రాహుకేతువులు

11 Jul, 2018 00:49 IST|Sakshi

అమావాస్య రోజు వెన్నెలలాంటి  జీవితాలను మింగేసిన రాహు, కేతువుల క్రైమ్‌ స్టోరీ ఇది.

చిమ్మచీకటి. వీధిలో పడుకుని ఉన్న కుక్క దెయ్యాన్ని చూసినట్టు ఉలిక్కిపడి ఒకటే పనిగా అరవడం మొదలుపెట్టింది. ఊరికి దూరంగా ఉన్న కాలనీ. ఒకటే పెంకుటిల్లు. పేరుకు ఉన్న ప్రహరీ గోడ. బలహీనమైన గేటు. కుక్క అరుస్తూనే ఉంది. ఒక ఆకారం ఆ ఇంటికి దగ్గరైంది. కుక్కకు ఏం దడుపు పుట్టిందో కీచుమని అరుస్తూ అక్కడి నుంచి పరిగెత్తి పోయింది. ఆ ఆకారం ప్రహరి దూకింది. వరండాలో భార్యాభర్తలు రెండు నులకమంచాల మీద నిద్రపోతున్నారు. అటూ ఇటూ చూసింది. ముంగిటలో రోకలి బండ. దానిని అందుకుంది. పెద్ద సమయం తీసుకోలేదు. ఫట్‌. భర్త తల పగిలింది. ఫట్‌. ఈసారి భార్య తల. లోపలి గదిలో నిద్ర పోతున్న కూతురు ఆ అలికిడికి ఉలిక్కిపడి లేచింది. పద్దెనిమిదేళ్ల ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ నిలబడింది ఆ ఆకారం.

అనాయాస మృత్యువు వరం అంటారు.కాని భయానక మృత్యువు దాపులోనే పొంచి ఉంటే?అది ఎప్పుడు వస్తుందో తెలియకపోతే?ఎవరు చంపుతారో తెలియకపోతే?ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే అలాంటి హత్యలు చాలానే అయ్యాయని తెలిస్తే?తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా అలాంటి పుకార్లతో ఒణుకుతోంది. దాంతోపాటు దాని సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలోనిప్రజలు కూడా ఒణుకుతున్నారు.  రాత్రిళ్లు గస్తీ తిరుగుతున్నారు. అనుమానాస్పద వ్యక్తి గ్రామంలోకి వస్తే చంపేయడానికి వెనుకాడటం లేదు.ముఖ్యంగా అమావాస్య రోజున. ఎందుకంటే చావులన్నీ అమావాస్య రోజునే జరుగుతున్నాయి కనుక. 

1998 మే 27. ఉదయం 10 గంటలు. గాడ్పులతో వేడిగా ఉన్న సమయం.చిత్తూరు ఎస్పీ కార్యాలయం. ఎస్పీ సీటులో కూర్చొని ఉన్నాడు.టేబుల్‌ మీద ల్యాండ్‌లైన్‌ రింగ్‌ అవుతోంది.1.. 2..3.. 4.. 5... ఎస్పీ ఎంతకూ తీయడం లేదు. ఎవరు చేసి ఉంటారో ఎస్పీకి తెలుసు. ఎందుకు చేసి ఉంటారో కూడా ఊహించగలడు. 6వసారి ఫోన్‌ మోగుతోంది. లిఫ్ట్‌ చేయక తప్ప లేదు. లిఫ్ట్‌ చేసి‘గుడ్‌ మార్నింగ్‌ సర్‌’ అన్నాడు.‘వాట్‌ మిస్టర్‌... ఈ రోజు కూడా రెండు మర్డర్లు జరిగినట్లుంది...’ అవతలి నుంచి డీజీపీ.‘అవున్సార్‌’‘ఇప్పటికే 38 మర్డర్లు జరిగాయి. చిన్న క్లూ కూడా సంపాదించలేదు. ఏం చేస్తున్నారు?ఎందుకున్నట్టు మీరు సీటులో? సిగ్గుగా లేదూ’‘ఐ ట్రై మై లెవెల్‌ బెస్ట్‌ సర్‌’ ఎస్పీ చెబుతుండగానే అవతలి నుంచి రిసీవర్‌ పెట్టేసిన చప్పుడు.ఎస్పీ తలపట్టుకున్నాడు. వరుస హత్యలు. అంతర్జాతీయ నేరస్తుల పనా? టెర్రరిస్టుల పనా?  ఎవరా కిరాతకులు? ఎందుకీ దారుణాలు చేస్తున్నారు?’ ఎస్పీ ఆలోచిస్తున్నాడు.   కిందటి కేసు తాలూకు ఫైల్స్‌ చూస్తున్నాడు. అన్నీ ఒకే విధమైన చావులు.  నిద్రలో ఉండగానే తలపైన బలంగా కొడుతున్నారు. దీంతో నిద్రలోనే వాళ్లు కన్నుమూస్తున్నారు. తలుపు గడియపైన, ఇంట్లో పోపు డబ్బాలపైనా, నీళ్లు తాగిపడేసిన గ్లాసులపైన పడిన ఫింగర్‌ ప్రింట్స్‌ ఆధారాలను సేకరించారు. కానీ, చాలా చోట్ల అవి దొరకడం లేదు. దొరికినా కొన్నిచోట్ల సరిగా కనిపించడం లేదు. ఛేదిండం ఎలా?!

ఉదయం 10.22 గంటలకు ఫింగర్‌ ప్రింట్స్‌ ఎస్సై ఎస్పీ ఆఫీసుకు వచ్చాడు.‘సర్‌’ఫైల్‌లోంచి తలెత్తి చూస్తూ ‘వాట్‌ ఈజ్‌ ద ప్రొగ్రెస్‌ మిస్టర్‌ ఎస్సై’ అన్నాడు.‘ఒక క్లూ దొరికింది సర్‌..’ఏంటన్నట్టు ఆసక్తిగా చూశాడు ఎస్పీ.‘చంపింది టెర్రరిస్ట్‌లో, అంతర్జాతీయ క్రిమినల్సో కాదు’ఎస్పీ సీటులోనే నిటారుగా కూర్చున్నాడు. ‘ఏం చెబుతున్నావ్‌ మిస్టర్‌’‘అవును సర్‌. ఈ వరస హత్యలు చేసేది ఇక్కడివాళ్లే’.‘ఎలా చెబుతున్నావ్‌’? 
‘నిన్న రాత్రి కొత్తపల్లిమిట్టలో జరిగిన ఘటనలో భార్యాభర్తలైన వజ్రవేలు, శకుంతలమ్మలను తలపై బలంగా మోది చంపేశాడు హంతకుడు. వాళ్ల కూతురు బుజ్జమ్మను రేప్‌ చేశాడు. బుజ్జమ్మ అరుస్తుండటంతో‘కత్తునా కొన్నుడువే’ అని బెదిరించాడట సర్‌. మన విచారణలో తేలింది.’ ‘అంటే...’ అన్నాడు ఎస్పీ.‘అరిచావో చంపేస్తా అని అర్థం సర్‌’‘అంటే హంతకుడు తమిళనాడుకు చెందిన వ్యక్తి అంటావా’?‘సరిహద్దు ప్రాంతం కదా సార్‌. తెలుగు, తమిళం తెలిసిన వారు చాలా మంది ఉన్నారు. తెలుగువాడైనా అయ్యి ఉండొచ్చు’ ‘గుడ్‌ లాజిక్‌. ఫిబ్రవరి నెలలో పిచ్చాటూరులో జరిగిన హత్య కేసులో ఫింగర్‌ ప్రింట్స్‌ దొరికాయి కదా.. వాటిని ఈ రోజు దొరికిన ఫింగర్‌ ప్రింట్స్‌తో టాలీ చేశారా?’ అన్నాడు ఎస్పీ. ‘చేశాం సార్‌?’‘ఏంటి రిజల్ట్‌’‘రెండూ వేరు వేరు సార్‌’ఎస్పీ పజిల్డ్‌గా చూశారు.‘సరే. మన జిల్లాలో ఇప్పటి వరకు సేకరించిన పాత నేరస్తుల ఫింగర్‌ ప్రింట్స్‌తో  వీటిని చెక్‌ చెయండి. జిల్లాలో పోలీస్‌ స్టేషన్‌కి వచ్చే ప్రతి ఒక్కరి ఫింగర్‌ ప్రింట్స్‌ తీసుకోండి. చిన్న అనుమానంవచ్చినా అరెస్టు చేయండి. వెంటనే జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు ఇన్‌ఫామ్‌ చేయండి. ఫాస్ట్‌’ అలర్ట్‌ చేశాడు.

జిల్లాలో అన్ని పోలీస్‌ స్టేషన్లలోనూ వేలిముద్రలు తీసుకుంటున్నారు. టెస్ట్‌ చేస్తున్నారు. ఎక్కడా పిచ్చాటూరులో దొరికిన ఫింగర్‌ ప్రింట్‌తో అవి సరిపోలడం లేదు. అలాగే కొత్తపల్లిమిట్టలో దొరికిన ఫింగర్‌ ప్రింట్‌తో కూడా సరిపోవడం లేదు.పోలీసులు ఓ వైపు ఆధారాల కోసం వెతుకుతూనే ఉన్నారు. రెండు రోజుల్లోనే చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం కడప జిల్లా కోడూరులో మరో ఇద్దరిని చంపేశారు హంతకులు.పోలీసులు హడలిపోయారు. అప్పటికే నిందితుడిని పట్టించినవారికి లక్షల రూపాయల్లో రివార్డ్‌ ప్రకటించారు. కాని లాభం లేకపోయింది. ఎవరూ ఎక్కడి నుంచీ సమాచారం ఇవ్వడం లేదు. చిత్తూరు, తమిళనాడు, కడప, నెల్లూరు జిల్లాలలోని పాత నేరస్తులవి 9 లక్షల వేలిముద్రలను పరిశీలించారు. సరిపోలేదు. పోలీసులు మరింత నిఘా పెంచారు. అయినా నేరస్తులు ఛాలెంజ్‌ చేసినట్లు జూన్‌ 15న తిరువళ్లూర్‌ జిల్లా గాలూరులో ఒక మహిళను, జూన్‌ 22న పల్లిపట్టులో మరొక మహిళను హత్య చేశారు. 

జూన్‌ 23.తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫోన్‌ మోగింది. ‘సార్, మా వాడలో ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నారు, ఎంత అడ్డుకున్నా వారు వినడం లేద’ని ఆ ఫోన్‌ సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.అప్పటికే ఆ గొడవలో ఇద్దరికీ విపరీతంగా గాయాలయ్యాయి. రక్తం కారేలా కొట్టుకున్నారు వారు. ఇద్దరినీ అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కి తరలించారు. మిగతావారిలాగానే వీరి వేలిముద్రలనూ తీసుకొని ల్యాబ్‌కి పంపించారు.అవి పిచ్చాటూరులో లభించిన పంచదార డబ్బా మీద దొరికిన వేలిముద్రతో సరిపోలడంతో పోలీసులు అవాక్కయ్యారు.విచారణ చేపట్టారు. విషయం విన్న పోలీసులు నిర్ఘాంతపోయారు. ఇన్నాళ్లూ తమ కళ్లు కప్పి 40 మందిని పొట్టన పెట్టుకున్న ఆ ఇద్దరు నేరస్తులను కటకటాల వెనక్కి పంపించారు. వారిద్దరు గుండ్ల గోపాల్, గుండ్ల సుబ్రమణ్యం.ఇద్దరూ సోదరులే కావడం ఈ కేసులో మరింత ఆశ్చర్యం కలిగించిన అంశం.

చిత్తూరులోని పెనుమూరు మండలం పాకాల గ్రామం గోపాల్, సుబ్రమణ్యంలది. ఇద్దరూ తల్లిదండ్రులతో కలిసి కూలిపనులు చేసుకొని పొట్ట పోషించుకునేవారు. ఒకరోజు గోపాల్‌ ఎవరికీ చెప్పాపెట్టకుండా ఊరొదిలి వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు అతడు రైల్వే కూలీగా పని చేస్తున్నట్టు తల్లిదండ్రులకు తెలిసింది. అయితే వ్యసనాల బారిన పడిన గోపాల్‌ డబ్బులు సరిపోక రైళ్లలో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. కొన్నాళ్లకు తమ్ముడు సుబ్రమణ్యం కూడా అన్నదారిలోనే నడవడం మొదలుపెట్టాడు. ఇద్దరూ రైల్వే కూలీలుగా పనులు చేసుకుంటూ, దొంగతనాలు చేసుకుంటూ జల్సాలు చేసుకునేవారు. ఒకసారి ఈ అన్నదమ్ములకు ఓ రౌడీషీటర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం దొంగతనాల నుంచి హత్యలు చేసేంతవరకు వెళ్లింది.
 
ముందుగా ఓ గ్రామాన్ని ఎంచుకొని, అక్కడ కూలీ పనులు చేసేవారిగా నటించడం మొదలుపెట్టేవారు.  పనులు చేసుకుంటూనే రెక్కీ నిర్వహించి ఏ ఇల్లు తాము దొంగతనం చేయడానికి అనుకూలంగా ఉందో చూసుకునేవారు. ఇంట్లోని సామాగ్రి, ఆ ఇంటి మనుషుల మీద ఉండే బంగారాన్ని గమనించేవారు. ఊరికి దూరంగా, పెద్దగా జనం ఉండని ఇళ్లను ఎంచుకునేవారు. అమావాస్యనాడైతే జనాల్లో ఓ భయం ఉంటుందని ఆ రోజునే దొంగతనాలకు బయల్దేరేవారు. ఆ రాత్రి సమయంలో ఒంటిమీద బట్టలన్నీ తీసేసి, వేలిముద్రలు పడకుండా మట్టిæపూసుకొని బయల్దేరేవారు. అర్ధరాత్రుళ్లు ఇళ్లలోకి చొరబడి పడుకున్నవారు లేవకుండా తల మీద రోకలి బండతో బాదేవారు. దీంతో బాధితులు అక్కడికక్కడే మరణించేవారు.

అలా రెండేళ్లలో వరుసగా 40 హత్యల వరకు చేశారు. ఒక్కోసారి విడివిడిగా హత్యలు చేసేవారు. అందుకే అన్న వేలి ముద్రలు దొరికిన చోట తమ్ముడి వేలి ముద్రలు దొరకలేదు. ఇవి రెండూ ట్యాలీ కాకపోవడంతో పోలీసులకు చిక్కు ఏర్పడింది. పిచ్చాటూరులో అన్న గోపాల్‌ హత్య చేశాక డబ్బు కోసం  ఇంట్లో ఉన్న డబ్బాలు వెతుకుతూ పంచదార డబ్బా కూడా చూశాడు. అందుకే దాని మీద మాత్రం అతడి వేలిముద్ర దొరికింది. అయితే అది మొదటిసారి కనుక ఆ వేలి ముద్ర ఎవరితోనూ సరిపోలేదు. చివరకు ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య చోటుచేసుకున్న డబ్బు వివాదం వారిని పోలీసు స్టేషన్‌కి చేర్చింది. అన్నదమ్ముల ఫింగర్‌ప్రింట్స్‌ తీసుకున్న పోలీసులు ల్యాబ్‌కి పంపించి చెక్‌ చేయగా, వాటిలో ఒకటి పంచదార డబ్బా మీద దొరికిన ఫింగర్‌ ప్రింట్‌తో సరిపోలాయి. అనుమాన నివృత్తి కోసం నాలుగైదు సార్లు ఫింగర్‌ ప్రింట్స్‌ చెక్‌చేసిన తర్వాత ఈ అన్నదమ్ములే నిందితులని రూఢీ చేసుకుని విచారించారు. దీంతో వారు తాము ఏయే ప్రాంతాలలో దొంగతనాలు, హత్యలు చేసింది వివరించారు. 

కొందరు నిందితులకు శిక్షలు వెంటనే వేయాలి.ఈ అన్నదమ్ములను జీప్‌లో తరలిస్తుండగా తిరుపతి దగ్గర మామండూరు అటవీప్రాంతంలో తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు.ఆ విధంగా వారి ఎన్‌కౌంటర్‌ జరిగింది.జనం సంతోషపడ్డారు.నిజం తెలిసిన తల్లిదండ్రులు కొడుకుల శవాలను కూడా తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు.  
– గాండ్లపర్తి భరత్‌రెడ్డి, సాక్షి, చిత్తూరు 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా