గుమ్మాలకు మామిడి తోరణాలెందుకు? 

21 Mar, 2018 00:52 IST|Sakshi

సైన్స్‌    సంప్రదాయం 

భారతీయ సంస్కృతి ఎంతో విశిష్టమైనది, మరెంతో శాస్త్రీయమైనది. మన సంస్కృతిలోని ఆచారాలన్నీ అద్భుతమైన ఆరోగ్య సూత్రాలతో ముడిపడి ఉండటం విశేషం. దానిలోని అంతస్సూత్రం తెలీనివారికి చాదస్తంగా అనిపించవచ్చు, కానీ అంతరార్థం తెలిస్తే, అంతా నిజమేనని అంగీకరించక తప్పదు..ఇంటిగుమ్మాలకు కట్టే మామిడాకుల తోరణాలతో ముందుగా ప్రారంభిద్దాం. ప్రతిపండగకూ ఇంటి సింహద్వారానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టడం మనకు తెలుసు కదా! పెళ్ళిళ్ళూ, వ్రతాలు జరిగేప్పుడు వాకిలిముందరి స్తంభాలకు అరటిచెట్లు, పూజామందిరానికి అరటిపిలకలు కడతారు. పూర్వం పల్లెల్లో తప్పని సరిగా కొబ్బరిమట్టలు స్తంభాలకు కట్టేవారు.ఇది ఒక చాదస్తమా! లేక ఏదైనా ఉపయోగం ఉందా! చాలామంది ఒకచోట చేరినపుడు అంతా విడిచే  బొగ్గు పులుసువాయువు (కార్బన్‌ డై ఆక్సైడ్‌ వల్ల గాలి కలుషితమై, ఊపిరాడక పోవడం, తలతిరగటం తలనొప్పి రావటం జరుగుతుంటాయి. అందుకే ముఖ్యంగా పసిపిల్లలు ఇలాంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో దారుణమైన ఉక్కపోత, వేడిమికి గురై, ఊపిరి బిగదీసినట్లై గుక్కపట్టి ఏడస్తుంటారు. దీన్నే ఆంగ్లంలో ‘సఫకేషన్‌‘అంటారు. ఈ మామిడి, అరటి, కొబ్బరి ఆకుల్లో చెట్టునుంచి కోశాక కూడా చాలాసేపటి వరకూ కార్బన్‌ డై యాక్సైడ్‌ను పీల్చుకుని, ఆక్సిజన్‌ను వదిలే గుణం ఉంటుంది. అందువల్ల ఊపిరాడకపోడం జరగదు. అంతేకాక ఈ ఆకులలోని ఆకుపచ్చరంగు కంటికి ఆహ్లాదాన్ని, మనస్సుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

సహజరీతిలో అలంకారంతో పాటుగా, ఆరోగ్యాన్నీ కలిగిస్తాయి. చూశారా... ఈ మామిడాకులు, తోరణాలవల్ల ఎంత మేలు జరుగుతుందో! ఇంటి గుమ్మాలకు ముఖ్యంగా సింహద్వారాలకు పసుపు పూసి, కుంకుమబొట్లు పెట్టడం, ఇంటిలోకి  దేవిని స్వాగతించడం! పసుపు యాంటీబయాటిక్‌ సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. నోములూ వ్రతాల సమయంలో మహిళల పాదాలకు పసుపు రాసేవారు, మహిళలు ఎక్కువగా నీళ్ళలో పని ఉంటుంది, ఈ పసుపు రాసుకోడం వల్ల కాళ్లు, వేళ్లు పాయటం వంటివి జరగదు. . శరీరానికీ మహిళలు పసుపురాసుకుని స్నానంచేసేవారు. దీనివల్లా శరీరానికి రంగురావటమేకాక అనవసర కేశాలు రాలిపోతాయి.

ఇదేవిధంగా పెళ్లిళ్లలో కర్పూరపు దండలు అని ఇచ్చేవారు. వీటిలో కూడా బయటి గాలిలోని కాలుష్యాన్ని పీల్చుకుని, మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే గుణం ఉంది. అందుకే వివాహాది శుభకార్యాలలో కర్పూరపు బంతులను ప్రతి ఒక్కరికీ ఇస్తుంటారు. వధూవరులకు మెడలో తప్పనిసరిగా వీటిని ధరింపజేస్తుంటారు. వీటితోబాటు వెనకటి రోజుల్లో శుభకార్యాలు జరిగేటప్పుడు అందరికీ తలొక తాటాకు విసన కర్రా ఇచ్చేవారు. వీటినుంచి వీచే గాలి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ విసన కర్రలు తడిసినా కూడా మంచి వాసన వేస్తుంది. చల్లటి గాలి వంటికి తగులుతుంది.

మరిన్ని వార్తలు