కొవ్వుతోనే కొవ్వుకు కోత

30 Aug, 2018 00:31 IST|Sakshi

 ఊబ  కాలమ్‌

వజ్రాన్ని కోయాలంటే వజ్రమే కావాలట. ఉష్ణాన్ని చల్లబరచడం ఉష్ణానికే సాధ్యమట. తెలుగులో తరచూ వాడే రెండు సామెతలివి.  కీటో డైట్‌ కూడా పై సామెతల్లాగే పనిచేస్తుందేమో!?బరువు పెరగడం అంటే కొవ్వు పెరగడమే కదా. కొవ్వు పేరుకుంటేనే కదా ఊబకాయం వచ్చేది! కీటోజెనిక్‌ ఫుడ్‌ను తీసుకుంటే...కొవ్వును కొవ్వే కోసేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.  ట్రై చేసి చూడండి.బరువు తగ్గడానికి ఉన్న ఆహార ప్రక్రియల్లో అత్యంత ప్రాచుర్యం ఉన్న వాటిల్లో కీటోజెనిక్‌ డైట్‌ చాలా ప్రధానమైనది. దీన్నే సంక్షిప్తంగా ‘కీటో’ డైట్‌ అని కూడా అంటుంటారు. ఒక్క బరువు తగ్గడం మాత్రమే గాక... బరువుతో వచ్చే అనర్థాలకు అంటే... డయాబెటిస్, క్యాన్సర్‌ వంటివాటికీ ఇది సమర్థంగా పనిచేస్తుందని కొందరి నమ్మిక. అదేంకాదు... ఎపిలెప్సీ, అల్జిమర్స్‌ వ్యాధుల నివారణకూ ఇది తోడ్పడుతుందని కొందరు నిపుణులు చెబుతుంటారు. 

కీటోజెనిక్‌ డైట్‌ అంటే... 
ఇందులో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్‌) చాలా తక్కువ. కొవ్వులు చాలా ఎక్కువ. మనకు కార్బోహైడ్రేట్ల నుంచి తక్షణ శక్తి సమకూరుతుందన్న విషయం తెలిసిందే కదా. అయితే కీటో డైట్‌లో ఈ శక్తిని కొవ్వుల నుంచి పొందుతాం అన్నమాట. ఇలా కార్బోహైడ్రేట్ల స్థానంలో కొవ్వుల నుంచి శక్తి పొందే జీవక్రియను ‘కీటోసిస్‌’ అంటారు. ఇలా తక్షణ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు అందుబాటులో లేక కేవలం కొవ్వు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు శరీరం కొవ్వునే దహనం చేసి తమకు అవసరమైన శక్తిని పొందుతుంది. (ప్రోటీన్, కార్బోహైడ్రేట్‌... ఈ రెండు పోషకాల్లో 1 గ్రాము నుంచి 4 క్యాలరీల శక్తి పుడుతుంది. అదే 1 గ్రాము కొవ్వునుంచి 9 క్యాలరీల శక్తి ఆవిర్భవిస్తుంది). ఇలా కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కాలేయంలో కొవ్వు నుంచి కీటోను అనే రసాయనాలు వెలువడుతాయి. కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కీటోన్లు పుడుతుంటాయి కాబట్టి దీన్ని కీటోజెనిక్‌ డైట్‌ అంటారు. ఈ ఆహారంలో రక్తంలో చక్కెర పాళ్లు గణనీయంగా తగ్గిపోతాయి. ఇలా చక్కెర తగ్గడం, కీటోన్లు పెరగడం అనేది చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది కాబట్టి ఈ డైట్‌ చాలా ప్రాచుర్యం పొందింది. 

కీటోజెనిక్‌ డైట్స్‌లోని రకాలు :  కీటోజెనిక్‌ డైట్‌లోనే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని... 

స్టాండర్డ్‌ కీటోజెనిక్‌ డైట్‌ (ఎస్‌కేడీ) : ఇందులో కార్బోహైడ్రేట్లు చాలా చాలా తక్కువ. ప్రోటీన్లు ఒక మోస్తరు. ఇక కొవ్వుల విషయానికి వస్తే వాటి మోతాదు చాలా ఎక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే... ఇందులో కొవ్వులు 75శాతం, ప్రోటీన్లు 20శాతం, కార్బోహైడ్రేట్లు 5 శాతం మాత్రమే ఉంటాయి. సైక్లికల్‌ కీటోజెనిక్‌ డైట్‌ (సీకేడీ)  ఇందులో ఒక పీరియాడిసిటీ ఉంటుంది. అంటే... వారంలోని ఐదు రోజులు పైన పేర్కొన్న ఎస్‌కేడీ డైట్‌ ఇస్తూ... మిగతా రెండు రోజులు మాత్రం కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోవచ్చు.  టార్గెటెడ్‌ కీటోజెనిక్‌ డైట్‌ (టీకేడీ)  ఈ తరహా కీటోజెనిక్‌ డైట్‌లో సాధారణంగా స్టాండర్డ్‌ కీటోజెనిక్‌ డైట్‌ తీసుకుంటూ... బాగా వ్యాయామం చేస్తున్నప్పుడు మాత్రం కార్బోహైడ్రేట్లు తీసుకోవచ్చు.  హై–ప్రోటీన్‌ కీటోజెనిక్‌ డైట్‌  ఇది కూడా మామూలుగా స్టాండర్డ్‌ కీటో–డైట్‌ను పోలి ఉన్నప్పటికీ ఇందులో ప్రోటీన్ల మోతాదు ఎక్కువగా ఉంటుంది. అంటే కొవ్వులు 60 శాతం, ప్రోటీన్లు 35 శాతం, కార్బోహైడ్రేట్లు కేవలం 5 శాతం మాత్రమే ఉండేలా ఆహారం తీసుకోవాలి. ఏమైనప్పటికీ కీటో డైట్‌లోని ఒకే ఒక సాధారణ అంశం ఏమిటంటే... అది ఏ తరహా కీటో–డైట్‌ అయినప్పటికీ కార్బోహైడ్రేట్లు 5శాతం కంటే ఎక్కువగా ఉండబోవని గుర్తుంచుకుంటే చాలు.

కీటోజెనిక్‌ డైట్‌లో తీసుకోకూడని ఆహారాలు 
ముందుగా చెప్పినట్లు కీటో–డైట్‌లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండాలి కదా. అందుకే ఈ కింద పేర్కొన్న పిండిపదార్థాలను కలిగి ఉన్న ఆహారాలను కీటో–డైట్‌లో భాగంగా తీసుకోరు. చక్కెరలు ఎక్కువగా ఉండేవి సోడాలు, పండ్ల రసాలు, స్మూదీస్, కేక్‌లు, ఐస్‌క్రీమ్, క్యాండీలు. ధాన్యాలు  వరి, గోధుమ, తృణధాన్యాలు (సిరియల్స్‌) వంటివి.  పండ్లు అన్ని రకాల పండ్లూ తినకూడదు. అయితే నేరేడు జాతికి చెందిన బెర్రీలు, స్ట్రాబెర్రీలకు మాత్రం మినహాయింపు ఉంది. బీన్స్‌ జాతి గింజలు వేరుశెనగలు, కిడ్నీబీన్స్, బీన్స్, శెనగలు (చిక్‌పీస్‌) వంటివి.  దుంపజాతికి చెందినవి  బంగాళదుంప (ఆలూ), చిలగడదుంప (మోరంగడ్డ/గెణుసుగడ్డ), క్యారట్‌ వంటివి.  తక్కువ కొవ్వులు ఉండేవి కొన్ని బాగా పొట్టుతీసిన పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ లో–ఫ్యాట్‌ పదార్థాలను తీసుకోకూడదు.  అనారోగ్యకరమైన కొవ్వులు కీటో–డైట్‌లో కొవ్వులు ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ ఆ కొవ్వుల్లోనూ ఆరోగ్యకరమైన కొవ్వులనే తీసుకోవాలి. కొన్ని కొవ్వులు ఉదాహరణకు ప్రాసెస్‌ చేసిన వంటనూనెలు, మయోన్నెయిజ్‌ వంటివి తీసుకోకూడదు. 
 ఆల్కహాల్‌ : చాలా ఆల్కహాల్స్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. అవి కీటోసిస్‌ ప్రక్రియను అడ్డుకుంటాయి. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండాలి. తీసుకోవాల్సిన ఆహారాలు కీటో–డైట్‌లో భాగంగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి... వేటమాంసం, చికెన్, టర్కీ కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు (ఫ్యాటీ ఫిష్‌) సాల్మన్‌ (దీన్ని తెలుగులో కొన్నిచోట్ల మాగా/బుడతమాగ అంటారు) ట్యూనా (టూనా చేప) మాకెరల్‌ (దీన్ని తెలుగులో కొన్ని చోట్ల కన్నగడతలు అంటారు), సార్డిన్‌ (దీన్ని తెలుగులో కొన్నిచోట్ల కవలు/నూనా కవలు అంటారు) వంటి చేపలు తీసుకోవచ్చు. మనకు అందరికీ తెలిసిన కొర్రమీను ఈ డైట్‌లో చాలా మంచిది. గుడ్లు  పాçశ్చరైజ్‌ చేసి ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే గుడ్లు. వెన్న, క్రీమ్‌  గడ్డి మేసే జంతువుల పాల నుంచి తీసిన వెన్న, మీగడలు. నట్స్, గింజలు బాదాం, వాల్‌నట్, అవిశె గింజలు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్‌. ఆరోగ్యకరమైన నూనెలు వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్, అవకాడో నూనె, కెనోలా నూనె, పల్లీల నూనె, నువ్వుల నూనె, కొబ్బరినూనె. (ఇటీవల హార్వర్డ్‌కు చెందిన ఒక ప్రొఫెసర్‌ కొబ్బరి నూనె అంత శ్రేష్టమైనది కాదని చెబుతున్నారు. నిపుణులను సంప్రదించాకే నూనెలు వాడాలి).కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉండే వెజిటబుల్స్‌: ఆకుపచ్చరంగులో ఉండే అన్ని రకాల ఆకుకూరలు, టొమాటో, ఉల్లి వంటివి. వీటితో పాటు కాప్సికమ్‌ అని పిలిచే బెల్‌పెప్పర్‌ను వాడుకోవచ్చు. ఇవి పసుపుపచ్చ, ఆకుపచ్చ, ఎర్రరంగులో దొరుకుతుంటాయి. 

పరిమితులు 
ఒంట్లోని జీవక్రియల వేగం పెంచడం అంటే మెటబాలిక్‌ హెల్త్‌ను మెరుగుపరడం ద్వారా కీటో–డైట్‌ అన్నది వ్యక్తుల బరువు తగ్గించడంలో, డయాబెటిస్‌ను అదుపు చేయడంలో చాలా అద్భుతాలే చేస్తుంది. అయితే దీనికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. చాలా తీవ్రమైన వ్యాయామం అవసరమైన అథ్లెట్లు వంటి వారికీ, కండరాల పెరుగుదలను కోరుకునే వారికి కేవలం ఈ డైట్‌ మాత్రమే సరిపోదు. ఇక మీరు ఏ ఆహార ప్రక్రియను అవలంబిస్తున్నప్పటికీ... సుదీర్ఘకాలం దాన్నే అనుసరిస్తూ ఉంటే తప్ప అది పెద్దగా సత్ఫలితాలు ఇవ్వదు. ఇదే అంశం కీటో–డైట్‌కూ వర్తిస్తుంది. ఇవి మినహా కీటో–డైట్‌ మిగతా అన్ని సందర్భాల్లోనూ మంచి ఫలితాలే ఇస్తుందన్నది నిపుణుల మాట. 

కీటోజెనిక్‌ ఆహారం తీసుకుంటున్నప్పుడు ఒంట్లోని నీరు, ఖనిజలవణాల బ్యాలెన్స్‌ కూడా మారుతుంది. అందుకే కీటో–డైట్‌లో ఉన్నప్పుడు కాస్త ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా అవసరం. లవణాల్లో భాగంగా రోజుకు 3,000 – 4,000 ఎంజీ సోడియమ్, 1,000 ఎంజీ పొటాషియమ్, 300 ఎంజీ మెగ్నీషియమ్‌ తీసుకోవడం మంచిది.
కీటో డైట్‌ తీసుకునే మొదటిరోజుల్లో... మిగతా ఆహారాలవైపునకు (అదనపు క్యాలరీల వైపునకు) మనసు పోకుండా ఉండేందుకు కడుపునిండా తింటూ ఉండటం మంచిది. 


కీటో–ఫ్లూ ఉన్నప్పుడు ఒంటికి అంతగా శక్తి సమకూరినట్లుగా అనిపించదు. మెదడుకు అవసరమైన శక్తి అందదు. దాంతో ఎప్పుడూ ఆకలిగా ఉన్నట్లు అనిపించడం, నీరసం, నిద్రవస్తున్నట్లుగా ఉండటం, వికారం, జీర్ణవ్యవస్థలో (కడుపులో) ఇబ్బంది (స్టమక్‌ డిస్‌కంఫర్ట్‌), మునుపటిలా వ్యాయామం చేయలేకపోవడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఇవి తగ్గేవరకు మొదట్లో ఒకటి రెండు వారాలు చాలా తక్కువ మోతాదుల్లో కార్బోహైడ్రేట్లు తీసుకుంటూ ఉంటే మంచిది. అలా వాటిని తగ్గిస్తూ క్రమంగా ఒంట్లోని కార్బోహైడ్రేట్లకు బదులు కొవ్వులను ఖర్చు చేసేలా ఒంటిని అలవాటు చేయాలి. 


కీటో–డైట్‌తో ఏర్పడే సైడ్‌ఎఫెక్ట్స్, వాటిని తగ్గించడం ఎలా: చాలావరకు కీటో–డైట్‌ అనేది మంచి ఆరోగ్యకరమైనదే. అయితే శరీరం దానికి అలవాటు పడే ముందు  కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. డైట్‌ ప్రారంభదశల్లో కనిపించే ఈ దుష్ప్రభావాలూ, వాటి వల్ల కలిగే అనారోగ్యాలను ‘కీటో–ఫ్లూ’ అంటారు. అయితే కొన్నాళ్లలోనే ఈ కీటో–ఫ్లూ తగ్గిపోతుంది. 

డైట్‌ ప్లాన్‌ ఇలా...      (కీటోజెనిక్‌ డైట్‌ తీసుకోవాలనుకున్నవారికి ఉజ్జాయింపుగా ఒక డైట్‌–ప్లాన్‌) 
పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌గా... 
వెన్నలో గార్నిష్‌ చేసిన చేపలనో లేదా వేటమాంసాన్నో పకోడాగా వేయించిన శ్నాక్‌. (దీన్ని పల్లీనూనెతో లేదా కొబ్బరినూనెతో తయారు చేసుకోవచ్చు).   (లేదా) గుడ్డును ఆమ్లెట్‌గా వేసి తినవచ్చు (అయితే ఈ ఆమ్లెట్‌నూ మంచి వెన్నతో లేదా ఆలివ్‌నూనెతో వేసుకోవచ్చు)  లేదా వివిధ రంగుల్లో ఉండే కాప్సికమ్‌ను పుష్కలంగా వేసి, గుడ్డు పొరటును చేసుకొని తినవచ్చు. (దీన్ని తయారు చేయడానికి ఆలివ్‌నూనె లేదా ఎక్కువ వెన్నను ఉపయోగించాలి). 

మధ్యాహ్న భోజనం (లంచ్‌)గా : 
లంచ్‌లో భాగంగా సలాడ్స్‌గా పాలకూర,  పసుపుపచ్చ, ఆకుపచ్చ, ఎర్రరంగులో దొరికే కాప్సికమ్, పుట్టగొడుగులు (మష్రూమ్స్‌)ను ఆలివ్‌నూనె లేదా వెన్నలో కాస్తంత దోరగా వేపి తినవచ్చు. అలాగే కొన్నిసార్లు ఈ సలాడ్‌తో పాటు వెన్నలో వేయించిన చికెన్‌ ముక్కలు, వెన్నలో కాస్తంత దోరగా కాల్చిన ఉడకబెట్టిన గుడ్లు కూడా తీసుకోవచ్చు. వెన్న టాపింగ్‌తో ఈ సలాడ్‌ను తీసుకోవాలి.  చేపలు, మాంసాహారం, చికెన్‌ లేదా పనీర్‌ను పకోడాలా వేయించి తీసుకోవచ్చు.   ఆలివ్‌నూనె, పల్లీనూనె లేదా కొబ్బరినూనె పోసి వండిని కాలీఫ్లవర్‌ కూరను పైన పేర్కొన్న చేప, మటన్, చికెన్‌ పకోడాతో పాటు తీసుకోవచ్చు. 

రాత్రి భోజనంగా (డిన్నర్‌లో) : 
మీగడతో గార్నిష్‌ చేసిన పాలకూరను వెన్నలో వేయించి తీసుకోవచ్చు.  లెమన్‌ చికెన్‌ సూప్‌ చేపలు, మాంసాహారం, చికెన్‌ లేదా పనీర్‌ను పకోడాలా వేయించి తీసుకోవచ్చు. (ఫ్రైడ్‌ పనీర్‌ పకోడా)   కైమా లాగా కొట్టిన మటన్‌ను పైన పేర్కొన్న నూనెలతో వండి తీసుకోవచ్చు.    కొబ్బరినూనె / ఆలివ్‌నూనె / పల్లీనూనెలో దోరగా వేయించి క్యాబేజీ సలాడ్‌.వారమంతా పైన పేర్కొన్న బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లలో మీకు అందుబాటులో ఉన్న పదార్థాలను, మీ ఛాయిస్‌ను బట్టి మార్చి మార్చి వాడుకోవచ్చు. 
గమనిక : బరువు తగ్గడానికి కీటో డైట్‌ను ఫాలో అవ్వాలనుకున్నవారు తప్పనిసరిగా ముందుగా నిపుణుల సలహా తీసుకోవాలి. 
డాక్టర్‌ సుధీంద్ర ఊటూరి
లైఫ్‌స్టైల్‌ స్పెషలిస్ట్,  కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌ 

మరిన్ని వార్తలు