మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు...!

29 Jul, 2013 03:02 IST|Sakshi
మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు...!
అక్క అక్షత, తమ్ముడు రోహన్. 
 ఎవరు వీళ్లు?
 అక్క ఫ్యాషన్ డిజైనర్, తమ్ముడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.
 అంతేనా?
 ఇద్దరూ వేల కోట్ల సంపదకు వారసులు. 
 అలాగా!
 వీళ్లకి బర్త్‌డే పార్టీ అంటే ఏమిటో తెలీదు.
 చిత్రంగా ఉందే!
 పాకెట్ మనీ అడగడం అస్సలు తెలీదు. 
 అరె! ఖరీదైన షాపింగ్‌లు తెలీవు. 
 రియల్లీ?... ఇంకా ఏం తెలీదు?
 అమ్మానాన్నల మాట కాదనడం తెలీదు.
 అవునా... ఎవరా అమ్మానాన్నలు?
 సుధ, నారాయణమూర్తి.
 ఇన్ఫోసిస్సేనా?
 అవును వాళ్లే. ఏం పెంపకమండీ!
 పెంపకం కాదండీ పాఠం... ‘లాలిపాఠం’.
 
 మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు...!
 అక్షత: మేము సెలబ్రిటీ హోదాతో పెరగలేదు, టీనేజ్‌లో కూడా సాధారణమైన పిల్లల్లాగానే పెరిగాం. మా చిన్నప్పుడు నాన్న ఎప్పుడూ కంపెనీ పనుల టూర్లలోనే ఉండేవారు. అప్పటికి మాకసలు ఇన్ఫోసిస్ అనే పేరు కానీ సంస్థ వివరాలు కానీ తెలియవు. బహుశా 1999లో అనుకుంటాను... నాకు 18 ఏళ్లు వచ్చాక ఇన్ఫోసిస్ కంపెనీ నాస్‌డాక్(నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటోమేటెడ్ కొటేషన్స్, న్యూయార్క్‌లోని స్టాక్ ఎక్సేంజ్)లో లిస్ట్ అయింది. మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించడం మొదలైంది అప్పటి నుంచే. ఆ స్థితిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. కొన్నిసౌకర్యాలతోపాటు క్లిష్టతరమైన స్టేజ్ అనే చెప్పాలి.
 
 రోహన్: ఈ స్టేజ్‌లో నేను స్వాతంత్య్రాన్ని కోల్పోయాను. నేను బిషప్‌కాటన్ స్కూల్లో చదివేవాడిని. మొదట్లో స్కూల్ బస్, తర్వాత వ్యాన్, ఆటోరిక్షా... ఇలా ఎందులో వెళ్లినా ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లడం అలవాటైంది. న్యూస్ పేపర్లలో వార్తలు రావడం మొదలైన తర్వాత నా స్వాతంత్య్రం తగ్గిపోయింది. స్కూలుకి కారులో వెళ్లమనే ఒత్తిడి పెరిగింది. కొంతమంది టీచర్లు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించడం వంటి మార్పులు మొదలయ్యాయి.
 
 విదేశాల్లో చదువుకోవడం ఎవరి నిర్ణయం?
 అక్షత: నాకు ఇంజనీరింగ్ మీద ఆసక్తి లేదు. చరిత్ర, కళలు ఇష్టం. మన దేశంలో ఈ సబ్జెక్టుకి మంచి విద్యాసంస్థలున్నా కూడా నాకు అమెరికాలో కొన్ని విద్యాసంస్థల గురించి తెలిసి అక్కడే చదవాలనిపించింది. ఇందులో పేరెంట్స్ ఫలానా కోర్సు చేయమని కానీ, ఫలానా కాలేజ్‌లో చదవమని కానీ నిబంధనలు విధించలేదు. రోహన్ విషయంలోనూ అంతే.
 
 రోహన్: నాకు పెద్దగా దూరదృష్టి లేదు. అక్షత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది కాబట్టి నాకూ వెళ్దామనిపించింది. ఎప్పుడూ కంప్యూటర్ మీదనే గడిపేవాడిని. నాలుగవ తరగతి నుంచి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయడం నేర్చుకున్నాను. ఇందులోనే రీసెర్చ్ చేయాలనుకున్నాను. రీసెర్చ్‌కి ఫారిన్ యూనివర్శిటీలు బాగుంటాయనిపించి హార్వర్డ్‌కి వెళ్లాను.
 
 బాల్యంలో చాలా కోల్పోయాం అనిపిస్తున్న సందర్భాలు ఉన్నాయా?
 అక్షత: మేము మిస్సయింది బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని మాత్రమే. అమ్మానాన్నా ఎప్పుడూ పనులతో బిజీ. మా పుట్టినరోజు కోసం టైమ్ స్పెండ్ చేసే పరిస్థితి ఉండేది కాదు. పైగా పుట్టినరోజు వేడుక కోసం చేసే ఖర్చును అవసరమైన వాళ్లకు డొనేట్ చేయమనేవాళ్లు. మేమందరం కలిసి ఇన్ఫోసిస్ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకునే వాళ్లం. ఇన్ఫోసిస్ కేక్ కట్ చేయడానికి నేనూ, రోహన్ పోటీపడేవాళ్లం. ఇంతవరకు నేను సెలబ్రేట్ చేసుకున్నది నా పద్దెనిమిదవ పుట్టిన రోజునే, అది నేను యుఎస్ వెళ్లాల్సిన సందర్భం కావడం కాకతాళీయం. దానిని బర్త్‌డే పార్టీ అనడంకంటే గుడ్‌బై పార్టీ అనడమే కరెక్ట్.
 
 రోహన్: నేనింత వరకు అలా కూడా సెలబ్రేట్ చేసుకోలేదు.
 
 మీ పట్ల తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండేది?
 రోహన్: నాన్న కంపెనీ పనుల్లో ఎప్పుడూ టూర్లలో ఉండడంతో మా బాధ్యత పూర్తిగా అమ్మ ఒక్కతే చూసుకునేది. చిన్నప్పుడు నేను బ్రైట్ స్టూడెంట్‌ని కాదు. అయితే నా ఫ్రెండ్స్ క్లాస్‌లో టాపర్స్. పియర్‌ప్రెషర్‌తో వాళ్ల ముందు తగ్గకూడదని తప్పనిసరై చదివేవాడిని! టెన్త్ తర్వాత బేస్ ఇన్‌స్టిట్యూషన్‌లో చేరాను, నాకు ఐఐటి సీటు తెచ్చుకోవాలన్న కోరిక పెద్దగా లేదు, నా ఫ్రెండ్స్ చేరుతున్నారని చేరానంతే. ఇంతలో ఒకసారి ఐఐటి ఖరగ్‌పూర్‌లో చదువుతున్న ఫ్రెండ్‌తో ఆ క్యాంపస్‌కెళ్లాను. ఎందుకో నాకు ఐఐటి సూటవదనిపించింది. నాన్నతో చెప్తే ఆయన సింపుల్‌గా ‘ఓకే’ అన్నారు.
 
 ఇన్‌ఫోసిస్ ప్రభావం ఎలా ఉండేది? ఇంట్లో తరచు చర్చకు వచ్చేదా?
 అక్షత, రోహన్: మా దృష్టిలో ఇన్‌ఫోసిస్ మా కంపెనీ కాదు, తోబుట్టువు. అది బాగుండాలని కోరుకోవడం తప్ప లాభనష్టాల బేరీజులు ఉండవు. 
 
 ఫలానా వాళ్ల పిల్లలు అనే గుర్తింపుతో ఇబ్బంది పడిన సందర్భాలున్నాయా?
 రోహన్: నా పిహెచ్‌డి పూర్తయి ఇండియాకి వచ్చిన తర్వాత ఒకసారి... నా అధ్యయనం గురించి స్టూడెంట్స్‌కి లెక్చర్ ఇవ్వడానికి బిషప్ స్కూల్‌కెళ్లాను. నాకు మా స్కూల్‌తో పద్నాలుగేళ్ల అనుబంధం. మా క్లాస్ టీచర్ ఉన్న గదిలోకి వెళ్లగానే ఆమె పిల్లలకు నన్ను పరిచయం చేస్తూ... ‘వీళ్ల నాన్న పేరు వినే ఉంటారు...’ అని మొదలుపెట్టారు. ఆ స్కూల్‌కి నేను ఫలానా వాళ్లబ్బాయిగా వెళ్లలేదు. నా స్కూల్‌కి నేను ఓల్డ్ స్టూడెంట్‌ని. ఆ ట్యాగ్‌ను మర్చిపోయి నారాయణమూర్తి గారబ్బాయిగా పరిచయం కావడం ఏంటి అనిపించింది.
 
 అక్షత: నాకూ అలాంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. కానీ నా ఫీల్డ్ పూర్తిగా భిన్నం కావడంతో నా సర్కిల్‌లో ఫలానా వాళ్ల అమ్మాయి అనే పరిచయం కావల్సిన పరిస్థితి ఉండదు. రోహన్ ఐటిలో ఉండడంతో ప్రతి ఒక్కరూ అలాగే పరిచయం చేస్తుంటారు. 
 
 స్వతంత్ర భావాలు... నిర్దుష్టమైన అభిప్రాయాలు..!
 రోహన్: వారసత్వపు వ్యాపారాలు మనదేశంలో చాలానే ఉన్నాయి. ఏ స్కిల్స్ లేకుండా వారసత్వంగా వచ్చిన అవకాశమే హక్కుగా అందుకోవడం నాకిష్టం లేదు. కంపెనీకి నా సేవలను నా నైపుణ్యంతోనే ఇవ్వాలి, అలా వచ్చిన హక్కుతో ఏ స్థానాన్నయినా పొందాలి. ఇండిపెండెంట్‌గా నాకు నేనుగా ఆ స్థానాన్ని సంపాదించుకోవడమే నా లక్ష్యం.
 
 అక్షత: నేను చాలా సాధారణమైన అమ్మాయిని. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అమ్మానాన్నలను అడగాల్సిందే. రోహన్ ముందు నుంచి ఇండిపెండెంట్. మా అమ్మానాన్నలు బిజీగా ఉంటూ, ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకోకపోవడం కూడా తన ధోరణికి బాగా కలిసి వచ్చింది. నేను ఇప్పటికీ పేరెంట్స్‌తో మాట్లాడకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేను.
 
 అక్షత, రోహన్‌ల మాటలు విన్న వాళ్లకు నారాయణమూర్తి, సుధామూర్తి గర్వించదగిన తల్లిదండ్రులు అనిపిస్తుంది. అక్షత పెళ్లిలో రోహన్ మైసూర్ సంప్రదాయశైలి దుస్తులు ధరించి అతిథులను ఆహ్వానించిన తీరును ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. పెళ్లిలో అక్షత, సుధామూర్తి సింపుల్‌గా కనిపించారని మీడియా ప్రత్యేకంగా ప్రస్తావించింది. నారాయణమూర్తి జీవనశైలీ అంతే. మన దేశంలో నిద్రలేచి పూజాసంస్కారాలు పూర్తి చేసుకుని కన్నడ సంప్రదాయ వంటకాలతో బ్రేక్‌ఫాస్ట్ చేసి విమానమెక్కితే మధ్యాహ్న భోజనం ఏ పిజ్జానో బర్గరో తినాలి. అందుబాటులో ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మినహా ఆ రుచుల కోసం వెంపర్లాడకపోవడం ఆయన గొప్పదనం. వర్క్ ఈజ్ వర్షిప్ అనే తల్లిదండ్రుల పెంపకంలో పిల్లలు కూడా ఇంత ఒద్దిగ్గానే పెరుగుతారేమో!
 
 విలువలు నేర్చుకోవడంలో తల్లిదండ్రుల ప్రభావం?
 అక్షత: మేమెప్పుడూ ‘ఇంత డబ్బు ఉంది, ఆ డబ్బుతో మేము కావాలనుకున్న దేనినైనా సరే సాధ్యం చేసుకోవచ్చు’ అనుకోలేదు. మా అవసరాలకు తగినంత డబ్బు మాత్రమే మాకు అందుబాటులో ఉండేది. పుస్తకాలు, ఫీజుల అవసరాలు జరిగిపోతుండేవి. యుఎస్‌లో ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం చేసేదాన్ని కాదు. అక్కడ మన భోజనం చాలా ఖరీదు. మా అమ్మ డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండేదో నా సెకండ్‌క్లాస్‌లోనే అర్థమైంది. యానివర్సరీ ఫంక్షన్ కోసం బృందగానానికి ప్రత్యేకమైన డ్రస్ కొనాలన్నారు. ఇంటికి వచ్చి అమ్మతో చెప్పాను. అమ్మ ఓకే అన్నది కానీ నాకు ఎందుకో ఆమె మనస్ఫూర్తిగా అనలేదనిపించింది. అప్పుడు నాకు ప్రత్యేకంగా డ్రస్ కొని మరీ ఆ బృందగానంలో పాల్గొనాల్సిన అవసరం లేదనిపించింది.
 
 రోహన్: ఒకసారి ఐస్ క్యాండీ తిందామనిపించి, నా దగ్గర డబ్బుల్లేవని బెంగ కలిగింది. అది తెలిసిన తర్వాత అమ్మ వారానికి ఐదు రూపాయలిచ్చి, ఆ డబ్బుకి లెక్క చెప్పించుకునేది. ఇంతవరకు మేమెప్పుడూ డబ్బులో ఈదింది లేదు.
 
 రోహన్: యుఎస్‌లో ఎంబిఎ చదివాడు. 
 అక్షత: ఎంబిఎ చేశారు
 కోడలు: టీవీఎస్ మోటార్స్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీవేణుని వివాహం చేసుకున్నారు రోహన్.
 అల్లుడు: రిషి సూనక్ భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు.
 
 నాన్న తరచూ ‘అంతరాత్మ స్వచ్ఛంగా ఉంటే... అంతకు మించిన హాయి మరోటి ఉండదు’ అనేవారు. 
 - రోహన్
 
 నేను భగవద్గీత, మహాభారతం చదివాను, కానీ రోహన్ చదివినంత సీరియస్‌గా కాదు. తను సంస్కృతంతోపాటు చాలా కోర్సులు చేశాడు. ఫిలాసఫీ కూడా చదివాడు.
 - నారాయణమూర్తి
>
మరిన్ని వార్తలు