బెడ్‌రూమ్‌లోకి ఎంట్రీ ..

11 Jul, 2015 11:40 IST|Sakshi
బెడ్‌రూమ్‌లోకి ఎంట్రీ ..

 సమ్‌థింగ్ స్పెషల్

పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. మరి ఆచారాలో.. అవి మనుషులు వారికి అనుగుణంగా తమ ఇంటి రాజ్యాంగంలో రాసుకున్నారు. అవి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. అంతేకాదండోయ్.. ఆ ఆచారాల్లో కొన్ని  వింత చేష్టలూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఉండే వివాహ ఆచారాలు చదవండి. తప్పకుండా ముక్కు మీద వేలు వేసుకుంటారు.

 నెల రోజుల కఠిన పరీక్ష : చైనాలో ఓ వింత ఆచారం ఉంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచి ఆ పెళ్లి కూతురు రోజుకో గంట తప్పకుండా ఏడ్వాల్సిందేనట. అంతేకాదు, పది రోజుల తర్వాత ఆ నవ వధువుకు తోడుగా వాళ్ల అమ్మ కూడా ఆ ఏడుపులో పాలు పంచుకోవాలి. మరో పది రోజుల తర్వాత ఆమెకు వాళ్ల అమ్మమ్మ తోడవుతుంది. నెల చివర్లో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో మహిళలంతా ఆమెకు సహాయంగా ఏడుస్తారు. అలా ఆడవారి ఏడుపుతో వచ్చే వివిధ రాగాలను పెళ్లి వారంతా ఆనందిస్తారట.

 పెళ్లి చేయాలంటే బ్యాంక్‌కు కన్నం వేయాల్సిందే! ఫిజీ దేశంలో పెళ్లి కొడుకు అడిగే లాంఛనాలే వేరు. ఎక్కడైనా అమ్మాయితో పాటు నగోనట్రో పంపమంటారు. కానీ అక్కడి పెళ్లి కొడుకు పిల్లనిచ్చే మామను అమ్మాయితో పాటు తిమింగలం దంతాన్ని అడుగుతాడట. మరి దాన్ని ఇచ్చి పిల్లకు పెళ్లి చేయాలంటే అమ్మాయి తండ్రి ఆస్తి మొత్తం అమ్మడంతో పాటు దొంగతనాలూ చేయక తప్పదు.


ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చు : స్వీడన్ దేశంలో ఓ వింత ఆచారం ఉంది. వివాహ రిసెప్షన్‌లో నవ దంపతులు కూర్చున్న చోటు నుంచి పక్కకు వెళితే చాలు. వారిని ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చట. అమ్మాయో లేక అబ్బాయో వారి కుర్చీ నుంచి లేచి బాత్‌రూమ్‌కు వెళ్లినా సరే. అమ్మాయినైతే అక్కడి పురుషులు, అబ్బాయినైతే మహిళలు నిరభ్యంతరంగా ముద్దు పెట్టుకోవచ్చట.

బెడ్‌రూమ్‌లోకి ఎంట్రీ : పెళ్లైనాక మొదటి రాత్రి తంతులో కొత్త దంపతులకు తోడుగా ఓ పెద్దావిడను బెడ్‌రూమ్‌లోకి పంపుతారట. ఈ వింత ఆచారం ఆఫ్రికాలోని కొన్ని పల్లెటూళ్లలో ఉంది. ఆ పెద్దావిడ పెళ్లి కూతురు తల్లి అయినా కావచ్చట. 

నవ్వితే నో మ్యారేజ్ : కాంగోలో పెళ్లి ఆచారం గమ్మత్తుగా ఉంటుంది. పెళ్లి తంతు ముగిసే వరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు నవ్వకూడదట. అలా నవ్వితే అరిష్టంగా భావించి వివాహమే రద్దు చేస్తారట.
 

 

>
మరిన్ని వార్తలు