కుట్ర కోణం

31 Aug, 2019 07:18 IST|Sakshi

రాజకీయాల్లో తరచుగా వినపడే కోణం.. కాన్‌స్పిరసీ థియరీ! దివంగత ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణం వెనక ఉన్న కోణాన్ని చూపించడానికి తీసిన సినిమా ‘‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌!’’అన్ని కోణాలూ ఆవిష్కరించిన పాత్రికేయురాలురాగిణి ఫూలే వెనక కూడా ఒక కాన్‌స్పిరసీ ఉన్న విషయాన్నీనాటకీయంగా బహిర్గతం చేస్తుందీసినిమా...

‘‘కౌన్‌ కహెతాహై కి మరే హుయే పీఎం సే కిసీకో ఫాయిదా నహీ హోతా (ఎవరన్నారు.. చనిపోయిన ప్రధాని వల్ల ఎవరికీ లాభం ఉండదని)’’.. అనే లైన్‌ ఆధారంగా అల్లుకున్న సినిమానే ‘‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌!’’ జీ5లో స్ట్రీమ్‌ అవుతోంది.తాష్కెంట్‌ అనగానే గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి దివగంత ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. తర్వాత 1966లో పాకిస్తాన్‌తో మైత్రి ఒడంబడిక మీద తాష్కెంట్‌లో చర్చలు జరిగాయి. ఆ ఒడంబడిక మీద సంతకం చేశాక కొన్ని గంటలకే.. అంటే 1966, జనవరి 11న (తాష్కెంట్‌లోనే) చనిపోయారు. గుండెపోటుతో కన్నుమూసినట్టు ప్రకటించారు. అయితే ఈ మరణం మిస్టరీ అంటూ ‘‘తాష్కెంట్‌ కాన్‌స్పిరసీ థియరీలు’’ చాలా ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘‘ఆయన మీద విషప్రయోగం జరగడం వల్లే ప్రాణాలు పోయాయని.. అది బయటపడకుండా ఆయన శరీరంలోంచి ఆ విషాన్ని తీశారని.. దీనికి గుర్తుగా ఆయన శరీరం మీద గాట్లు, రక్తం మరకలూ ఉన్నాయ’’నే థియరీ. దీన్ని పట్టుకునే ‘‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’’ సినిమా నడుస్తుంది. ఈ థియరీని బలపరిచే ఆధారాలతో ఉన్న డాక్యుమెంట్స్, వ్యాసాలు, ఇంటర్వ్యూలు, కేజీబీ అండ్‌ ది వరల్డ్‌ అనే పుస్తకం, లాల్‌బహదూర్‌ శాస్త్రి కుటుంబ సభ్యుల రిఫెరెన్సెస్‌ను ఈ సినిమాలో పొందుపరిచారు. అలాగే ఆయన ప్రెస్‌ సెక్రటరీ కుల్‌దీప్‌ నయ్యర్, జర్నలిస్ట్‌ అంజు ధార్‌ల కామెంట్స్‌నూ ఇందులో చూపించారు.

అసలు కథలోకి...
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడ్తున్న తరుణం.. రాగిణి ఫూలె (శ్వేత బసు ప్రసాద్‌).. అనే జర్నలిస్ట్‌ మీద పొలిటికల్‌ స్కూప్‌కి సంబంధించి విపరీతమైన ఒత్తిడి పెడ్తూంటాడు ఆమె బాస్‌. ఫలానా తేదీ నాటికి సంచలన వార్త తేవాలని డెడ్‌లైన్‌ కూడా నిర్ణయిస్తాడు. ఆ వేటలో పడ్తుంది రాగిణి. సరిగ్గా ఆ సమయంలోనే ఒక అపరిచిత ఫోన్‌కాల్‌ వస్తుంది ఆమెకు. లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణానికి సంబంధించిన మిస్టరీని సంచలన వార్తగా మలచుకొమ్మని.. క్లూస్‌ ఇస్తామంటూ! అన్నట్టుగానే ఆ ఆధారాలన్నిటినీ పంపిస్తారు. వాటిని ఆమె చదివి.. చూసి.. ఆ మిస్టరీ డెత్‌కు సంబంధించిన వార్తా కథనాన్ని పేపర్లో రాస్తుంది. ఆ వార్త నిజంగానే సంచలనం అవుతుంది. ప్రభుత్వ, ప్రభుత్వేతర ఢిల్లీ కేంద్ర రాజకీయాల్లోనూ రచ్చ జరుగుతుంది. లాల్‌బహదూర్‌ శాస్త్రిది హత్య అని చెప్తున్న ఆ వార్తలోని విషయాల నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిందిగా హోం మినిస్టర్‌ (నసిరుద్దీన్‌ షా) ఒక కమిటీని ఏర్పాటు చేస్తాడు. తొమ్మది మంది సభ్యులతో కూడిన ఆ కమిటీకి శ్యామ్‌ సుందర్‌ త్రిపాఠీ (మిథున్‌ చక్రవర్తి) అనే రాజకీయ నాయకుడు అధ్యక్షుడు. చరిత్రకారిణి ప్లస్‌ జర్నలిస్ట్‌ అయేషా అలీ షా (పల్లవి జోషి), ఎన్‌జీవో నిర్వాహకురాలు ఇందిరా జోసెఫ్‌ రాయ్‌ (మందిరా బేడీ), వార్త రాసిన రాగిణి ఫూలేతోపాటు జ్యుడీషియరీ, పోలీస్, ఇంటెలిజెన్స్‌ మొదలైన రంగాలకు చెందిన నలుగురు పురుషులూ ఉంటారు. విచారణ మొదలవుతుంది.

ఇంకోవైపు..
దేశ రెండో ప్రధాని సహజ మరణాన్ని హత్యగా ప్రచారం చేస్తోందని రాగిణిని యాంటీ నేషనలిస్ట్, దేశ ద్రోహిగా సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తారు. ఆమెమీద బహిరంగ దాడులకూ దిగుతారు. బయట ప్రచారంలో ఉన్న అర్ధ సత్యాలను, ఇంటర్‌నెట్‌ ఫేక్‌ సమాచారంతో వార్తా కథనాన్ని రాసిందని చివరకు ఆమెను కమిటీలోంచి కూడా బహిష్కరిస్తారు. తాను రాసినవి అబద్ధాలు కావని రుజువు చేసుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలని కమిటీకి అర్జీ పెట్టుకుంటుంది రాగిణి.

అసలు ఈ హత్యోదంతం ఇప్పుడెందుకు తెరమీదికి?
రానున్న ఎన్నికల్లో తమ గెలుపుకోసం లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణాన్ని ఒక ఎజెండాగా పెట్టుకోవడానికి. ఆ కాన్‌స్పిరసీ థియరీ వార్త పత్రికలో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చేలా.. వచ్చాక సెన్సేషన్‌ అయ్యేలా అధికార పార్టీయే చేయిస్తుంది. అపరిచితుడి ద్వారా రాగిణికి ఫోన్, అందిన లీడ్, విచారణ కమిటీ.. అన్నిటికీ అధికార పార్టీయే కర్త. కమిటీ ఏర్పాటుకు ముందు రాగిణీని పిలిచి.. కమిటీలో సభ్యురాలిగా ఉండి.. తాను చెప్పినట్టు చేస్తే కొత్త వార్తా చానల్‌కు ఓనర్‌ను చేస్తానని అంటాడు నేత శ్యామ్‌సుందర్‌ త్రిపాఠీ. ఆ క్రమంలోనే ఆమె మీద దాడులు.. కమిటీ నుంచి బహిష్కరణ.. తిరిగి అర్జీ ఎట్‌సెట్రా.

ఫైనల్‌ డే..
కమిటీ మెజారిటీ అభిప్రాయం ప్రకారం.. రాగిణి అర్జీని స్వీకరించి విచారణ ముగింపు రోజు ఆమెను కమిటీకి పిలుస్తారు. మీడియాకూ ఆహ్వానం ఉంటుంది. ఆ సమావేశంలోనే రాగిణి.. లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణానికి సంబంధించిన ఒక నివేదికను బయటపెడుతుంది. అందులో ఆయన మీద విషప్రయోగం జరిగి ఉండొచ్చని, కాని పోస్ట్‌మార్టమ్‌ చేస్తేకాని దాన్ని నిర్ధారించలేమని రాసి ఉన్న వాక్యం ఆధారంగా తన వాదనను వినిపిస్తుంది. పోస్ట్‌మార్టమ్‌ ఎందుకు చేయించలేదు అప్పటి ప్రభుత్వం అని నిలదీస్తుంది. దానికి అనుబంధంగా వచ్చిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానమిస్తుంది. లాల్‌ బహదూర్‌ శాస్త్రి చనిపోయిన తర్వాత పదేళ్లకు.. ఎమర్జెన్సీ టైమ్‌లో అప్పటి అధికార పార్టీ .. మన రాజ్యాంగంలో సోషలిస్ట్‌ పదాన్ని చేర్చిన విషయాన్ని.. అలా ఎందుకు చేర్చారు అన్న వివరణనూ ఇస్తుంది రాగిణి. ఇండియాను రష్యాకు కాలనీగా మార్చుకోవడానికి కేజీబీ ప్రయత్నించిందని దానికి అప్పటి ప్రభుత్వం సహకరించిందని.. అందులో భాగమే సోషలిస్ట్‌ అనే పదాన్ని చేర్చడమని, లాల్‌బహదూర్‌ బతికి ఉంటే ఇవన్నీ జరిగి ఉండేవి కావని.. అందుకే అతని హత్యకు కుట్రపన్నారని చెప్తూ.. వాటికి సంబంధించిన ఆధారాలను, నివేదికలను, పుస్తకాలను, కుల్‌దీప్‌ నయ్యర్, అంజు ధార్‌ వంటి వాళ్ల వీడియో ఇంటర్వ్యూలను చూపిస్తుంది. మొత్తానికి భారతదేశ రెండో ప్రధానిది కచ్చితంగా హత్యేనని.. కాబట్టే పోస్ట్‌మార్టమ్‌ చేయకుండా నిర్లక్ష్యం చేశారనే ముగింపునిస్తుంది రాగిణి. ఈ తీరునంతా మీడియా రికార్డ్‌ చేస్తుంది.

ఎట్‌ ది ఎండ్‌..
‘‘మీరు చెప్పినట్టు.. చేశానా? పాస్‌ అయ్యానా?’’ అని అడుగుతుంది రాగిణి.. కమిటీ చైర్మన్‌ త్రిపాఠీని. నవ్వుతూ ‘‘వెల్‌కమ్‌ టు పాలిటిక్స్‌’’ అని చెప్పి వెళ్లిపోతాడు త్రిపాఠి. ఆ మాటకు నిశ్చేష్టురాలవుతుంది రాగిణి.పాలిటిక్స్, జర్నలిజం వేరు వేరు కావు అని ఆ సినిమాలోనే ఒక చోట అంటాడు త్రిపాఠి. అలా ఓ సంచలన వార్త కోసం ఆకలిగా ఉన్న ఒక జర్నలిస్ట్‌ను అన్వేషించి.. సెన్సేషన్‌ను ఎర వేసి.. ఆ జర్నలిస్ట్‌కు తెలియకుండానే ఆమెతో రాజకీయం చేయిస్తారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణానికి చుట్టుకున్న అనేక కాన్‌స్పిరసీ థియరీల్లో ఒకదాన్ని వచ్చే ఎన్నికల్లో తమ గెలుపుకి ఎజెండాగా సెట్‌ చేసుకుంటారు. కనుకే హోమ్‌ మినిస్టర్‌ అంటాడు.. ‘కౌన్‌ కహెతాహై కి మరే హుయే పీఎం సే కిసీకో ఫాయిదా నహీ హోతా’’ అని. ఈ సినిమాకు వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి దర్శకుడు.– సరస్వతి రమ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు