మనిషి గతి ఇంతే!

6 Dec, 2015 10:12 IST|Sakshi
మనిషి గతి ఇంతే!

హ్యూమర్ ప్లస్
మనుషులు లక్షా తొంభై రకాలు. మనకు గట్టిగా తొంభై రకాలే పరిచయమవుతారు. మిగిలిన లక్ష గురించి తెలుసుకోవడం ఇతరుల బాధ్యత. మనం చాలా పర్‌ఫెక్ట్ అనుకుంటాం కానీ మన డిఫెక్ట్స్ ఎదుటివాళ్లు కనిపెడతారు. ఇతరుల పిచ్చిని తెలుసుకోవడమే పనిగా పెట్టుకున్నవాళ్లు కొందరుంటారు. వాళ్లే పిచ్చాసుపత్రి డాక్టర్లు. జీతం తీసుకుని మరీ పిచ్చివాళ్లతో కలిసి జీవిస్తుంటారు.
 
నాకు తెలిసిన డాక్టర్ ఒకాయన ఉన్నాడు. నైజీరియా ప్రభుత్వం డాక్టరేట్ ఇచ్చి సన్మానం చేస్తుందని ఈ-మెయిల్ వస్తే ఖర్చుల కోసం 50 వేలు బ్యాంక్‌లో కట్టాడు. ఆ తరువాత నైజీరియా నుంచి సమాధానం నై. అసలు నైజీరియా వాళ్లకి కొట్టుకు చావడానికే టైం లేదు, మధ్యలో ఈయన్ని పిలిచి సన్మానం ఎందుకు చేస్తారు. వాళ్లకేమైనా పిచ్చా? అందరి పిచ్చిని తెలుసుకునే ఈయన ఇది తెలుసుకోలేక డబ్బు పోగొట్టుకున్నాడు.
 
మన గురించి ఎవడైనా గొప్పగా అనుకుంటే చాలు ఒళ్లు మరిచిపోతాం. మనకు అంత సీన్ ఉందా లేదా అనేది అవసరం. ఎవడి పెళ్లికి వాడే హీరో అయినట్టు మన జీవితానికి మనమే కథానాయకులం. మనంతటి వారు లేరనేది మన ఫిలాసఫీ.
 
తాగినప్పుడు ఇది చాలామందికి తలకెక్కుతుంది. మీరు తాగుబోతులైనా కాకపోయినా పర్లేదు. అయితే మరీ మంచిది. కల్లు కాంపౌండ్‌లో గానీ వైన్‌షాప్‌లో గానీ కాసేపు కూర్చుని చూడండి. బోలెడంత వేదాంత చర్చ జరుగుతూ ఉంటుంది.

 ‘‘నేనెవర్ని? ఎలాంటివాన్ని? ఈ లోకాన్ని అడగండి అదే చెబుతుంది. డబ్బుదేముంది. మనుషులు ముఖ్యం. అన్నీ చూడ్డానికి దేవుడున్నాడు. కొంచెం సోడా పొయ్. ఆ బాయిల్డ్ పల్లీ తీసుకో.’’
 
ఇది ఫస్ట్ రౌండ్ చర్చ. థర్డ్‌కి వెళితే భాష బాషా సినిమాలో రజనీకాంత్‌లా విజృంభిస్తుంది.
 ‘‘నన్షు అందర్షు మోసమ్ష్ చేసినా నేనెవర్షి షేయలేద్షు...’’ నిషా కదా ష అక్షరం అంతటా తానై నర్తిస్తుంది. ‘ష’ ఒక వూతకర్రతో నడిచినట్టు తాగుబోతుల అడుగులు కూడా బడతడుతాయి. ఎంత తడబడినా మనం మనింటికే వెళితే సేఫ్, లేదంటే వీపు సాప్.
 
మనుషులందరికీ వాస్తవం కంటే భ్రాంతి ఎక్కువ ఇష్టం. రియాల్టీలో క్రూయాల్టీ ఉంటుంది. దాన్ని తట్టుకోవడం కష్టం. అందుకే సినిమాలకెళ్లి రంగుల్లో కలల్ని కొనుక్కుంటాం. కొంతమంది దర్శకులు తెలివి మీరి తెరపైన కూడా జీవితాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. అంతకంత అనుభవిస్తారు. ఉన్న జీవితంతోనే చస్తుంటే డబ్బిచ్చి కూడా జీవితాన్నే చూడమంటే ఎవరు చూస్తారు?
 
లైఫ్ నుంచి, వైఫ్ నుంచి పారిపోవడానికి తాగడం మొదలుపెడతారు. ఎక్కింది దిగగానే ఎదురుగా నైఫ్‌లే వైఫ్. ఒకాయన ఉన్నాడు. ఆయనెప్పుడూ నోరే తెరవడు. ఒకటి మాట్లాడితే భార్య తంతుంది. రెండు మాట్లాడితే ఉతుకుతుంది. అందుకే ఆ మౌనదీక్ష. కాని మందు పడితే మౌనం పారిపోతుంది. అరుపులు, పెడబొబ్బలు, సవాళ్లు... బండి డౌన్ కాగానే గాలి తీసిన బెలూన్, మూగవాడి పిల్లనగ్రోవి.
 
మనదేశం గొప్పతనం ఏమంటే ఇక్కడ కల్తీ కల్లు తాగి చచ్చిపోతారు. కల్తీ కల్లు దొరక్కపోతే కూడా చచ్చిపోతారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా పోయేది బరియల్ గ్రౌండ్‌కే!
 - జి.ఆర్.మహర్షి

మరిన్ని వార్తలు