ఏ సినిమానో చెప్పుకోండి!

30 Nov, 2017 00:24 IST|Sakshi

షారుక్‌ ఖాన్‌ దీపికా పదుకోన్‌ చెంపల మీద కారుతున్న కన్నీటి చుక్కలను ప్రేమగా, మృదువుగా, ఆప్యాయంగా తుడిచాడు. ఏ సినిమాలో చెప్పుకోండి? క్లూ ఇస్తాం. షారుక్, దీపిక కలిసి చేసింది మూడు సినిమాలే. ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూయర్‌. టెన్షన్‌ పడకండి. ఆన్సర్‌ మేమే చెప్పేస్తాం. ఓం శాంతి ఓం ఫ్లాప్‌ ఇచ్చి, షారుక్‌కి ఒక కంట కన్నీరు పెట్టిస్తే, హ్యాపీ న్యూఇయర్‌ ఫ్లాప్‌ కొట్టి, షారుక్‌ రెండో కంటి కన్నీరు అయింది.

ఇక దీపిక ఆ రెండిటిలోనే కాదు, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోనూ అసలు కన్నీరే పెట్టలేదు. మరెక్కడబ్బా... షారుక్‌ దీపిక కన్నీళ్లు తుడిచిందీ? ‘బాతే విత్‌ బాద్‌షా’ ప్రోగ్రామ్‌లో. షారుక్‌ హోస్ట్‌ చేస్తున్న ఆ టాక్‌ షోలో దీపికకు వాళ్ల అమ్మ రాసిన ఉత్తరం చదివి వినిపించాడు షారుక్‌. దీపిక తన కూతురు అయినందుకు తనకెంతో గర్వంగా ఉందనీ, ఉత్తరంలో అమ్మ రాసింది. ఆ మాటలు విని దీపిక టపటపా కన్నీరు కార్చేసింది. ‘అరె! ఇంత చిన్న విషయానికే అంతగా కన్నీళ్లా!’ అని అనుకోవద్దు.

కొద్ది వారాలుగా దీపిక చాలా స్ట్రెస్‌లో ఉంది. హిందూ అతివాదులు తన సినిమా ‘పద్మావతి’ మీద విపరీతంగా రాద్ధాంతం చేస్తున్నారు. దీపిక తల మీద ఓ ఐదు కోట్ల ఆకూవక్క కూడా పెట్టారు. అదేనండీ.. సుపారీ! ఎలాగైతేనేం.. ఈ కొన్ని వారాల్లో సినిమా ఆగి, ఆగి, ఇంకా రిలీజ్‌ కాని కారణంగా తనపై వస్తున్న వ్యక్తిగత దూషణల వల్ల దీపిక బాగా ఎమోషనల్‌గా ఉన్నారు. అందరూ దూషిస్తున్న సమయంలో అమ్మ మాటలు దీపికను ఏడ్చేలా చేశాయి. షారుక్‌ ఊరుకుంటాడా.. లైవ్‌ షోలో దీపిక కన్నీళ్లు తుడిచాడు.

మరిన్ని వార్తలు