నా క్యారెక్టర్ మంచిది కాదని ఆఫీస్‌లో ప్రచారం...

12 Jun, 2016 23:10 IST|Sakshi
నా క్యారెక్టర్ మంచిది కాదని ఆఫీస్‌లో ప్రచారం...

బెదిరింపులు కూడా శిక్షార్హమైన నేరమే!
లీగల్ కౌన్సెలింగ్


నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ నా భర్తకు చేదోడు వాదోడుగా ఉన్నాను. మాకు ఒక్కరే సంతానం. ఉన్నంతలో పొదుపు చేసుకుంటూ హాయిగా ఉన్నాము. మేడమ్, మా ఆఫీస్‌లో ఒక అటెండర్ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలనుండి అతను తెలుసు నాకు. ఉద్యోగంతోపాటు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటాడు. ఒకరోజు వ్యాపారంలో నష్టమొచ్చిందని, ఒకరికి యాభైవేలు తక్షణం చెల్లించాలని చెప్పి కళ్లనీళ్ల పర్యంతమైనాడు. నన్ను డబ్బు ఏర్పాటు చేయమని ఎన్నోరకాలుగా ప్రాధేయపడ్డాడు. జాలిపడి నేను సర్దుబాటు చేశాను. నెలలో తిరిగి ఇస్తానని అన్నాడు. డబ్బు తీసుకొని మూడునెలలైంది. ఎంతో బతిమాలితే అడిగితే ఇరవై వేలు వాపసు చేశాడు. ముప్ఫైవేలు ఎగ్గొట్టాడు. నేను అతన్ని నమ్మి, జాలిపడి ఇంట్లో తెలీకుండా ఇచ్చాను. మిగిలిన డబ్బు ఇమ్మని ఎన్నోసార్లు అడిగాను. అతను ఇవ్వకపోగా, నన్ను బెదిరిస్తున్నాడు. నా క్యారెక్టర్ మంచిది కాదని ఆఫీస్‌లో ప్రచారం చేస్తానని, నా భర్తకు తెలియజేస్తానని, తీవ్రమైన మాటలతో వేధిస్తున్నాడు. ఆఫీస్‌లో నా ఫైల్స్ ధ్వంసం చేస్తానని బెదిరిస్తున్నాడు. దయచేసి నాకు పరిష్కారం తెలపండి.

 - బాలామణి, హైదరాబాద్

 
మీరు అంతపెద్దమొత్తం చేబదులు ఇచ్చినప్పుడు మీ ఇంట్లో చెప్పి ఉండవలసింది. లేకుంటే కనీసం మీ కొలీగ్స్ సమక్షంలోనైనా ఇచ్చి ఉండవలసింది. ఇలాటి బెదిరింపులనే ఐపీసీ సెక్షన్ 506 ప్రకారం నేరపూర్వక బెదిరింపులు లేదా క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు. ఒక మహిళ శీలవతి కాదు అని ప్రచారం చేస్తానని బెదిరించి, భయపెడితే, ఏవైనా వస్తువులను ధ్వంసం చేస్తానని బెదిరిస్తే అది నేరమౌతుంది. రెండు నుంచి ఏడు సంవత్సరాల జైలుశిక్షపడుతుంది. ముందు మీ కుటుంబ సభ్యులకు విషయం చెప్పి, వారి సహకారం తీసుకుని క్రిమినల్ కేస్ పెట్టండి. ఇకపై ఇలాంటి వ్యవహారాల్లో జాలి, దయలను విడనాడండి.

 

మేడమ్, మేము సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులం. మీకు చెప్పుకోవాలంటేనే బాధగా, సిగ్గుగా ఉంది. మా భార్యాభర్తలమిరువురం మా వృత్తులలో క్షణం తీరికలేకుండా ఉంటాము. మాకు ఒక్కడే బాబు. తొమ్మిది సంవత్సరాలు నిండాయి. కార్పొరేట్ స్కూల్‌లో వేశాం. ప్రత్యేకంగా కారు, డ్రైవర్‌ను ఏర్పాటు చేశాం. ఇంట్లో బాబు వ్యవహారాలు చూడటానికి ఒక ముప్ఫైసంవత్సరాల వ్యక్తిని పెట్టాం. అంటే కేర్‌టేకర్‌గా అన్నమాట. అతన్ని పూర్తిగా నమ్మి మేం నిశ్చింతగా ఉన్నాం. ఇటీవల బాబు తరచు అతని గురించి మాకు ఫిర్యాదులు చేస్తున్నాడు. అతను మంచివాడు కాదని చెబుతున్నాడు. మేం పట్టించుకోలేదు. బహుశా బాబును హోమ్‌వర్క్ చేసుకోమని, తినమని, ఆటలు తగ్గించి చదువుకోమని అంటున్నాడేమో అందుకని బాబుకు అతను నచ్చలేదని అనుకున్నాము. ఇంతలో మాకు మా అబ్బాయి ఒకరోజు పిడుగులాంటి మాటలు చెప్పాడు. అతను మా బాబు ప్రైవేట్ పార్ట్స్ తాకుతున్నాడని, ఎక్కడెక్కడో చేతులు వేసి హింసిస్తున్నాడని, తనకు భయమేస్తోందని, కొన్నిసార్లు కొడుతున్నాడని చెప్పాడు. బాబుపై లైంగిక దాడి జరుగుతోందని మాకు అర్థమైంది. మేం ఇన్నాళ్లూ వాడి  ఫిర్యాదులు పట్టించుకోనందుకు సిగ్గుతో చితికిపోతున్నాము. మేము కేసు వేయవచ్చా? ఒక యువకుడు ఒక బాలుడి పట్ల ఇలా ప్రవర్తిస్తే అది నేరమౌతుందా? - రంజని, సురేష్; సూర్యాపేట

 
మీ అనుమానం అర్థమైంది. కేవలం బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తేనే అది లైంగికదాడి అవుతుందని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ బాలుర పట్ల కూడా ఆ రకంగా ప్రవర్తిస్తే అది కూడా సెక్సువల్ అసాల్ట్ అవుతుంది. అంటే పిల్లల పట్ల (బాలురు, బాలికల) అలాంటి హేయమైన చర్యలు ఎవరు చేసినా అది నేరమౌతుంది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక చట్టముంది. అదే లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ చట్టం 2012. మీ బాబుపై జరుగుతున్నది లైంగిక దాడి. సెక్షన్ 7 ప్రకారం పిల్లల ప్రైవేట్ పార్ట్స్‌ను కానీ చెస్ట్‌ను కానీ, యానల్ భాగాలను కానీ లైంగిక ఉద్దేశ్యంతో తాకినా, లేక తమ వాటిని తాకేలా ప్రోత్సహించినా అది నేరమౌతుంది. అటువంటి వారికి మూడునుండి ఐదు సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా పడుతుంది. మీరు వెంటనే కేసు వేయండి. పిల్లలకు ప్రత్యేక న్యాయస్థానాలున్నాయి. మీరు ఇకపై ఎవరినీ గుడ్డిగా నమ్మి, పిల్లల బాధ్యతను వారికి పూర్తిగా అప్పగించకండి.

 

నేను లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నెలకోసారి నా చీరలను డ్రై క్లీనింగ్‌కి ఇస్తాను. నెలకిందట పదివిలువైన పట్టుచీరలు డ్రైక్లీనింగ్‌కి ఇచ్చాను. ఇచ్చిన వారం తర్వాత బట్టలు తెచ్చుకోవడానికి వెళ్లాను. నా చీరల్లో మూడుచీరలు దాదాపు కాలిపోయి ఉన్నాయి. షాప్ అతడిని నిలదీస్తే చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని, అందువల్ల కాలిపోయాయని చెప్పాడు. అవి కొత్త చీరలు. కొని రెండు నెలలైనా కాలేదు. నా దగ్గర వాటి బిల్స్ కూడా ఉన్నాయి. వాటి విలువ చెల్లించమని అడిగాను. అతను చాలా నిర్లక్ష్యంగా వారిచ్చిన రశీదు వెనక భాగంలోని షరతులను చదవమన్నాడు. అందులో బట్టలు కాలిపోతే, దొంగతనంలో పోతే, మారిపోతే, ఆ దుస్తుల విషయంలో యజమాని బాధ్యత కేవల యాభై శాతం మాత్రమే అని ఉంది. ఇంకా అనేక షరతులు కూడా ముద్రించి ఉన్నాయి. మేడం, నిజంగా యజమాని బాధ్యత కొంతవరకేనా? నేను ఏం చేయలేనా? -డి.వరలక్ష్మి, హైదరాబాద్

 

సామాన్యంగా మనమెవరమూ రశీదుపై ఏం ప్రింట్ చేసి ఉందో, వెనక భాగంలో ఏమి ముద్రించి ఉందో ఏనాడూ చూడము. చూసే ప్రయత్నం చేసినా, అవి చాలా చిన్నరాతతో సూక్ష్మంగా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం కేసు వేయవచ్చు. మీ వద్ద రశీదు, దుస్తుల వివరాలు, వాటిని ఖరీదు చేసిన బిల్లులు ఉన్నాయి కదా! సరిగ్గా మీలాంటి కేసులోనే టిప్‌టాప్ డ్రైక్లీనర్స్ వర్సెస్ సునీల్ కుమార్ లో 2003 సంవత్సరంలో జాతీయ వినియోగదారుల కమిషన్ వారు రశీదు వెనక పక్క ఉన్న షరతులను వినియోగదారులపైన రుద్దడానికి వీలులేదని, వాటికి అతడు బద్ధుడు కాడని, ఏకపక్షంగా రాసుకున్న షరతుల వల్ల షాపు యజమానికి ఎలాంటి రక్షణా లభించదని తీర్పు చెప్పారు. మీకు చట్టప్రకారంగా షాపువారు దుస్తుల రేటును, నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలి కనక మీ దుస్తుల ఖరీదు మీకు వస్తుంది. 

 

>
మరిన్ని వార్తలు