బరువులెత్తితే.. మధుమేహ నియంత్రణ!

19 Jun, 2019 12:23 IST|Sakshi

మధుమేహంతో బాధపడుతున్న ఊబకాయులకు వెయిట్‌ ట్రెయినింగ్, శక్తినిచ్చే వ్యాయామాలు రెండూ ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు బ్రెజిల్‌ శాస్త్రవేత్తలు. నడక లాంటి వ్యాయామాలే మధుమేహానికి చాలనుకుంటున్న తరుణంలో కంపినాస్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్త విషయాన్ని చెప్పడం గమనార్హం. ఊబకాయులు పైన చెప్పిన రెండు పనులు చేస్తే వారి కాలేయాల్లో పేరుకున్న కొవ్వు గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా రక్తంలోని చక్కెర మోతాదులు నియంత్రణలోకి వస్తాయని వీరు అంటున్నారు.

ఎలుకలపై తాము జరిపిన ప్రయోగాల్లో రెండువారాలపాటు బరువులెత్తడం, శక్తినిచ్చే వ్యాయామాలు చేయడం ద్వారా కాలేయ కణజాలంలోని జన్యువుల్లో మార్పులు వచ్చాయని, ఫలితంగా అక్కడి కొవ్వులు వేగంగా కరగడం మొదలైందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లియాండ్రో పెరీరా తెలిపారు. ఇదంతా ఎలా జరుగుతోందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, వ్యాయామం కారణంగా నిర్దిష్ట ప్రొటీన్ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులను గుర్తిస్తే వాటిని కృత్రిమంగా తయారు చేయవచ్చునని లియాండ్రో ఆశాభావం వ్యక్తం చేశారు. కాలేయంలో ఎక్కువ కొవ్వు ఉన్నప్పుడు స్థానికంగా మంట/వాపు లాంటివి వస్తాయని, ఫలితంగా కాలేయంలోని కణాలు ఇన్సులిన్‌పై ప్రభావం చూపే స్థితిని కోల్పోతాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరాహారంగా మాత్రమే ఉన్నప్పుడు విడుదల కావాల్సిన గ్లూకోజ్‌ రక్తంలోనికి చేరిపోతుందని వివరించారు.

మరిన్ని వార్తలు