ఉత్తమ గృహస్థ ధర్మాలంటే ఏమిటి?

20 Nov, 2017 23:46 IST|Sakshi

ఆత్మీయం

గృహస్థాశ్రమంలో భార్యాభర్తల పరస్పర ప్రవర్తన ఎలా ఉండాలనే విషయమై పెద్దలు చక్కగా చెప్పారు. ముందుగా భర్త, భార్య గురించి – ‘‘ఈమె తన తల్లి దండ్రులు, సోదరులు మొదలైన వారినందర్నీ విడిచి నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఈమెకు ఏవిధమైన కష్టమూ కలగనివ్వకూడదు. తిండి, బట్ట, ఇల్లు మొదలైన వాటికి లోటుండకూడదు. అన్ని విషయాలలోనూ ఈమెకే ఎక్కువ సుఖం లభించాలి’’ అని భావించాలి. ఆమె బాగోగులను, ఇష్టాయిష్టాలను దృష్టిలో ఉంచుకోవాలి. మరి భార్యకు ఎటువంటి భావం ఉండాలంటే – ‘‘నేను నా గోత్రాన్ని, కుటుంబాన్నీ, పుట్టినింటిలో ఉండే స్వేచ్ఛాస్వాతంత్య్రాలనూ వదులుకుని వీరి ఇంటికి వస్తున్నాను. వీరివల్ల నాకు అవమానం, కష్టం కలగకూడదు. అదేవిధంగా నా వల్ల వీరికి దుఃఖం, అవమానం, నింద, తిరస్కారం జరుగకూడదు. నేనెంత కష్టమైనా అనుభవిస్తాను కానీ, వీరికి మాత్రం నా వల్ల కొంచెం కూడా కష్టం నష్టం కలుగరాదు.’’

అంటూ ఆమె తన సుఖ సంతోషాలకన్నా, భర్త, అత్తమామలు, ఆడపడచులు, బావగార్లు, మరుదులు, తోటికోడళ్లు, తదితరుల సుఖసంతోషాలను దృష్టిలో ఉంచుకొని ఇహ పర శ్రేయస్సు కోరుకోవాలి. గృహస్థాశ్రమంలో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే గుణాన్ని అలవరచుకోవాలి. ఇబ్బందులు ఎదురైతే సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. భార్యను అర్థాంగిగా గుర్తించి అహంకారాలకు, అనుమానాలకు తావివ్వక అభిమానాన్ని, ఆనందాన్ని పంచుతూ భర్త తన పాత్రను గుర్తెరిగి గృహానికి యజమానిగా తనవంతు బాధ్యతను సదవగాహనతో పోషించాలి. అదేవిధంగా భార్య కూడా, భర్త మనోభావాలకు, అభిరుచులకూ అనుగుణంగా వ్యవహరించడం, పెద్దలను ఆదరాభిమానాలతో సేవించడం వంటి ఉన్నత విలువలు కలిగి ఉండాలి. అప్పుడే కుటుంబంలో శాంతి, సామరస్యాలు నెలకొంటాయి. పరిస్థితులు బాగా లేనపుడు వాటిని అవగాహనతో పరిష్కరించుకోగలిగే సామర్థ్యాలను పెంపొందించుకుంటూ అన్యోన్యతతో, అవగాహనతో వ్యవహరించాలి.

మరిన్ని వార్తలు