రాశి ఫలాలు (31-08-2019 నుంచి 06-09-2019)

31 Aug, 2019 08:21 IST|Sakshi

జన్మనక్షత్రం తెలియదా? నో ప్రాబ్లమ్‌! మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు) మీ రాశి ఫలితాలు డా‘‘ మైలవరపు శ్రీనివాసరావు జ్యోతిష్య పండితులు

మేషం(మార్చి 21 –ఏప్రిల్‌ 19)
నిదానంగా ప్రవహిస్తున్న నది తనకి ఎక్కడైనా ఇరుకు మార్గం గాని వచ్చినట్లయితే వేగాన్ని ఎలా పెంచుకుంటుందో ఆ వేగం కారణంగా మరింత తొందరగా సాగిపోతుందో అలా మీరు నిజానికి వాద వివాదాలతో పనిని సాగించుకునే మనస్తత్వం కలవాళ్లు కాకపోయినా, ఒకరిద్దరి జోక్యం కారణంగా మీ పని ఆగిపోతున్న భావన మీకు కలగ్గానే ఆవేశంతో మాట్లాడతారు. ఆ కారణంగానే పని పూర్తవుతుంది కూడా. ఆ మీదట ఎవరి జోక్యం వల్ల పని మొదట్లో ఆగిపోవచ్చిందో వాళ్ల మీద విరుచుకు పడ్డ మీరు‘పొరపాటయింది’ వంటి మాటల్ని మాట్లాడకండి.
పని పూర్తికావడమే ధ్యేయంతో సాగే కారణంగా అనుకున్న దానికి మించి ఖర్చయ్యే అవకాశముంది. ఇది అనవసర వ్యయమే అని తెలిసి కూడా పని పూర్తవ్వాలనే దృక్పథం కారణంగా ఆ వ్యయాన్ని లక్ష్యపెట్టరు.ఆత్మీయులంటూ మీరు ఎవరిని మనసులో భావిస్తున్నారో వాళ్లని ఒక్కసారి నిశితంగా పరిశీలించుకోండి. ఈ విషయాన్ని మీలోనే ఉంచుకుని తేడా గాని కనిపిస్తే వాళ్లని మీ మార్గం లోనికి రానీయకుండా చూసుకోండి తప్ప నిట్టనిలువునా వాళ్లని నిలదీసి మాట్లాడెయ్యండి.
మంచి ఒత్తిడి, పని భారం, శారీరక శ్రమ వంటివి ఉన్నా కూడా ఏమాత్రమూ వెనకాడకుండా అటుపక్క వాటిని మోస్తూ కూడా, వినోద విహార యాత్రలు చేయాలనే దృక్పథంతో కుటుంబంతో సహా మంచి ప్రదేశాలకి వెళ్తారు. కొందరు బంధువులు మీ పక్కన నిలబడి మంచి సహకారాన్నిస్తారు. మానసికంగా ఊరటని కల్పిస్తారు కూడా.

లౌకిక పరిహారం: పనిని కానీయకుండా మీకు అడ్డుపడేవారిని నిలదియ్యండి.
అలౌకిక పరిహారం: వినాయక చవితి సందర్భంగా వినాయకునికి గరికపూజని చేయండి.

వృషభం (ఏప్రిల్‌ 20 –మే 20)
ఎన్నో బరువైన పనుల్ని చేసిన అనుభవం నైపుణ్య మెళకువా నాకుందనే ఉద్దేశ్యంతో ధైర్యంతో– ప్రస్తుత దశలో అంటే 4వ ఇంటా 8వ ఇ ంటా ప్రతికూల గ్రహాలున్న కాలంలో– దూసుకెళ్తూ, నోటిని పారేసుకుంటూ, భయపెడుతూ బెదిరిస్తూ అసలు వ్యవహరించొద్దు. మీరు ఏం మాట్లాడినా దాంట్లో ఏదైనా అపార్థం దొరుకుతుందా? అని ఆలోచించే వ్యక్తులుండేలా చేసే ప్రస్తుత దశలో శ్రుతిమించి మాట్లాడితే– తప్పయిందని మీరు ఒప్పుకునేంత స్థాయిలో ఎదుటివాళ్లు రెచ్చిపోతారు. కొద్దిగా గ్రహించండి.
ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వస్తే ఒకటి రెండు రోజులు వైద్యావసరం లేకుండా ప్రయత్నించి చూడండి. సాధారణంగా నయమయిపోతుంది. కానిపక్షంలో తేలికపాటి వైద్యానికే లొంగిపోతుంది అనారోగ్యం. ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో...’వంటి సామెతల్ని గుర్తు చేసుకుంటూ ప్రసిద్ధ వైద్యుని దగ్గరకెళ్తే తీవ్రమైన మందుల సేవన వల్ల కొత్త బాధ ప్రారంభం కావచ్చు. ఈ వారంలో అనారోగ్యం లేదు– రాదు కాబట్టి సంయమనంతో వ్యవహరించండి.ఉద్యోగపరంగా మీకేదైనా గాని ఇబ్బంది కలగవచ్చంటూ ఎవరైనా మానసికంగా అధైర్యాన్ని మీకు కలిగిస్తే ఎంటనే దిగులు పడిపోకండి. అపనిందలూ అశుభం కాబోతోందనే వార్తలూ మీ గురించిన దుష్ప్రచారాలూ సర్వసాధారణం ఈ వారంలో. కొందరికి చేతినిండుగా పని ఉండని కారణంగా ఇలాంటి నోటి పనులకి ప్రాధాన్యమిస్తూ సంబరపడిపోతుంటారంతే!
ఆర్థికంగా కొంత లోటు రావచ్చనేది గట్టిమాట కాబట్టి ఖర్చు విషయంలో కొద్దిగా సంయమనంతో వ్యవహరించండి. అట్టహాసం ఆడంబరం వద్దే వద్దు. అనవసర వ్యయాన్ని చేసేసుకుని అప్పుకి వెళ్లడమనేది బుద్ధిమంతుడు చేయదగిన పని కాదు. గ్రహించుకోండి.

లౌకిక పరిహారం: అపనిందల్ని నమ్మకండి. అనవసర వ్యయాన్ని చేయకండి.
అలౌకిక పరిహారం: వినాయక ఆరాధన నిమిత్తం షోడశనామాలని చదువుకుంటూ ఉండండి.

మిథునం(మే 21 –జూన్‌ 20)
చినుకూ చినుకూ జతపడి పిల్లకాలువ అయినట్టూ, అలాంటి కొన్ని కొన్ని పిల్ల కాలువలన్నీ కలిసి సెలయేరైనట్టూ, అలాంటివి కొన్ని చేరి నదిగా... సముద్రంగా అయినట్టూ, అనవసరమైన మాటలు అలా అలా పోగైపోతూ పదిమంది బంధువుల ద్వారా మరింతగా అయిపోతూ మీకూ మీ భార్యకీ, భార్యవైపు బంధువులకీ సయోధ్య చెడిపోయే అవకాశముంది కాబట్టి ఎంతో జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఉండండి ఈ వారంలో మాట విషయంలో. మీకంటే– చదువులో ఉద్యోగానుభవంలో నేర్పరితనంలో ఇలా అన్నిటిలోనూ తక్కువ వాడు మీకంటె పై స్థాయికి పదవీ ఉన్నతిని పొంది వేతనంలో అభివృద్ధిని పొందే అర్హతని సాధిస్తే దిగులు పడకండి. అసూయ పడకండి. మిమ్మల్ని మీరు నిందించుకుంటూ, ఏదో కోల్పోయినట్టుగా అనుకోకండి. కలియుగ లక్షణాల్లో ఇదొకటి. ప్రస్తుతపు మీ దశ సరిగా లేని కారణంగా ఇలా జరగడం మరొకటి. ప్రస్తుతపు మీ దశ సరిగాలేని కారణ ంగా ఇలా జరగడం మరొకటి. మీ ఉద్యోగానికి చక్కని భద్రత ఉ న్నప్పుడు దిగులెందుకు? వద్దు. ఏ విషయాన్ని గురించీ లోతుగా ఆలోచించకండి. మీకు నష్టాన్నీ కష్టాన్నీ కలిగించబోయే సమస్యలేవీ ఈ వారంలో సిద్ధంగా లేవు. పైగా అంతో ఇంతో మంచి జరిగే సంఘటనమే ఉంది. అన్నిటికంటె అతి ముఖ్యంగా గమనించుకోవలసింది ఆరోగ్యాన్ని గు రించి. అలాగని అనారోగ్యంతో పీడింపబడుతూ ఉన్నారనేది దీని భావం కాదు. సకాల నిద్రా సకాల సరైన భోజనం అవసరమని గ్రహించండి. ఆ సమయానికి ఏదో గడిపెయ్యడం సరికాదని దీనర్థం. మీరు చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉన్న కొందరిలో ఒకరికి మాటలాడడంలో తగినంత నైపుణ్యం నేర్పరితనం లేని కారణంగా వ్యాపార రహస్యాలు బయట పడిపోతున్నాయేమో పరిశీలించుకోండి. ఆ వ్యక్తి మనసు చాలా మంచిదే కావచ్చు కాని లౌక్యం తెలియని పక్షంలో ఆయన మనకి దాహం వేసిన కాలంలో సముద్రజలం వంటివాడే.

లౌకిక పరిహారం: మీ ఉద్యోగాన్ని మీరు సూటిగా చేసుకుంటూ సాగిపొండి.
అలౌకిక పరిహారం: వినాయక ఆరాధన నిమిత్తం గణపతి అష్టోత్తరాన్ని చదవండి.

కర్కాటకం(జూన్‌ 21 –జూలై 22)
భారంగా ఉన్న వస్తువును నెట్టడానికి మీ ప్రయత్నం సరిపోని పక్షంలో మరొకసారి సహాయాన్ని అపేక్షిస్తారు. మీరు అడిగితే చాలు సహకరించేందుకు సిద్ధంగా ఎవరో ఒకరొస్తారు సహాయార్థం. ఈ దశలో మీరే మరో పని ఉందంటూనో సమయం లేదంటూనో ఆ ప్రయత్నాన్ని విడుస్తారు. దాంతో ఆ పని అలాగే వాయిదా పడిపోతూ వెనక్కెళ్లి పోతుంది. తగిన సమయం చూసుకుని పనిని ముగించుకోవడానికి అనువైన సమయం ఇది. ప్రయత్నం ఆపకుండా సాగిపోండి.
ఇటు ఉద్యోగంలో ఎదుగూ బొదుగూ లేదని, అటు వృత్తి అనేది అలాగే సాగిపోతోందనుకుంటూనూ, మరోవైపు వ్యాపారంలో విస్తరణంలటూ లేనే లేదని భావిస్తూ, ఇలా ఎటు చూసినా, పరిస్థితంతా ఉన్నచోటనే ఉంటోందనుకుంటూ ఒక తీరు నిరాశా నిస్పృహలతో ఉండకండి. జ్యోతిశ్శాస్త్రం చెప్పేదొకటే– నడుస్తున్న వాహనం వేగంగా ప్రయాణించడం లేదని దిగులు పడకండి. వాహనం ఆగిపోనందుకు ఆనందించండని. అలా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు అంతో ఇంతో మిగులుస్తూ నడిచిపోతూనే ఉన్నందుకు ఆనందించండి. ప్రస్తుత దశలో అంతకుమించి ఎదురు చూడకండి.
సంతానం నుండి శుభవార్తలత్ని వింటూంటారు. కుటుంబంలో విందు వినోద వాతావరణాలుంటాయి. బంధు సహకారం ఉంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తూనే ఉంటుంది. చెప్పుకోదగ్గ వ్యతిరేకత ఏమీ ఉండదు. ఇంతకంటే నిజానికి కావలసినదంటూ ఏముంది? ఉన్నదానింకటే ఆధిక్యం గురించి ఆలోచించినప్పుడే అస్థిరత అసౌఖ్యం మానసికమైన ఒత్తిడీ ఉద్వేగం, ఆవేశం... వంటివి వస్తాయి కదా! ప్రశాంత జీవనంతో ఉన్న మీరు మిమ్మల్ని పట్టించుకుంటూ ఉండండి.

లౌకిక పరిహారం: ఉన్నదానికి ఆనంద పడండి. ఏదో రాలేదని దుఃఖపడకండి.
అలౌకిక పరిహారం: వినాయక ఆరాధన నిమిత్తం మారేడు పత్రాలతో స్వామిని పూజించండి.

సింహం(జూలై 23 –ఆగస్ట్‌ 22)
అయిదారేళ్లకిందట దాదాపుగా మునిగిపో(బో)తున్న సంసారాన్ని మీ నేర్పుతో తెలివి తేటలతో నిత్యమూ మీరు ఆరాధించే భగవత్‌ కృపతో మొత్తానికి ఒడ్డుకు తెచ్చి నిలబెట్టారు. అలాంటిది మళ్లీ వాద వివాదాల జోలికి వెళ్తూ శత్రువుల్ని పెంచుకుంటూ అనవసరంగా సంసారాన్ని ఇబ్బందులపాలు చేయబోతున్నారేమో ఒక్కసారి స్థిమితంగా కూచుని ఆలోచించుకోండి. మొదటిసారిది– ఏదో పొరపాటు, గ్రహస్థితి అనుకూలించలేదనుకుంటూ అంగీకరించ్చేమో గాని ఈసారి అలాటి పరిస్థితే వస్తే దానికి ఒకే ఒక్క(రు) కారణ ం. అది మీరే అవుతారు. ఎవరూ మీవైపున నిలబడరు. గుర్తుంచుకుని ప్రవర్తించండి.
ఉద్యోగం కంటె వ్యాపారం బాగుండొచ్చుననుకుంటూ మళ్లీ చూపు మార్చుకోకండి. దేన్లో ఉన్న కష్టనష్టాలు దానికి ఉండనే ఉన్నాయి. కొత్తదాని గురించిన అనుభవం లేదా ఇంకా రాని కారణంగానూ దీనికంటె అదైతేనో అనే ఆలోచన వస్తూండడం సహజం. అయితే మీరు మీ ప్రవృత్తిని మార్చనే మార్చద్దు ప్రస్తుతానికి.
సంతానంతో చిన్న మాటా మాటా వచ్చే అవకాశముంది కాబట్టి చిన్నప్పటినుంచి పెంచాం కదా! అనే అభిప్రాయంతో మాటలని తూలనాడకండి. అభిప్రాయ భేదాలు ముదిరితే అవి శత్రుత్వాలుగా మారిపోయి తీవ్రమైన మరో పరిస్థితికి తోవ తీయవచ్చు.
ఇంటినీ పొలాన్నీ వాహనాన్నీ మరమ్మతులు చేసుకునే ఆలోచనలో ఉంటారు. అవన్నీ మీకు అత్యవసరం కాబట్టీ లాభాన్నీ సౌకర్యాన్నీ కలుగజేసేవి కాబట్టీ ఆలస్యం చేయకుండా ఆ పనిలో దిగిపొండి.

లౌకిక పరిహారం: సంతానంతో జాగ్రత్తగా మాట్లాడండి. తూలనాడకండి.
అలౌకిక పరిహారం: వినాయక ఆరాధనలో భాగంగా తులసీపత్రాలతో వినాయకుణ్ణి ఆరాధించండి చవితిరోజున.

కన్య(ఆగస్ట్‌ 23 –సెప్టెంబర్‌ 22)
శారీరకమైన అనారోగ్యానికి ఒకరు కాని పక్షంలో మరో వైద్యుడుండచ్చేమో గాని మానసిక అనారోగ్యానికి వైద్యుడు మాత్రం ఎవరు వ్యాధిగ్రస్థులో వాళ్లు మాత్రమే ప్రశాంతతని తెచ్చుకుని నివారించుకోవలసిందే తప్ప ఏ ఒక్కరూ దాన్ని కుదర్చలేరు. ఈవారంలో కొద్దిగా చికాకు ఉండే కారణంగా మానసికమైన అశాంతి కలిగించే వ్యక్తులకీ సంఘటనలకీ దూరంగా ఉండడం మంంచిది.
సమయానికి విరుద్ధమని తెలిసి కూడా పై అధికారి అలాంటి నియమ విరుద్ధమైన పనినే చేయవలసిందని గద్దిస్తూన్న వేళ, వారి సంతకాలతో ఉత్తర్వులని పొంది మాత్రమే ఆ పనిని చేయండి తప్ప మీకు మీరుగా మీ పై అధికారికున్న సహజమైన మంచితనం, మీకు వారితో ఉన్న చనువూ, మీరు వారినుండి పొందిన ఓ ఉపకారం... వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని ఆ నియమవిరుద్ధమైన పనిని చేయద్దు. ఆది నిష్ఠురం మంచిదన్న సూచన ప్రకారం చేయలేనని చెప్పండి ఖండితంగా,మీతో పోటీ వ్యాపారం చేస్తూ మీ వ్యాపారాన్ని దెబ్బతీయదలిచి మరింత చౌకగానూ మీకు కిట్టే విధానమే లేని తీరులోనూ ఎవరైనా వ్యాపారాన్ని చేస్తుంటే వాదులాటకి దిగకండి. మీరూ తగ్గించిన ధరతో ఉండకండి. మీ పెట్టుబడి అయిన నమ్మకమే మీ వినియెగదారులని మీ వద్దకే వచ్చేలా చేస్తుందని గ్రహించి మీదైన ధోరణిలోనే సాగిపొండి.
ఎన్ని సంవత్సరాలపాటు మీరు వ్యాపారాన్ని చేసి ఉన్నా, ఎన్ని సమస్యలని చాకచక్యంతో మీరు పరిష్కరించినా ప్రస్తుతదశలో మాత్రం అనుభవజ్ఞులూ పెద్దలూ అయిన వారితో చర్చించి వారి సూచనల ప్రకారమే నడుచుకోండి తప్ప సొంత నిర్ణయాలు వద్దు.

లౌకిక పరిహారం: మాటని అదుపులో ఉంచుకోండి. మానసికంగా ధైర్యంగా ఉండండి,
అలౌకిక పరిహారం: వినాయక ఆరాధనలో భాగంగా 16 ఉండ్రాళ్లని దైవానికి సమర్పించుకోండి.

తుల (సెప్టెంబర్‌ 23 –అక్టోబర్‌ 22)
దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్న కాలం ఇది. ఇంటికి మరమ్మతులూ లేదా నూతన గృహాన్ని కొంత సొమ్ముకి కొని లాభంతో మరికొంత ఎక్కువకి అమ్మడం.. వంటి లాభసాటి పనులని విజయవంతంగా చేయగలుగుతారు– చేస్తారు కూడా.
కొత్త కొత్త ప్రణాళికలని వేసి వాటిని శీఘ్రంగా అమలు చేసి మీ పై అధికారుల దృష్టిలో మంచి పేరుని పొందగలుగుతారు. గతం కంటె ఉత్తమ ఫలితాలతో పాటు అభివృద్ధికరమైన ఆలోచనలని పొందగలుగుతారు. అందరు ఉద్యోగస్థుల్లోనూ మంచి పేరును తెచ్చుకోగలుగుతారు కూడా. ముద్దొచ్చినప్పుడే చంకకెక్కాలన్న సామెత ప్రకారం కాలం కలిసొచ్చినప్పుడే ఆ మంచి పేరుని మరింతగా నిలబెట్టుకోవాలి– సత్ఫలితాన్ని పొందాలి.స్థిరమైన ఆస్తుల్లో పేచీలుగాని ఉంటే వాటిని క్రమబద్ధీకరించుకోవడం లేదా స్థిరపరచుకోవడం లేదా పెద్దల పలుకుబడితో కట్టుదిట్టం చేసుకోవడమనే పనులకి శ్రీకారం చుట్టండి. మిత్రులూ బంధువులూ అండగా నిలబడి ఇబ్బందుల్లేకుండా చేయగలుగుతారు పనిని.ఉద్యోగస్థులకి పదవీ ఉన్నతితోపాటు వేతానిభివృద్ధికి కూడా అవకాశముంది. వృద్ధులైన తల్లిదండ్రులకి తేలికపాటి ఆరోగ్య పరీక్షలు చేయించడం అవసరం. కుటుంబంలో ఉన్న సహోదరి సహోదరులకి వివాహ ప్రయత్నాలు చేస్తే అనుకూలించవచ్చు. పోటీ పరీక్షలకి సిద్ధమైన పక్షంలో విజయాన్ని సాధించే అవకాశముంది.ఎట్టి పరిస్థితుల్లోనూ వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిని అమ్మవద్దు. కొత్తకాలపు కట్టడాలతో ఉన్న ఆస్తిని కొనద్దు.

లౌకిక పరిహారం: చక్కని ఆలోచనలొచ్చే కాలం– అమలుకి ప్రయత్నించండి.
అలౌకిక పరిహారం: వినాయక ఆరాధనలో భాగంగా ఇంట్లో భజన కార్యక్రమాన్ని పెట్టండి.

వృశ్చికం(అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
పూర్తిగా కష్టంలో దిగబడి పోవడం ఒక తీరు. కష్టంలో దిగబడిపోతూ గమనించుకుని పైకి వచ్చేయడం మరొక తీరు. అన్ని విధాలా జాగ్రత్తలని తీసుకుంటూ ఉన్నా అనుకోని ఇబ్బందిలో చిక్కుకుని పెద్ద ప్రమాదంలో దాదాపుగా పడిపోతున్న దశలో కేవలం భగవత్కృప కారణంగా ఒడ్డుదన పడడం మరింఒక్క తీరు. మీది 3వ తీరు ఉదాహరణ. నిర్భయంగా ఉండండి. మీ ధర్మబద్ధ ప్రవర్తన, రుషిలాగా ప్రవర్తిస్తున్న తీరు, నోరు చేసుకోకుండా ఉంటున్న విధానం కారణంగా శత్రుపక్షం వారికి ఒళ్లంతా గంగవెర్రులెత్తినట్లుంటుంది. ఎంత ఇబ్బందికి గురి చేయబోయినా ఎలాగొ కలా తప్పించుకుంటూ మీరు బయట పడడమనేది వాళ్లకి సుతరామూ కిట్టనిది కాగా, ఎంత రెచ్చగొట్టినా మట్టిముద్దలా ప్రతిస్పందన లేకుండా మీరుండడమనేది వాళ్ల ఉపాయాలకి అడ్డుగోడలా అవుతోంది. అలాగే ఉండండి. విజయం మీదే. అనుమానం లేదు. నోరు చేసుకోవడం, ప్రతీకార బుద్ధితో దౌర్జన్యం దాడీ చేయడం/ చేయించడం గాని చేస్తే ఇంతే సంగతులు– మీరు కారాగారం పాలౌతారు. సంశయం లేదు. అలా మీ చేత చేయించాలనే వాళ్లు రెచ్చగొట్టుతున్నది కూడా. చేస్తున్న మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థికంగా ఎత్తుకి వెళ్తూ ఆనందాన్ని కలిగిస్తాయి. ఆటంకాలు కూడా వాటంతట అవే తొలగిపోతూ సంతోషాన్నిస్తాయి. కార్మిక రంగం పారిశ్రామిక రంగం వారికి మంచి ఒత్తిడులుంటాయి గాని ఆర్థికందా నష్టం ఉండదు. విదేశాల నుండి స్వదేశానికి రావలసిన అవసరం ఉందనిపిస్తుంది గాని, చివరి క్షణంలో రాక అనవసరమనే సమాచంర అంది ప్రయాణాన్ని విరమించుకుంటారు. మీ భార్య/ భర్త మీ వద్ద లేని కారణంగానూ, వస్తారో రారో అనే దిగులు మీలో ఉండడం బట్టీ అనవసర స్త్రీ పురుష పరిచయాలయ్యే అవకాశముంది. తీవ్రమైన ఇబ్బందులొచ్చే పరిస్థితీ ఉంది.

లౌకిక పరిహారం: అనవసర పరిచయాలు పెంచుకోవద్దు. జాగ్రత్త.
అలౌకిక పరిహారం: వినాయక ఆరాధనలో భాగంగా దర్భలని దేవాలయానికి సమర్పించండి.

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఆలోచన అనే విత్తనాన్ని నాటాక పెద్దల సూచన అనే చీడపీడల నివారణ మందుని చల్లితే కుటుంబసభ్యుల అనుకూలత అనే నీటిని సక్రమంగా పోస్తూంటే భగవదనుగ్రహమనే సూర్యరశ్మికి సత్ఫలితాలు లభిస్తాయి. ఇటువంటి అదృష్టయోగం ప్రస్తుతం మీకు పట్టబోతోంది. ఈ యోగానికి శత్రువులు అహంకారం కోపం అనేవి. జాగ్రత! వాహనాన్ని ఎంత వేగంగా నడుపుతూ ఉంటే లోపల కూచున్నవాళ్లకి అంత సంతోషంగా ఉంటంది గాని, నడిపేవానికి మాత్రం లోపల ఒత్తిడీ మనోభయమూ ఉండనే ఉంటుంది. ‘ఏం నడిపావులే!’ అని అందరూ గమ్యస్థానానికి చేరాక ప్రశంసించినా నడిపినవాడు మాత్రం – ‘ఏ ప్రమాదమూ లేకుండా దైవకృపవల్ల రాగలిగా’–ననుకుంటాడే తప్ప తన శక్తీ సామర్థ్యమని అనుకోడు. సరిగ్గా ఇదే తీరులో ఎంతో సాహసించి ఓ వ్యాపారానికి పెట్టుబడి పెట్టి జోరుగా వ్యాపారాన్ని చేస్తున్నా అనుక్షణం లోభయంతో ఉంటారు. ప్రస్తుతం దశ బాగుంది కాబట్టి అత్యాశకి పోకుండా ఇతరుల ప్రోత్సాహానికి బలి అయిపోతూ మరింతగా వ్యాపారాన్ని అత్యాశతో పెంచుకోకండి. ప్రస్తుతానికింత చాలుననుకోండి. ఆత్మీయులెవరైనా వచ్చి మీ విజయాలని పొగుడుతూ మెల్లగా విజయం వెనుక రహస్యాలని అడుగుతున్నట్లుగా అనిపిస్తే పెద్ద నవ్వుని నవ్వేసి – మరో విషయాన్ని ప్రస్తావించండి. ఎన్నిమార్లు వాళ్లు మీ నుండి తెలుసుకోవాలనుకుంటే అన్ని మార్లూ తెప్పించుకోండి. అలా కాకుండా కొద్దిగానైనా రహస్యాన్ని చెప్పారంటే చాలు మా ఇంటి తాళం చెవులని వాళ్లకిచ్చినట్టే. వృత్తి ఉద్యోగాలని శ్రద్ధా నైపుణ్యాలతో చక్కగా చేసుకుంటారు. ఉద్యోగానికి ఏ ఇబ్బందులూ ముగింపు సూచనలూ ఉండనే ఉండవు. ఖర్చుల విషయంలో కొంత ప్రణాళిక మాత్రం అవసరం. రుణం అనే ప్రస్తావన వద్దు. ధనం కంటె బాంధవ్యం గొప్పదనే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి.

లౌకిక పరిహారం: మీ విజయ రహస్యాన్ని ఎవరికీ ఏ పరిస్థితుల్లోనూ చెప్పకండి.
అలౌకిక పరిహారం: వినాయకారాధనలో భాగంగా బెల్లపు నీటితో స్వామికి అభిషేకాన్ని చేయండి.

మకరం(డిసెంబర్‌ 22 – జనవరి 19)
మీ పనిని మీరు చేసుకుంటూ సాగిపోండి తప్ప, ఇతరులెవరో మీ మీద అనేక అభాండాలని వేస్తున్నారంటూ ఎవరెవరో వస్తూ చెప్పడం ప్రారంభించబోతే – వాళ్లని రావద్దని నిర్ద్వందంగా చెప్పండి. అయినా మళ్లీ వచ్చి అదే పాటని ప్రారంభించబోతే – నీ మీద కూడ నాకు చెప్పారంటూ ఎదురు చెప్పండి. మీ ఎదుగుదలని ఓర్వలేక చేసే వ్యతిరేక ప్రయత్నాల్లో భాగం – మిమ్మల్ని మానసికంగా కుంగిపోయేలా చేయడం. ధైర్యంగా సాగిపోండి. ఈ వారంలో ఏ ఇబ్బందీ లేదు. మీరుగా ఎవరికీ సలహాలనీ సూచనలనీ ఇయ్యకండి. అవి బెడిసికొట్టిన పరిస్థితుల్లో అనవసరంగా మీరు ఇరుక్కోవలసి వస్తుంది. ఏవైనా అభియోగాల్లో న్యాయస్థానానికి వెళ్లవలసి వస్తే నిజాన్ని నిష్ఠూరంగా చెప్పండి తప్ప ప్రలోభానికి గురై మాటని మార్చకండి. తేలికగా తీసుకోకండి. విషయాన్ని పిత్రార్జిత ద్రవ్యం వాటాలు వేసుకునే వరకూ వచ్చిన పక్షంలో మీరుగా వాటాలని వేయకండి. వాటాలని మరొకరి చేత వేయిస్తే ‘కోరుకోవడాన్ని నేను చేసుకుంటా’నని చెప్పండి. అందరికీ సమానభాగాలొస్తాయి. పంపకాల తర్వాత ముఖం ముఖం చూసుకోగల పరిస్థితులుంటాయి. వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో లేదా పల్లెటూళ్లలో పెద్దమనిషి స్థాయి అధికారం వంటిది వస్తే సున్నితంగా తిరస్కరించండి తప్ప, ఒక సంఘానికి కార్యదర్శి, అధ్యక్షుడూ ... వంటి వాటిని ఆశించకండి. వస్తే అంగీకరించకండి. సమయం నష్టం కావడం, మీ పనుల్ని మీరు చేసుకోలేకపోవడమే ఈ అధికారం వల్ల వచ్చే ఆదాయాలు. మీ విషయంలో ఈర్ష్యతో రగిలిపోయేవాళ్లతో చక్కగా నవ్వుతూ పల్కరించండి తప్ప, వ్యంగ్యసంభాషణలు వద్దు. వాళ్లతో ఆర్థిక సంబంధాలూ మధ్యవర్తి పరిష్కారాలూ వద్దే వద్దు. ఉన్న వ్యాపారంతో వృత్తి నిర్వహణతో ఉద్యోగ బాధ్యతతో ఆనందపడుతూ సంతృప్త జీవనాన్ని గడుపుతున్న మీకు ఆ అదనపు బరువులు వద్దు.

లౌకిక పరిహారం: కొత్త బాధ్యతలొద్దు. మధ్యవర్తి పరిష్కారాలు వద్దు.
అలౌకిక పరిహారం: వినాయకారాధనలో భాగంగా దైవానికి జమ్మి పత్రాల పూజని చేయండి.

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఎదుగుతూ ఎదిగిపోతూ ఉన్న మీరు గుర్తుంచుకోవలసింది మీ ఎదుగుదలకి కారణమైన రుణాలని ఇచ్చిన రుణదాతలని. మీ ఎదుగుదల నచ్చని ఈర్షా్యపరులైన వ్యక్తులు రుణదాతలందర్నీ మీ మీదకి ఉసిగొల్పే పరిస్థితి రాబోతోంది కాబట్టి, కొంత కొంత తీరుస్తూ వాళ్లకి నమ్మకాన్ని కల్గిస్తూ సాగిపోండి తప్ప, దురాశతో వ్యాపారాన్ని మరోచోట కూడ విస్తృత పరుస్తూ రుణాలని తీర్చకుండా ఉండద్దు. ప్రతి విషయాన్నీ అవగాహనకల మీ కుటుంబసభ్యులకి చెప్పి చేస్తూ ఉండండి తప్ప ఏక పక్షంగా సాగిపోతూ ఉండకండి. మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకున్నవాళ్లు మిమ్మల్ని ఇబ్బందిపెట్టబోతే ఆ మార్గాన్ని మీరు మూసేస్తూంటే, మీ కుటుంబం ద్వారా చిచ్చుని పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్లకే అవగాహనని కల్గించి తీరాల్సిందే.
ఆదాయం వ్యయం అనే రెంటినీ ఓ ప్రణాళిక ప్రకారమే మీరు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆర్థిక మాంద్యం గాని, డబ్బుకి ఇబ్బంది పడే పరిస్థితి గానీ రాదు. ఇళ్లూ పొలాలూ మొదలైన స్థిరమైన ఆస్తుల్ని కొనుగోలు చేసే సందర్భాల్లో ప్రతి పత్రాన్నీ పూర్తిగా పరిశీలించుకోండి. పరిశీలింపజేసుకోండి తప్ప, తొందరపాటుతోనూ, నమ్మకంతోనూ పనిని పూర్తి చేసుకోకండి. రోజుకో తీరుగా చట్టం పురోభివృద్ధి దిశగా వెళ్తోంది కాబట్టి మీ నమ్మకాలనేవి ఆ చట్టం ముందు నిలబడవు. ఎవరెవరి ఉదాహరణలనో మనసుకి పట్టించుకుని, ఎవరెవరి మాటలో బుద్ధిలో నెమరువేసుకుని తలిదండ్రుల్ని శత్రువులుగా చూడడం గాని, తలిదండ్రుల పట్ల ప్రతీకార బుద్ధితో ఉండడం గాని చేయద్దు. అలాగే అత్తమామలపట్ల దురుసుతనం వద్దు. కలిసొచ్చే కాలంలో ఎవరితో మనఃస్పర్ధ ఉన్నా అది మీ వృత్తి వ్యాపారాల మీదా ఉద్యోగమ్మీదా ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహించుకోండి.

లౌకిక పరిహారం: ఎదుగుతూన్న మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలా? అని లోచిస్తున్నారని గమనించి ఉండండి.
అలౌకిక పరిహారం: వినాయకారాధనలో భాగంగా వినాయకునికి నవనీతంతో పూత వేయండి.

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ధనంతో ధనవ్యాపారం చేసేవాళ్లు (షేర్లూ చిట్‌ఫండ్లూ వడ్డీ వ్యాపారం..) చాలా జాగ్రతతో ప్రవర్తించాల్సి ఉంది. ధనంపోతే తిరిగి అంతనీ సంపాదించుకోగల నైపుణ్యం సామర్థ్యం శక్తీ అనేవి మీకుండచ్చు గాని మానసికంగా, అలాగే సంఘంలో మర్యాదస్థానానికి తక్కువగా గాని, మీరు గుర్తింపబడితే ఆ మనఃక్షోభ మిమ్మల్ని కుంగదీయొచ్చు. తాము చేసేదంటూ ఏమీ లేకపోయినా బంధుమిత్రులు మీ పరిస్థితిని గురించి యక్షప్రశ్నలు వేస్తూంటే చికాకుగానూ, కొన్నాళ్లపాటు అజ్ఞాతానికి వెళ్దామా? అన్నంతగానూ అన్పించవచ్చు మీకు. ఆ కారణంగా నిష్కర్షగా చెప్పేస్తూ – ఈ వ్యవహారం నీకు అనవసర–మని కుండ పగలగొట్టి మాట్లాడి వాళ్ల బెడదని వదిలించుకోండి. సంతానంలో ఒకరు తీవ్రంగా వ్యయం చేస్తున్న విషయం మీకు మింగుడుపడకపోవచ్చు. అలాగని దానికి ఓ పరిష్కారమేమిటో తెలుసుకోదలిచి ప్రయత్నిస్తూ ఉంటే పరిష్కారం ఈ వారంలో తెలియకపోవచ్చు. అయితే ప్రయత్నాన్ని మాత్రం మానకండి. చదువులు బాగున్నా ప్రవర్తన కూడా బాగున్నపుడే కదా– పక్షి తన రెండు రెక్కలతోనూ ఆకాశంలోని మరింత ఎత్తుకి ఎగరగలుగుతున్నట్లుగా – అభివృద్ధికి వెళ్లగలుగుతాడు వ్యక్తి! గమనించుకోండి!

ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయదలిస్తే వెంటనే కాగితాల మీద ఆ వ్యవహారాన్ని రాసుకోండి తప్ప నోటి మాటలు సరికాదు. ఆరోగ్యభంగ సూచనలేమీ లేవు కాబట్టి అధైర్యపడకండి. విందు వినోద విలాసయాత్రల్లో ఎంచి ఖర్చు చేసుకోవడం మంచిది తప్ప విచ్చలవిడితనం వద్దు. దానిక్కారణం మిమ్మల్ని గమనించే కళ్లు ఎన్నో ఉండడమే.

లౌకిక పరిహారం: సంతానంలో ప్రవర్తన గురించి పరిశీలించుకుంటూ ఉండండి.
అలౌకిక పరిహారం: వినాయకారాధనలో భాగంగా దైవానికి ఉమ్మెత్తపూలతో (దొరికినన్ని మాత్రమే) పూజ చేయండి.

>
మరిన్ని వార్తలు