ఒక సంపూర్ణ మానవుడి జీవితం

29 Apr, 2019 00:41 IST|Sakshi

కొత్త బంగారం

‘అతనికి ఎవరూ లేరు, కానీ అవసరం అయినవన్నీ అతనికి ఉన్నాయి, అది చాలు.’ ఇవి రాబర్ట్‌ షీతేలర్, జర్మన్‌లో రాసిన ‘ఎ హోల్‌ లైఫ్‌’ పుస్తకంలో ప్రధాన పాత్ర అయిన ఆండ్రెయస్‌ ఎగర్‌ గురించిన మాటలు. 1902లో ఎగర్‌కు నాలుగేళ్ళు ఉన్నప్పుడు, ఆస్ట్రియన్‌ పర్వత గ్రామంలో ఉన్న రైతు అయిన బంధువు హ్యూబర్ట్‌ వద్దకి వస్తాడు. పిల్లాడిని రైతు తనింట్లో పెట్టుకునే ఒకే కారణం– పిల్లాడి మెడ చుట్టూ కట్టిన సంచీలో కొన్ని బ్యాంక్‌ నోట్లు ఉండటం. పిల్లాడి చేతినుండి పాలు తొణికినా, ప్రార్థనలో మాటలు తప్పు దొర్లినా హ్యూబర్ట్‌ చావబాదుతాడు. 8 ఏళ్ళ ఎగర్‌ తొడ ఎముక విరుగుతుంది. స్థానిక డాక్టర్‌ కూడా ఎముకను అతికించలేకపోవడంతో ఎగర్‌ కుంటివాడౌతాడు. అయితే పిల్లాడు శారీరకంగా బలవంతుడు. ఒకసారి సూప్‌ గిన్నె అతని చేతిలోనుండి పడిపోయినప్పుడు రైతు మళ్ళీ కొట్టడానికి సిద్ధపడతాడు. ‘నా మీద చెయ్యి పడిందంటే నిన్ను చంపేస్తాను’ అంటూ ఎగర్‌ బెదిరించిన తరువాత, అతను అబ్బాయిని ఇంటినుంచి పొమ్మంటాడు. అప్పటికి ఎగర్‌ వయస్సు 18.

లోయలో ఒక  కేబిల్‌ కారు కంపనీ మొదలవుతుంది. ఎగర్‌ దాన్లో కార్మికునిగా చేరతాడు. ‘అతను అవిటివాడు అయినప్పటికీ పనిమంతుడు. అత్యాశకు పోడు. మితభాషి. పొలాల్లో వేడినీ, అడవుల్లో చలినీ భరించగలడు. ఏ పనిచ్చినా– సణక్కుండా విశ్వాసపాత్రంగా చేస్తాడు.’ కొండల పక్కనున్న స్థలం కొనుక్కుంటాడు. కాయకష్టం చేసే మేరీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. అక్కడి పర్వతాలు మహోన్నతమైనవి. అయితే, హిమపాతాలను తప్పించుకోవడమే అసాధ్యం. ఒకరాత్రి పెద్ద శబ్దం విన్న ఎగర్‌ నిద్ర లేచి, ‘అది దేనికో సంకేతం అయుంటుంది. గోడల చుట్టూతా మృదువైన గుసగుస... చీకటి ఆకాశంలో పరిగెడుతున్న నల్లటి మబ్బులు. వాటి మధ్యలో వివర్ణమైన, ఆకారం కోల్పోయిన చంద్రుడు’ అన్న గమనింపుతో చూస్తే, గర్భవతైన భార్య చనిపోయి ఉంటుంది. కుంగిపోయిన ఎగర్, లోయ వదిలి రెండవ ప్రపంచ యుద్ధంలో చేరతాడు. రష్యన్లకి పట్టుబడి కౌకసస్‌ ప్రాంతంలో యుద్ధఖైదీగా ఎనిమిదేళ్ళు గడుపుతాడు.

తన పల్లెకి తిరిగొచ్చి, ఆ మధ్యకాలంలో చోటు చేసుకున్న ఆధునికతకు అలవాటు పడి టూరిస్ట్‌ గైడ్‌గా పని చేస్తాడు కొంత కాలం. తనింటికి మరెప్పుడూ వెళ్ళడు. ఒక స్కూల్‌ టీచర్‌తో పరిచయం అయ్యాక, ఇద్దరూ శృంగారం చేయలేకపోయి కించపడిన సంఘటనను అతి సున్నితంగా వర్ణిస్తారు షీతేలర్‌. ‘అతనికి దేవునిపై నమ్మకం ఉండి తీరాలనిపించదు. మరణమంటే భయపడడు. తనెక్కడినుండి వచ్చాడో గుర్తు చేసుకోడు. ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. అయితే, తన జీవితపు ఆ మధ్య సమయాలను అతను– హృదయపూర్వకమైన నవ్వుతోనూ, అమితాశ్చర్యంతోనూ చూసుకోగలడు.’ తన మరణానికి కొన్ని నెలల ముందు అతను బస్సు ప్రయాణం చేస్తాడు. ‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అని ఎవరో అడిగినప్పుడు, ‘తెలియదు.. అసలే మాత్రం తెలియదు’ అంటాడు. ఎంత సీదాసాదాగా జీవించాడో అలాగే మరణిస్తాడు. కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎగర్‌ తనపైన తాను జాలి పడడు. ‘గాయపు మచ్చలు సంవత్సరాల వంటివి. ఒకదాని తరువాత మరొకటి. ఒక మనిషి అలా ఎందుకుంటాడో అని తేల్చేది వాటన్నిటినీ కలిపితేనే... అందరికి లాగానే ఎగర్‌ ఉనికిని రూపొందించినవి కూడా ఐహిక సంఘటనలూ, వ్యక్తిగత సంబంధాలూ. అతను తన ఏకాంతంతోనే సంతుష్టి చెందినవాడు’ అంటారు రచయిత. కథనంలో ఆత్మీయత కనిపిస్తుంది. శైలి ఆకర్షిస్తుంది.149 పేజీల యీ నవలికను, పాన్‌ మెక్మిలన్‌ 2015లో ప్రచురించింది. ఛార్లెట్‌ కొలిన్స్‌ సూక్ష్మంగా అనువదించిన యీ పుస్తకం ‘ద మాన్‌ బుకర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ 2016’కు షార్ట్‌లిస్ట్‌ అయింది.  కృష్ణ వేణి
 

మరిన్ని వార్తలు