చూపున్న అంధుడు!

2 Jan, 2018 23:35 IST|Sakshi

చెట్టు నీడ 

ఒక పల్లెలో ఒక అంధుడు ఉండేవాడు. రాత్రిపూట చేతిలో లాంతరు లేకుండా బయటికి వచ్చేవాడు కాదు! లాంతరు వెలుగుతూ ఉండేది. చూసేవాళ్లకు అది వింతగా ఉండేది. వెలుగు ఉన్నా, లేకున్నా అంధుడు చూడలేడు కదా! మరి చేతిలో ఆ లాంతరు ఎందుకు ఉన్నట్లు?  ఓ రాత్రి ఆ అంధుడు ఎప్పటì లాగే చేత్తో వెలుగుతున్న లాంతరు పట్టుకుని నడుచుకుంటూ వెళుతున్నాడు. అది చూసి, దారినపోయేవారు కొందరు నవ్వుకున్నారు. ‘‘ఏం పెద్దాయనా! లాంతరు నీకు దారి చూపిస్తోందా? నువ్వు లాంతరుకు దారి చూపిస్తున్నావా?’’ అని అడిగాడు.  ఆ మాటకు అంధుడు బాధ పడలేదు. 

‘‘ఈ లాంతరు నా కోసం కాదు’’ అన్నాడు నవ్వుతూ.  ‘‘మరి ఎవరి కోసం’’ అన్నారు వాళ్లు. ‘‘మీలాంటి వాళ్ల కోసం’’ అన్నాడు అంధుడు.  వాళ్లకు కోపం వచ్చింది. ‘‘నీలా మాకు కళ్లు లేవనుకున్నావా? మాకెందుకు లాంతరు?’’ అని అడిగారు.  అంధుడు వాళ్లవైపు చూశాడు. ‘‘లాంతరు లేకపోతే చీకట్లో మీరు.. నేను అంధుడినన్న విషయం తెలుసుకోలేరు. నన్ను తోసుకుంటూ, తొక్కుకుంటూ వెళ్తారు’’ అని అన్నాడు. వాళ్లంతా ఒక్కక్షణం మౌనంగా ఉండిపోయారు. అంధుడికి క్షమాపణ చెప్పి ముందుకు కదిలారు. కంటికి కనిపించిన దాన్ని బట్టే మనం మాట్లాడతాం. రెండోవైపు నుంచి ఆలోచించం. దైవాన్ని కూడా మనం బయటి నుంచే చూసే ప్రయత్నం చేస్తాం. అలా కాదు. అంతర్యానం చేయాలి. అంధుడినైనా, భగవంతుడినైనా అంతర్వీక్షణ చేయాలి. అప్పుడు మాత్రమే నిజం సాక్షాత్కరిస్తుంది. 

మరిన్ని వార్తలు