కాఫీ, చాక్లెట్స్ మెదడుకు చేసేదేమిటీ!

22 Dec, 2013 23:45 IST|Sakshi

కొందరికి టీ కాఫీలు మంచినీళ్ల ప్రాయం. అలా తాగడం వల్ల ఒనగూరే లాభాలు, నష్టాలు తెలియకపోయినా అదేపనిగా వాటిని తాగేస్తుంటారు. నాలుగు కప్పులకు మించకుండా తాగే టీ... కనీసం 20 శాతం పక్షవాతాలను నివారిస్తుంది. చాక్లెట్ల తీరూ అంతే. కానీ మూడు కప్పులు మించిన కాఫీతో మాత్రం ఇబ్బందులు తప్పవు. పరిమితంగా తినే చాక్లెట్లు మెదడుకు తియ్యటి నేస్తాలై మతిమరపు రానివ్వకుండా చేస్తాయి. అలాగని మస్తీ చేస్తే మళ్లీ డేంజరే. కాఫీ, టీ, చాక్లెట్ల వల్ల మెదడుపై ప్రభావాల వివరాల సమాహారమే ఈ కథనం.
 
 మనకు సంబంధించినంత వరకు కాఫీ చూడటానికి ఆకర్షణీయంగా, చిక్కటి రంగుతో, పొగలుకక్కుతూ, రుచికరమైన సువాసనను వెలువరుస్తూ చూడగానే  తాగాలనిపిస్తుంది. అంతవరకే మనకు తెలిసింది. కానీ అదెంతో సంక్లిష్టమైన పానీయం. ఒక కప్పు కాఫీలో వందలకొద్దీ జీవసంబంధమైన పదార్థాలున్నాయి. అందులో కొన్ని చురుకైనవి. ఉదాహరణకు కెఫిన్, డైటర్‌పిన్స్, డైఫీనాల్స్ వంటివి. ఒక కప్పు కాఫీ తాగగానే హృదయ స్పందనల విషయంలో దాని ప్రభావం ఉంటుంది. అయితే ఆ ప్రభావం ఏమేరకు అన్నది...  వ్యక్తిగతంగా తాగేవారికి ఉన్న కొన్ని వ్యాధులు, లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే కాఫీ ఎలా తయారుచేశారు అనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే...  అది ఫిల్టర్ కాఫీయా లేక సాధారణ కాఫీయా అన్న అంశంపైన అన్నమాట.
 
 కెఫిన్ ప్రభావం: కాఫీలో ఉండే కెఫిన్ చాలా ప్రధానమైన ఉత్ప్రేరకం. మనం కాఫీ తాగగానే ఏమవుతుందో చూద్దాం. కాఫీ ఒంట్లోకి ఇంకగానే దాని ప్రభావం శరీరంపై, ఆరోగ్యంపై కనిపిస్తుంది. కాఫీ తాగిన కాసేపట్లో రక్తపోటు (ప్రధానంగా సిస్టోల్ బ్లడ్‌ప్రెషర్) పెరుగుతుంది. బీపీని కొలిచే సాధనంతో చూస్తే, అది సాధారణం కంటే 8 ఎంఎం/హెచ్‌జీ ఎక్కువవుతుంది. డయాస్టోలిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అయితే అది 6 ఎంఎం/హెచ్‌జీ పెరుగుతుంది. ఈ రెండు పెరుగుదలలూ కాఫీతాగిన తర్వాత సుమారు గంట నుంచి మూడు గంటల పాటు అలాగే ఉంటాయి. ఈ కొలతల్లో పెరుగుదల అన్నది సాధారణ వ్యక్తుల కంటే రక్తపోటుతో బాధపడేవారిలో ఎక్కువ.
 

అందుకే హైబీపీతో బాధపడేవారు కాఫీ తాగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అంతగా తాగాలనిపిస్తే కొద్ది మోతాదులో మాత్రమే తమ జిహ్వను సంతృప్తిపరచడానికి తీసుకోవాలి. ఎందుకంటే... ఇలా కాఫీ ఎక్కువగా తాగుతూ బీపీని పెంచుకోవడం వల్ల దీర్ఘకాలికంగా దాని దుష్ర్పభావాలు ఉంటాయి. ఎందుకంటే కాఫీ తాగిన ప్రతిసారీ కెఫిన్ విషయంలో కొంత నిరోధకత (టాలరెన్స్) పెరుగుతూ ఉంటుంది. అంటే మొదటిసారి కాఫీ తాగినప్పుడు కలిగే ఉత్తేజం, రెండో కాఫీకి తగ్గుతుందన్నమాట. అందుకే రెండోసారి కూడా అంత ఉత్తేజం పొందాలనుకుంటే రెండోసారి కాస్త ఎక్కువ తాగాలన్నమాట. ఇలా కాఫీ ఇచ్చే ఉత్తేజానికి అలవాటుపడ్డప్పుడు క్రమంగా మోతాదును పెంచుకుంటా రు. ప్రధానంగా పరీక్షల కోసం చదివే పిల్లలు రాత్రుళ్లు చురుగ్గా ఉండటం కోసం, నిద్రమత్తును దూరం చేసుకోవడం కోసం దీనిపై ఆధారపడతారు.
 
 కాఫీని కేవలం పానీయంగానే పరిగణించకూడదు. ఎందుకంటే ఇందులో మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే ‘యాంటీ మైగ్రేన్’ ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగాక రెండోదానికి వ్యవధి ఇవ్వాలి. లేకపోతే అవసరం లేని మందును/మాత్రను వేసుకుని దాని సైడ్‌ఎఫెక్ట్స్‌ను పొందడమేనని గుర్తుంచుకోవాలి.  అలాగే కాఫీ... యాంగ్జైటీని పెంచుతుంది. కొందరిలో వణుకును కూడా పెంచుతుంది. అందుకే యాంగ్జైటీతో బాధపడేవారు కాఫీని తాగకపోవడమే మంచిది. ఇక ఎస్ప్రెస్సో కాఫీతో ఆరోగ్యానికి జరిగే హాని అంతా ఇంతా కాదు.
 
 డైటర్‌పీన్ ప్రభావం: కాఫీలో ఉండే డైటర్‌పీన్ ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో చూద్దాం. కాఫీలో ఉండే ఈ జీవరసాయనం శరీరంలోకి ప్రవేశించగానే అది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) పాళ్లను, హానికరమైన ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను అకస్మాత్తుగా పెంచేస్తుంది. ఇక ఫిల్టర్ కాఫీలో డైటర్‌పీన్స్ పెద్దగా ఉండవు. ఎందుకంటే వడపోత ప్రక్రియలో ఇవి కాఫీలోకి వెళ్లకుండా, ఫిల్టర్ కాగితంపైనే ఉండిపోతాయి. కానీ ఫిల్టర్ చేయని కాఫీలో మాత్రం డైటర్‌పీన్ పాళ్లు అధికంగా ఉంటాయి. అందుకే కేవలం హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లు మాత్రమేగాక... శరీరంలో కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండే హైపర్‌లిపిడేమియాతో బాధపడే రోగులు సైతం కాఫీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు మామూలు కాఫీకి బదులుగా ఫిల్టర్ కాఫీని ఒక కప్పు మాత్రం తీసుకోవచ్చు.
 
 మంచి గుణాలు లేవా?: కాఫీ ఎప్పుడూ హానికరమేనా? ఇందులో మంచి గుణాలు లేవా? కాఫీ ప్రియులు అంతగా నిరాశ పడనక్కర్లేదు. ఎందుకంటే కాఫీని పరిమిత మోతాదులో తీసుకుంటే అది పక్షవాతాన్ని (స్ట్రోక్‌ని) నివారిస్తుంది. కాఫీలోని డైఫినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఈ పని చేస్తుంది. ఐదులక్షల మంది కాఫీ ప్రియులపై విస్తృతంగా చేసిన అధ్యయనాలలో ఈ విషయం తెలిసింది. అయితే ఈ ప్రయోజనాన్ని పొందడానికి కాఫీని కేవలం రోజుకు రెండు  కప్పులకు మాత్రమే పరిమితం చేసుకోవాలి.
 
 గ్రీన్ టీ - బ్లాక్ టీ ల ప్రభావాలు: టీ గురించి పూర్వం నుంచే తెలుసు. ప్రధానంగా చైనా వారికి టీ గురించి 4,700 సంవత్సరాల క్రితం నుంచీ అవగాహన ఉంది. మంచినీళ్ల తర్వాత మానవాళి అత్యధికంగా తాగేది టీనే. ఇందులోనూ అనేక రకాలున్నాయి. అయితే మనం తీసుకునే టీ ఎంతోకొంత పులిసే తత్వం ఉన్న పానీయం. కానీ గ్రీన్ టీలో పులిసే తత్వం లేదు. ఇక అన్నిరకాల టీలలో కాటేచిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనే జీవరసాయనాలు ప్రధానంగా ఉంటాయి. ఇవి రెండూ ప్రభావపూర్వకమైన యాంటీ ఆక్సిడెంట్స్. అయితే టీలో... ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు... వంటివేవీ ఉండవు. టీ తాగగానే అందులోని ఫ్లేవనాయిడ్స్ హానికరమైన కొలెస్ట్రాల్ అయిన ఎల్‌డీఎల్‌ను,  కొవ్వుపదార్థాలైన ట్రైగ్లిజరాయిడ్స్‌ను సైతం తగ్గిస్తాయి. కానీ శరీరానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) ను మాత్రం పెంచలేవు.
 
 టీ తాగడం వల్ల కొవ్వు పేరుకునే ప్రక్రియకు కాస్త అడ్డుకట్ట పడుతుంది. అయితే ఈ సుగుణం ఉంది కదా అని మోతాదుకు మించకుండా పరిమితంగా మాత్రమే తాగాలి. అంటే రోజుకు నాలుగు కప్పులకు మించనివ్వకూడదు. ఇలా పరిమితంగా టీ తాగడం పక్షవాతాన్ని నివారిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల వచ్చే ఇస్కిమిక్ స్ట్రోక్, రక్తనాళాలు చిట్లడం వల్ల వచ్చే హేమరేజిక్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్‌ల నివారణకు తోడ్పడతాయి. ఇలా స్ట్రోక్‌ను నివారించే గుణం సాధారణ టీ కంటే గ్రీన్ టీ లో ఎక్కువగా ఉంది. వివిధరకాల పక్షవాతాల్లో కనీసం 20 శాతం పక్షవాతాలను టీ నివారిస్తుంది.
 
 తాగిన వెంటనే శరీరంలో కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించడం, నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లను పెంచడం వంటి గుణాలు ఉన్నందున ఈ ప్రయోజనం చేకూరుతుంది. రక్తనాళాల్లోని లోపలి పొర అయిన ఎండోథీలియం... రక్తాన్ని సాఫీగా ప్రవహించేలా చేస్తుంది. ఈ గుణాన్ని టీ మరింత మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. టీలోనూ కొంత మేరకు కెఫిన్ పాళ్లు టీలో ఉన్నప్పటికీ వాటి ప్రభావం చాలా తక్కువ.
 
 ఆరోగ్యానికి మేలు చేకూరేలా టీ తాగడం ఎలా: టీలో కాచెటిన్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు కాచిన టీలోనే అవి ఎక్కువగా లభిస్తాయి. అందుకే టీని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తయారుచేసుకుని తాగాలి. ఇన్‌స్టాంట్ టీ/ఐస్ టీలలో కాచెటిన్, ఫ్లేవనాయిడ్స్ పాళ్లు చాలా తక్కువ.
 
 టీ లో ప్రతికూల అంశాలు...
మేలు గుణాలతో పాటు, టీ లో కొన్ని ప్రతికూల గుణాలూ ఉన్నాయి. ఉదాహరణకు మనం తీసుకున్న ఆహారం, పండ్లు, కూరగాయల నుంచి శరీరానికి అందాల్సిన ఐరన్‌ను టీ శరీరంలోకి ఇంకకుండా నిరోధిస్తుంది.
 అందుకే ఆహారం తీసుకునే సమయంలో టీని పూర్తిగా దూరంగా ఉంచాలి. తినే ముందు, తిన్న తర్వాత కూడా చాలాసేపటి వరకు టీ తాగకూడదు. అలాగే టీ ఎక్కువగా తాగే అలవాటు (అంటే రోజుకు ఒక లీటర్ కంటే ఎక్కువగా తాగుతూ, అలా ఏళ్ల తరబడి తాగేవారికి) దీర్ఘకాలంలో ‘ఫ్లోరోసిస్’ కు దారితీసే ప్రమాదం ఉంది.
 
 పైన పేర్కొన్న అధ్యయనాలతో తేలిన విషయం ఏమిటంటే... గ్రీన్ టీ లేదా సాధారణ టీ తాగే అలవాటును కొనసాగించవచ్చు. కాకపోతే రోజుకు నాలుగు కప్పులకు మించి తాగవద్దు. ఆ పరిమితుల్లో టీ తాగడం వల్ల భవిష్యత్తులో పక్షవాతాన్ని చాలావరకు, గుండెజబ్బులను కొద్దిమేరకు నివారించుకోవచ్చు. ఇక చాక్లెట్ కూడా ఒకటికి మించి తినవద్దు. అయితే కాఫీ అలవాటు ఉన్నవారు మాత్రం రోజుకు రెండు కప్పులకు మించి తాగకూడదు. ఆ మోతాదు మించితే అది హానికరమని గ్రహించండి.
 
 కాఫీ, టీలలో వేసుకునే చక్కెర పాళ్లను గణనీయంగా తగ్గించాలని గుర్తుపెట్టుకోండి. పరిమితికి మించిన చక్కెర వేసుకుంటుంటే అది క్రమంగా రక్తంలో చక్కెరపాళ్లను పెంచడం, బరువును పెంచి స్థూలకాయం వచ్చేలా చేయడం జరుగుతుందని మర్చిపోకూడదు.
 
 -నిర్వహణ: యాసీన్
 
 చాక్లెట్ ప్రభావాలు


 ఒకప్పుడు చాక్లెట్ చాలా ప్రియం (ఎక్స్‌పెన్సివ్) గా ఉండేది. అది చాలా అరుదైన పదార్థంగా మాత్రమే లభ్యమయ్యేది. కేవలం ధనవంతులకే అందుబాటులో ఉండేది. అప్పట్లో దాని లభ్యత చాలా తక్కువ కావడం, పైగా అది సెక్స్ ఉద్దీపించే పదార్థంగా ప్రాచుర్యం పొందడంతో వాటి ధర మరీ ఎక్కువగా ఉండేది. చాక్లెట్‌లో ఉపయోగించే కోకాలో... ఫ్లేవనాయిడ్స్ అని పిలిచే చాలా ప్రభావపూర్వకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంతేకాదు... చాలా పరిమితంగా తీసుకున్నప్పుడు చాక్లెట్స్ హైబీపీని కొద్దిమేర నియంత్రిస్తుంటాయి. అయితే కొలెస్ట్రాల్‌పై మాత్రం దీని ప్రభావం అంతగా ఉండదు. పరిమితంగా చాక్లెట్ తినే గుణం ఉన్నవారిలో అది పక్షవాతం రిస్క్‌ను 19 శాతం తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు... పరిమితంగా చాక్లెట్ తినేవారిలో జ్ఞాపకశక్తి మందగించడం వల్ల వచ్చే ‘డిమెన్షియా’ కూడా తక్కువే. ఈ గుణం కారణంగా అది భవిష్యత్తులో ‘అల్జైమర్స్ డిసీజ్’ రిస్క్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. చాక్లెట్ల ద్వారా లభ్యమయ్యే ఈ ప్రయోజనాలు కేవలం డార్క్ చాక్లెట్లు లేదా కోకో ఉన్న చాక్లెట్లకు మాత్రమే పరిమితం. అయితే పరిమితికి మించి చాక్లెట్లు తీసుకోవడం స్థూలకాయం వంటి అనేక అనర్థాలకు దారితీస్తుందని గ్రహించాలి.
 
 డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి
 చీఫ్ న్యూరోఫిజీషియన్,
 కేర్ హాస్పిటల్స్,
 బంజారాహిల్స్, హైదరాబాద్.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు