కోహితూర్‌.. నిజమైన రాజ ఫలం!

17 Jul, 2018 04:18 IST|Sakshi
కోహితూర్‌ మామిడి పండ్లు

చారిత్రక ప్రసిద్ధి పొందిన కోహితూర్‌ మామిడి పండుకు ప్రాదేశిక గుర్తింపు పొందడానికి పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది అత్యంత మధురమైన ఫలరాజం. దీనికున్న మరో విశిష్టత ఏమిటంటే.. ప్రత్యేకించి రాజ కుటుంబీకులు మాత్రమే తినేవారట. దాదాపు రెండున్నర శతాబ్దాల క్రితం ఈస్టిండియా కంపెనీ భారత ఉపఖండంలో రాజకీయ పగ్గాలు చేపట్టడానికి ముందు పశ్చిమ బెంగాల్‌ను పాలించిన ముర్షీదాబాద్‌ చివరి నవాబు సిరాజ్‌–ఉద్‌–దాలా హయాం(క్రీ.శ.1733–1757)లో ఈ మామిడి వంగడం రూపుదాల్చింది. ఈ ఫలరాజాన్ని రాజ కుటుంబీకులు అమితంగా ఇష్టపడేవారట.

చారిత్రక ప్రసిద్ధి పొందిన ఈ మధుర ఫలరాజం ఒక్కొక్కటి రూ.1,500 వరకు మార్కెట్‌లో ధర పలుకుతోందిప్పుడు. ఇది సున్నితమైన ఫలం కావడం వల్ల చెట్టు మీదనే మిగల పండిన తర్వాత చేతితోనే కోసి.. భద్రంగా దూదిలో ఉంచుతూ ఉంటారు. కోసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా తినేయాల్సి ఉంటుంది. అతి సున్నితమైన పండు కావడంతో నిల్వ, రవాణాలో పరిమితుల దృష్ట్యా ఈ వంగడం వాణిజ్యపరంగా సాగుకు అనుకూలమైనది కాదని రైతులు భావిస్తున్నారు. అందువల్ల ఈ వంగడం అంతరించిపోయే స్థితిలో ఉంది. ముర్షీదాబాద్‌ జిల్లాలో 15 మంది రైతుల దగ్గర 25–30 కొహితూర్‌ మామిడి చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయట.

కొన్ని చెట్ల వయసు 150 ఏళ్లకు పైగానే ఉందట. ఒక్కో చెట్టు ఏడాదికి 40 పండ్ల కన్నా కాయదు. ఒక సంవత్సరం కాసిన చెట్టు రెండో ఏడాది కాయదు. ఈ నేపధ్యంలో కోహితూర్‌ మామిడి రకాన్ని పరిరక్షించడానికి ఉపక్రమించిన పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ప్రాదేశిక గుర్తింపు ఇవ్వవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల కోరింది. ముర్షీదాబాద్‌ నవాబు సిరాజ్‌–ఉద్‌–దౌలా మామిడి పండ్లంటే అమితంగా ఇష్టపడే వారట. దేశవ్యాప్తంగా అనేక రకాల మామిడి రకాలను సేకరించి పెంచేవారు. మేలైన మామిడి రకాలను సంకరపరచి మంచి రకాలను తయారు చేసేందుకు ప్రత్యేక నిపుణులను ఆయన నియమించారు.

హకీమ్‌ అదల మొహమ్మది అనే మామిడి ప్రజనన అధికారి.. రాజు గారికి బాగా ఇష్టమైన కాలోపహర్‌ను, మరో రకాన్ని సంకరపరచి కొహితూర్‌ వంగడాన్ని రూపొందించారు.  రైతుకు పండుకు రూ. 500 వరకు రాబడి ఉంటుంది కాబట్టి.. ప్రాదేశిక గుర్తింపు(జి.ఐ.) ఇస్తే దీని సాగుకు రైతులను ప్రోత్సహించడం సాధ్యపడుతుందని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాదేశిక గుర్తింపు లభిస్తే.. సంబంధిత అధికారుల వద్ద ముందుగా రిజిస్టర్‌ చేయించుకున్న రైతులే ఈ వంగడాన్ని సాగు చేయగలుగుతారు, అమ్ముకోగలుగుతారు. పూర్వం రాజులు కోహితూర్‌ మామిడి పండ్లను తేనెలో ముంచి ఉంచడం ద్వారా కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచుకునే వారట! అంతేకాదు.. ఇనుప కత్తితో కోస్తే దీని రుచి పాడవుతుందట. వెదురు చాకులతో కోస్తేనే దీని రుచి బాగుంటుందని చెబుతుండటం విశేషం!!

మరిన్ని వార్తలు