నెమ్మదస్తుడు

3 Apr, 2018 00:13 IST|Sakshi

చెట్టు నీడ 

‘నీ అసలు రంగు ఇవ్వాళ తెలిసింది. అభమూ శుభమూ తెలియని ఆడపిల్లను మోసం చేస్తావా? ఈ సంతానానికి బాధ్యత ఎవరు వహించాలి?’ అని దూషించడం మొదలుపెట్టారు.

పాతకాలంలో ఒక ఊరిలో ఒకాయన ఉండేవాడు. నెమ్మదస్తుడు. భార్యాపిల్లలు లేరు. ఆయనంటే ఊరి జనానికి ఏదో తెలియని గౌరవం ఉండేది.ఒకరోజు పొద్దున్నే ఆయన ఇంటికి ఇరుగు పొరుగు హడావుడిగా వెళ్లారు. గుంపులోని ఒక యువతి చేతిలో రోజుల శిశువు ఉన్నాడు. వాళ్లు తలుపు దబదబా బాదారు. ఆయన ఏమైందో అర్థం కాక తలుపు తీసి, బయటికి వచ్చాడు. ‘నీ అసలు రంగు ఇవ్వాళ తెలిసింది. అభమూ శుభమూ తెలియని ఆడపిల్లను మోసం చేస్తావా? ఈ సంతానానికి బాధ్యత ఎవరు వహించాలి?’ అని దూషించడం మొదలుపెట్టారు. ఆయనేమీ మాట్లాడలేదు. ‘ఈ పాపకు తండ్రివి నువ్వే’ అని శిశువును గడపలో పడుకోబెట్టారు.పరిస్థితిని గ్రహించుకున్నట్టుగా, ‘అలాగా’ అని మాత్రం అనగలిగాడాయన.

ఆ రోజు నుంచీ పాపను ఆయనే పెంచడం మొదలుపెట్టాడు. ఏడాది గడిచింది. అప్పటికి నిజం బయటపడింది. ఆ యువతి ఊళ్లోని ఒకతణ్ని ప్రేమించింది. కానీ ఇంట్లో చెప్పే ధైర్యం లేదు. ఏడాది తర్వాత ప్రేమికులిద్దరిలోనూ తెగింపు వచ్చి, జరిగింది వెల్లడించారు. మళ్లీ తెల్లారి ఇరుగు పొరుగు ఆయన దగ్గరికి వెళ్లారు. నెమ్మదిగా తలుపు తట్టారు. ఆయన బయటికి వచ్చాడు. ‘అయ్యో, మా వల్ల పొరపాటు జరిగింది. మీ వ్యక్తిత్వం గ్రహించలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. పాపను మేము తీసుకెళ్లిపోతాం’ అన్నారు.మళ్లీ పరిస్థితిని గ్రహించినట్టుగా, ‘అలాగా’ అని మాత్రం అన్నాడాయన.

మరిన్ని వార్తలు