరాశిలోకి పంపేసి, ప్రజలంతా నెల్లాళ్ల పండుగకు ముగింపు పలుకుతుంటే, ఈ నెల్లాళ్ల అనుభూతులను ఏడాదిపాటు నెమరువేసుకుంటూ, మళ్లీ వచ్చే మార్గశిరం కోసం నిరీక్షించాల్సిందే. ఇదిగో మీకందరికీ ఈ ధనుర్మాసానికి స్వాగతం పలుకుతున్నాను. మీరెలాగూ నన్ను గౌరవంగా ఆహ్వానించి, సత్కరించడం ప్రారంభించారుగా. విజయోస్తు!
 – వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా