నాన్న వారసత్వం ఆయన కోరిక కలిస్తే... నేను

30 Sep, 2014 23:22 IST|Sakshi
నాన్న వారసత్వం ఆయన కోరిక కలిస్తే... నేను

స్వర వీణాపాణి... సంగీతసాహిత్యాలను పేరులోనే ఇముడ్చుకున్న సరస్వతీపుత్రుడు. తండ్రి కోరిక తనకు దివిటీగా మారి మార్గదర్శనం చేసిందంటారాయన. ఆ వెలుగులో పయనించి గమ్యాన్ని చేరిన సంగీతదర్శకులు స్వరవీణాపాణి అంతర్వీక్షణం.

మీరు ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు?
డిసెంబర్ ఒకటిన. గుంటూరు జిల్లా రావెలలో.
అమ్మానాన్నలు, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు...
లక్ష్మీ నరసింహశాస్త్రి, సీతా అన్నపూర్ణ. అన్నయ్య రామకృష్ణ, చెల్లెళ్లు పద్మ, శైలజ, వరలక్ష్మి. నేను సంగీతంలో నాన్న వారసత్వాన్ని కొనసాగించాను. అన్నయ్య ఎంఆర్‌ఓ, చెల్లెళ్లు అందరూ గృహిణులు.
మీ తొలి గురువు?
మా నాన్నగారే.
మీరు సినిమా రంగంలోకి రావడానికి స్ఫూర్తి...
అదీ నాన్నగారి ప్రోత్సాహంతోనే. ఆయన సంగీతకారుడిగా సినీరంగంలోకి ప్రవేశించాలని కొన్నాళ్లు మద్రాసులో ఉండి వెనక్కు వచ్చేశారు. ఆయన కోరిక, ప్రోత్సాహం వల్లనే నేను సినీరంగం లోకి వచ్చాను.
ఈ రంగంలోకి రాకపోయి ఉంటే...
లాయర్‌గా కొనసాగేవాడినేమో...
గాయకుడిగా మీ తొలి వేదిక...
గుంటూరులో ఆంజనేయస్వామి గుడి.
పాట నుంచి స్వరకర్తగా మారడానికి కారణం...
నాన్న మంచి కంపోజర్. ఆయన్ని అనుకరించాను.
త్రిపాత్రాభినయం అనవచ్చా?
పాట రాసి, స్వరపరిచి పాడడం... ఈ మూడూ అంతర్లీనంగా ఒకదానితో ఒకటి ముడివడిన పనులే. ఒక ప్రవాహంలా అలా జరిగిపోతుంటాయి
వీణాపాణి అని నామకరణం ఎవరు చేశారు?
తనికెళ్ల భరణిగారు వీణాపాణి అని పెట్టారు. జనార్దన మహర్షి దానికి ‘స్వర’ను జోడించారు. అలా, స్వరవీణాపాణినయ్యాను. నా అసలు పేరు  రమణమూర్తి... అది మా తాతయ్య పేరు.
మీ తొలి సంపాదన?
సుశీల గారి నుంచి అందుకున్నాను. ఆవిడ నిర్మాతగా, గాయనిగా రూపొందించిన ‘సత్యసాయి భక్తిమాల ప్రాజెక్టు’కి పని చేశాను.
సినిమాల్లో అవకాశాలు ఎలా అందిపుచ్చుకున్నారు?
సుశీలమ్మ చలవే. వాళ్ల ఇంట్లో ఓ గదిలో ఉండే వాడిని. నన్ను అమ్మలాగా అన్నం పెట్టి మద్రాసులో ప్రముఖులకు పరిచయం చేశారు. దాంతో నా సినిమా కష్టాలు తొలగిపోయాయి.
రమణమూర్తి వీణాపాణిగా మారిందెప్పుడు?
పాటల ఆల్బమ్‌లు ఓగేటి రమణమూర్తి పేరుతోనే వచ్చాయి. నా తొలి సినిమా ‘పట్టుకోండి చూద్దాం’ లో టైటిల్ వీణాపాణి.
మీకు ఏ టైటిల్ ఎక్కువ సంతోషం?
ఓగేటి పేరు నాకు పరవశం. సినిమా టైటిల్ నాన్నగారి కోరిక తీరిందనే పులకింత.  
కొడుకుగా తండ్రి రుణం తీర్చుకున్న భావన కలిగిందా?
ఎంత చేసినా, ఏం చేసినా ఆయన రుణం తీరదు.
మీ బలం, బలహీనతలు...
సంగీతం, సాహిత్యం.
గీత రచయితలు, గాయకులు, స్వరకర్తలకు సందేశం!
నమ్మిన సత్యం కోసం ప్రయాణాన్ని కొనసాగిస్తే గమ్యం చేరుతాం. ఒడుదొడుకులకు వెనుకడుగు వేయకూడదు. నిజంగా నమ్మాలి. నమ్మినట్లు నటిస్తే విజయం కూడా భ్రమింపచేస్తుంది.
దేవుడు ప్రత్యక్షమై వరం అడిగితే...
మంచి కుటుంబాన్ని, సంగీత సాహితీ సేవ చేసే అదృష్టాన్నిచ్చావు. ఎన్నిజన్మలైనా ఇలాగే కావాలని!
మీ కుటుంబం గురించి...
నా భార్య శ్రీలక్ష్మీనరస. ఇద్దరమ్మాయిలు సాయి లక్ష్మి, పూర్ణ స్వరమంజరి.
మీ ఆవిడ మీ మీద తరచూ చేసే ఆరోపణ...
మంచి దుస్తులు వేసుకోనని... మీ కోసం కూడా కొంత సమయం కేటాయించుకోండి... అని కోప్పడుతుంటుంది.
మీ విజయరహస్యం?
ప్రతి మగాడి విజయరహస్యం తల్లి, భార్య ఇద్దరూనూ. భార్యలో ఓ మూల తల్లి దాగి ఉంటుంది. అవసరమైనప్పుడు  హెచ్చరిస్తూనే, తల్లిలా ఆదరిస్తుంది.
మీరు ఇంతవరకు బయటపెట్టని కోరిక ఏదైనా ఉందా?
నా భార్యను ఎప్పుడూ సంతోషంగా ఉంచడం. నా భార్యతో కలిసి ఇంటర్వ్యూ ఇవ్వడం.

 - వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు