వెంటిలేటర్‌పై ఎప్పుడు, ఎందుకు..?

29 Aug, 2015 00:33 IST|Sakshi

జనరల్ హెల్త్ కౌన్సెలింగ్
 
వెంటిలేటర్‌పై ఎప్పుడు, ఎందుకు..?
మా అమ్మగారి వయసు 68 ఏళ్లు. ఇప్పుడు ఆమె వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇక ఆమె బతకడం కష్టమని అందరూ అంటున్నారు. వెంటిలేటర్ మీద ఉన్నవారు బతకడం కష్టమా? అసలు వెంటిలేటర్ ఎందుకు అమర్చుతారు? ఒకవేళ ఆమె ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటే, ఇలా ఆమె ఇంకెన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండాల్సి ఉంటుంది?
 - దయాకర్‌రావు, హైదరాబాద్

 వెంటిలేటర్‌పై పెట్టిన పేషెంట్ మళ్లీ క్షేమంగా తిరిగి రారు అని అనుకోవడం పూర్తిగా అపోహ మాత్రమే. వెంటిలేటర్‌పైకి వెళ్లిన పేషెంట్లు మళ్లీ కోలుకునే అవకాశాలే ఎక్కువ.
 వెంటిలేటర్ అంటే కృత్రిమశ్వాస. దీనిపై పెట్టాలంటే ముందుగా శ్వాసనాళంలోకి ఒక గొట్టాన్ని అమర్చి దాన్ని వెంటిలేటర్ పరికరం ట్యూబులతో కలుపుతారు. రోగి పరిస్థితి మరీ విషమంగా ఉంటే అనేర రకాల గొట్టాలను అమర్చాల్సి అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియను అనుసరించేప్పుడు శరీర సహజసిద్ధమైన రక్షణ విధానాన్ని అతిక్రమించినట్లు అవుతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ సోకకుండా రోగిని ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ అమర్చుతారు.

 ఇక మీ ప్రశ్నల్లో ఒకటైన వెంటిలేటర్ ఏ పరిస్థితుల్లో అమర్చుతారు అనే విషయానికి వస్తే... రోగి రక్తంలో ఆక్సిజన్ పాళ్లు చాలా తక్కువగా ఉన్నా, కార్బన్ డై ఆక్సైడ్ పాళ్లు ఎక్కువగా ఉన్నా, ఆయాసం ఎక్కువైనా, అపస్మారక స్థితిలో ఉన్నా, ఊపిరి సరిగా తీసుకోలేకపోతున్నా, ఊపిరి తీసుకోడానికి అవసరమయ్యే కండరాల పనితీరులో లోపం ఏర్పడి, అవి సరిగా పనిచేయలేకపోతున్నా వెంటిలేటర్‌ను అమర్చుతారు. అంతేగాక... శరీరంలోని కీలకమైన మిగతా అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఆ ప్రభావం శ్వాసవ్యవస్థపై పడినప్పుడు, ఊపిరితిత్తులకు న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ సోకి శ్వాస సరిగా తీసుకోలేకపోతున్నప్పుడు కూడా వెంటిలేటర్‌ను అమర్చుతారు. ఇక క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ప్రభావంతో ఉబ్బసం ఎక్కువైనప్పుడు అది సెప్సిస్‌కు దారి తీస్తుంది. అలాంటప్పుడు రోగికి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వెంటిలేటర్ అమర్చుతారు.

 ఇక మీ అమ్మగారిని ఎన్నాళ్లు వెంటిలేటర్‌పై అమర్చుతారనే ప్రశ్న విషయానికి వస్తే... ఆమెను ఏ కారణంపై వెంటిలేటర్‌పై ఉంచారో మీరు తెలియపరచలేదు. కాబట్టి ఆమె రోగ తీవ్రతను అనుసరించి, ఆమెను వెంటిలేటర్‌పై ఉంచుతారు.
 
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
 
పెరిగిన యూరిక్ యాసిడ్‌తో కీళ్లనొప్పి..!
 నా వయసు 25 ఏళ్లు. ఇంకా పెళ్లికాలేదు. గత మూడు నెలలుగా తీవ్రమైన మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నాను. ఒక డాక్టర్‌గారికి చూపిస్తే, ఆయన పరీక్షలు చేయించి, నా యూరిక్ యాసిడ్ పాళ్లు 6.8 ఎంజీ/డీఎల్ ఉన్నాయని చెప్పారు. పైగా నేను విసర్జనకు వెళ్లినప్పుడు కూడా మూత్రం నుంచి దుర్వాసన వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
 - తేజస్విని, ఈ-మెయిల్

మీరు చెబుతున్న వివరాలను బట్టి చూస్తే మీరు ‘గౌట్’ అనే కీళ్లవ్యాధితో బాధపడుతున్నారు. రెండు ఎముకల మధ్యభాగాల్లో (కీళ్లలో) రక్తంలోని యూరిక్ యాసిడ్ పాళ్లు పెరగడం వల్ల, అవి స్ఫటికాలుగా మారుతాయి. అలా స్ఫటికాల్లా (క్రిస్టల్స్) మారిన యూరిక్ యాసిడ్‌రాళ్లతో ఎముకల చివరలు ఒరుసుకుపోవడం వల్ల కీళ్లవాపు, కీళ్ల వద్ద తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా స్థూలకాయం (ఒబేసిటీ), ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, రెడ్‌మీట్, సీఫుడ్ వంటి మాంసాహారం తీసుకోవడడం, నిమ్మజాతి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వంటి కుటుంబచరిత్ర ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

ఇక కొంతమందిలో సాధారణంగానే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నా లక్షణాలు ఏవీ కనిపించకుండానే ‘గౌట్’ వ్యాధి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటివారికి చికిత్స అవసరం ఉండదు. కానీ కీళ్లలో నొప్పి, వాపు వంటి లక్షణాలు కనిపిస్తే చికిత్స అవసరమవుతుంది. మీరు వెంటనే మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి.
 
నా వయసు 24 ఏళ్లు. మార్కెంటింగ్ జాబ్‌లో ఉన్నాను. నా బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నా ఎడమ మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాంతో ఎలాంటి పనీ చేయలేకపోతున్నాను. దాన్ని కొద్దిపాటి ఒత్తిడితో వంచినప్పుడు క్లిక్‌మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. మాకు దగ్గర్లోని డాక్టర్‌కు చూపిస్తే ఎక్స్‌రే తీసి, బెణికినట్లు చెబుతున్నారు. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
 - కె. సందీప్, కోదాడ

మణికట్టు బెణికితే వచ్చే సమస్యలు సాధారణంగా కొద్దివారాలపాటు ఉంటాయి. అయితే మణికట్టులో 15 ఎముకలు ఉంటాయి. ఎన్నో లిగమెంట్లతో కూడిన  సంక్లిష్టమైన నిర్మాణమది. కొన్ని చిన్న ఎముకలు విరిగినట్లుగానే మనకు తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మనం మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం సాధారణ ఎక్స్‌రేలో తెలియపోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్‌రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లు సూచిస్తున్నాయి. లేదా మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా కావచ్చు. కాబట్టి ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్-రే పరీక్షలు చేయించుకోండి.
 
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
 
ఎండోమెట్రియాసిస్ సాధారణ సమస్యే!
నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. పెళ్లయి ఏడేళ్లు అవుతోంది. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటే ఇటీవలే డాక్టర్‌ను కలిశాను. డాక్టర్‌గారు నాకు ‘ఎండోమెట్రియాసిస్’ ఉందని నిర్ధారణ చేసి, లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేశారు. నాకు పిల్లలు పుట్టే అవకాశాల గురించి వివరించండి. అలాగే పీరియడ్స్ సమయంలో మళ్లీ నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయా?
 - ఒక సోదరి, హైదరాబాద్

మీలా ఎండోమెట్రియాసిస్ రావడం అన్నది చాలామంది మహిళల్లో కనిపించే చాలా సాధారణమైన విషయం. కొంతమందిలో ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స తర్వాత ఈ నొప్పి పూర్తిగా తగ్గుతుంది. ఇక కొంతమందిలో మళ్లీ రావచ్చు. నొప్పి తీవ్రత తక్కువగా ఉంటే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులతో అంటే... తేలికపాటి వ్యాయామాలు చేయడం, యోగా వంటి రిలాక్సేషన్ ప్రక్రియలతో పాటు చాలా తక్కువ మోతాదుల్లో నొప్పినివారణమాత్రలు వాడుతూ నొప్పిని నియంత్రణలో ఉంచవచ్చు. కానీ కొందరిలో నొప్పి తీవ్రత చాల ఎక్కువగా ఉంటుంది. అలాంటివారిలో మళ్లీ గర్భధారణను కోరుకోని వారికి హార్మోన్లలో మార్పులు తీసుకువచ్చే మందులను డాక్టర్లు సూచిస్తారు. నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే మాత్రం మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. అయితే దాదాపు 60 శాతం నుంచి 80 శాతం మందిలో మళ్లీ గర్భధారణ వచ్చేలాగే శస్త్రచికిత్స చేసి, నొప్పిని నియంత్రించవచ్చు. మీ లేఖను బట్టి మీరు గర్భధారణను కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మీరు గర్భధారణను కోరుకుంటుంటే మాత్రం ‘ఫెర్టిలిటీ ఇవాల్యుయేషన్’ (అంటే గర్భధారణకు అవకాశాలను పరీక్షించే కొన్ని రకాల పరీక్షలు) చేయించాల్సి ఉంటుంది.

మీరు రాసినదాన్ని బట్టి మీకు మినిమల్/మైల్డ్ ఎండోమెట్రియాసిస్ ఉండటం వల్ల లాపరోస్కోపిక్ చికిత్స జరిగినట్లు తెలిపారు. కాబట్టి కొన్ని రకాల మందులతో మీలో అండం విడుదల అయ్యేలా (ఒవ్యులేషన్)/ ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్‌సెమినేషన్) వంటి ప్రక్రియలతో గర్భధారణకు తగిన అవకాశాలే ఉన్నట్లుగా భావించవచ్చు. కాకపోతే తీవ్రమైన ఎండోమెట్రియాసిస్ (సివియర్ ఎండోమెట్రియాసిస్) కేసుల్లో మాత్రం ఐవీఎఫ్ వంటి ఆధునిక ప్రక్రియలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజుల్లో సంతానసాఫల్యానికి తగిన ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సంతాన సాఫల్య చికిత్స చేసే నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.
 
 

మరిన్ని వార్తలు