-

ఉగాదిన ఏం చేయాలంటే..?

29 Mar, 2017 00:10 IST|Sakshi
ఉగాదిన ఏం చేయాలంటే..?

దుర్ముఖి నామ సంవత్సరం నుంచి నేడు మనం హేవిళంబి నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం.  రైతులు, రాజకీయనాయకులు, ఉపాధ్యాయులు, కళాసాంస్కృతిక రంగాలవారు, సినీనటులు, ఉపాధ్యాయులు, వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలలో ఉండే వారంతా ఈ సంవత్సరం తమ రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవడం ఆచారం. అంతకన్నా ముందు అసలు ఉగాది రోజు ఏం చేయాలో చూద్దాం...

ఉగాది సంప్రదాయం
ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గుపెట్టి లేదా అటకలతో సహా అన్నిగదులలోనూ బూజు దులిపి ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి లేదా వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు, కుంకుమలు అలంకరించాలి.

ఆరోగ్యానికి అభ్యంగనం
ఉగాది వంటి పర్వదినాలలో నువ్వులనూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి ఉంటారని శాస్త్రోక్తి. కాబట్టి మామూలు రోజులలో ఎలా స్నానం చేసినా, ఉగాదినాడు పొద్దున్నే లేచి ఒళ్లంతా నువ్వుల నూనె, సున్నిపిండి పట్టించి, కుంకుడురసం లేదా సీకాయపొడితో తలారా స్నానం చేయాలి. అనంతరం నూతన వస్త్రాలు లేదా శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించి, నిత్యకర్మానుష్ఠానాలు ముగిసిన తర్వాత బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి, పంచాంగ శ్రవణం చేయాలి.

శుభ్రమైన దుస్తులు శుభం.. శుభం...
ఉగాదినాడు వీలయితే నూతన వస్త్రాలు లేదా చిరుగులు పడని, శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించడం శ్రేయోదాయకం. తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదం

పంచాంగం అంటే ...
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాలను కలిపి పంచాంగం అంటారు. తిథి వలన సంపద, నక్షత్రం వల్ల పాపపరిహారం, సరైన యోగంతో వ్యాధి నివృత్తి, కరణం ద్వారా కార్యానుకూలతను పొందవచ్చు.

పంచాంగ శ్రవణ ఫలమేమిటి?
ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమట. అదొక్కటే కాదు, సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం వల్ల గ్రహదోషాలు నివారించబడి, వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందట. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల  భవిష్యత్‌ కార్యాచరణను చేపట్టడం సులభం.    
– డి.వి.ఆర్‌.

మరిన్ని వార్తలు