గొంగళి పురుగు ముద్దు

12 Dec, 2016 14:30 IST|Sakshi
గొంగళి పురుగు ముద్దు

నటి రేఖ (62) జీవితంలోని ఎన్నో విషాదాలలో ఒకటి...
పదిహేనేళ్ల వయసులో తనకు ఏమాత్రం ఇష్టం లేకుండా ముద్దు పెట్టించుకోవడం!
‘నో’ అని చెప్పలేక వెక్కి వెక్కి ఏడ్వడం.
జీవితాంతం ఆ దుఃఖాన్ని మోస్తూనే ఉండడం!


‘లాస్ట్‌ టాంగో ఇన్‌ పారిస్‌’ అనే ఇటాలియన్‌ మూవీ 1972లో వచ్చింది. డైరెక్టర్‌ బెర్నార్డో బెర్తొలూచీ. ‘అంజానా సఫర్‌’ 1969 నాటి బాలీవుడ్‌ చిత్రం. దాని డైరెక్టర్‌ రాజా నవేథి. ఒకదానికొకటి సంబంధం లేని ఈ రెండు చిత్రాలు అకస్మాత్తుగా ఇప్పుడు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవిగా కనిపిస్తూ వార్తల్లోకి వచ్చాయి! లాస్ట్‌ టాంగో చిత్రంలో 19 ఏళ్ల ఫ్రెంచి నటి మారియా షినీడేర్‌ను రేప్‌ సీన్‌ షూటింగ్‌ సాకుతో ఆ చిత్ర దర్శకుడు, నటుడు కూడబలుక్కుని ‘అబ్యూజ్‌’ చేశారు. అంజానా సఫర్‌లో ఆ చిత్ర దర్శకుడు, హీరో ఒకరికొకరు కన్నుగీటుకుని 15 ఏళ్ల రేఖను ముద్దు సీన్‌ షూటింగ్‌ సాకుతో ‘అబ్యూజ్‌’ చేశారు.

లాస్ట్‌ టాంగో కన్నా మూడేళ్ల ముందే అంజానా సఫర్‌ విడుదలైనప్పటికీ, 2013లో లాస్ట్‌ టాంగో డైరెక్టర్‌ ఆనాటి అబ్యూజ్‌ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టి, అదిప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో హాలీవుడ్‌ నివ్వెరపోయింది. సినిమా ఫీల్డులో మహిళలు ఇంత అమాయకంగా లైంగిక దోపిడీకి గురవుతారా అనే ఒక అశ్చర్యంతో కూడిన చర్చ మొదలైంది. అదింకా కొనసాగుతుండగానే, ‘మనవాళ్లేం తక్కువా?’ అని నిఖితా దేశ్‌పాండే అనే అమ్మాయి.. ‘అంజానా సఫర్‌’ చిత్రం షూటింగులో డైరెక్టర్‌ రాజా నవేథి.. రేఖను హీరో బిస్వజీత్‌కు ఉద్దేశపూర్వకంగా ఎలా ‘అప్పగించిందీ’ తన ట్వీట్‌లో వివరంగా రాసింది. అందుకు రుజువుగా ఇటీవలే విడుదలైన రేఖ బయోగ్రఫీ (రేఖ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ – రచన యాసర్‌ ఉస్మాన్‌) లోని ఒక పేజీని అటాచ్‌ చేసింది.

‘‘నవేథి యాక్షన్‌ అని చెప్పగానే బిస్వజీత్‌ పదిహేనేళ్ల రేఖను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె పెదవులపై తన పెదవులను గట్టిగా అదిమి పట్టాడు. ‘యాక్షన్‌’ అని చెప్పిన నవేథి ఐదు నిమిషాల తర్వాత కానీ ‘కట్‌’ చెప్పలేదు. ఆ ఐదు నిమిషాలలో చిన్న చిన్న బ్రేక్‌లతో ఆ ముద్దు సీన్‌ అలా కంటిన్యూ అయినంత సేపూ రేఖ కళ్లు మూసుకుని, బాధను ఓర్చుకుంటూ, మనసును చిక్కబట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ తర్వాత రేఖ చాలాసేపు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది’’ అని యాసర్‌ ఉస్మాన్‌ ఆ పేజీలో రాశారు.  
నిఖిత ట్వీట్‌ తర్వాత సినిమా ఫీల్డుతో పాటు ఇప్పుడు మిగతా రంగాలలోని మగవాళ్లూ భుజాలు తడుముకుంటున్నారు. ఊరికే తడుముకుంటే కాదు బాస్‌.. ఆత్మ విమర్శ చేసుకోవాలి.


        రేఖ ఆత్మకథలోని ఓ పేజీ

మరిన్ని వార్తలు