విశ్వానికి ఆదిశిల్పి పుట్టిన రోజు

15 Sep, 2019 00:57 IST|Sakshi

ఎవరిచే ఈ విశ్వమంతా సృష్టించబడిందో అతడే విశ్వకర్మ. ఆయన ఈ చరాచర సృష్టి నిర్మాత. ఆదిశిల్పి. తొలి యజ్ఞకర్త. ఈ భూమినీ.. ఆ స్వర్గాన్నీ నిర్మించినవాడు. విశ్వకర్మ అనే పదం ముందుగా మనకు వినబడేది రుగ్వేదంలోనే. విశ్వకర్మ విశేష ప్రజ్ఞ కలవాడు. పుట్టిన ప్రతి ప్రాణికీ కావాల్సిన వాటిని అందించేది ఈయనే. అతడికి అన్నివైపులా చూసే కళ్లున్నాయి. అన్నివైపులా ముఖాలున్నాయి. అంతటా ప్రసరించే చేతులు, కాళ్లున్నాయి. ఈ భూమినీ.. ఆ ఆకాశాన్ని సృష్టించింది ఈయనే. అందరికీ శుభాన్ని కలుగజేసేవాడు ఇతడేనని రుగ్వేదం పదోమండలంలో రెండు సూక్తాలలో విశ్వకర్మ విశిష్టత తెలుస్తుంది.

 తొలి హోత
యజుర్వేదంలో సముద్రస్వరూపుడిగా, ప్రవహించే నదులకు అధిపతిగా వసిష్ఠాది పంచ ఋషులలో ఒకడిగా, 33 మంది దేవతల్లో ప్రజాపతిగా, విశ్వానికి శుభం కలిగించే శంభువుగా, త్వష్టగా, దేవతలకు పురోహితుడిగా యజుర్వేదంలో కనిపిస్తే, సామవేదం విశ్వకర్మను వరుణుడితో, ఇంద్రుడితో సమానంగా చెబుతూ.. తన శక్తి, మహిమలతో భూమి ఆకాశాలను విస్తరించాడనీ, సూర్యుణ్ణి ప్రకాశవంతుడిగా చేసిన దేవుడనీ, సర్వకార్య సమర్ధుడని, విశ్వరూపి యజ్ఞంలో తనను తాను సమర్పించుకున్నాడని, వెలుగు చీకటిని పటాపంచలు చేసినట్లు.. ఇతడు సకల శత్రువులనూ నాశనం చేస్తాడని చెబుతుంది.

సకల ప్రాణదేవుడు
ఉత్తరదిక్కు నుంచి వచ్చే ఆపదలను కాపాడే దేవుడనీ, ప్రజాపాలకుడనీ, సకలప్రాణులలో ఉండే ప్రాణదేవుడనీ, లోకంలో సత్యాన్ని పాలించే ఋతధర్మ ప్రవర్తకుడని అధర్వవేదంలోని కొన్ని సూక్తాలు వివరించాయి.

అందరి అంతరాత్మ
విశ్వకర్మను ఉపాసిస్తే ఆత్మబుద్ధి ప్రకాశిస్తుందనీ, ఇతడు సకల జీవుల హృదయాల్లో నివసిస్తాడనీ, ఇతడిని మనస్సుతో తెలుసుకుంటే అమృతత్త్వాన్ని పొందవచ్చని శ్వేతాశ్వతరోపనిషత్తు చెబుతుంది. ఈ విశ్వమయుడికి ఆకాశమే శిరస్సు. సూర్యచంద్రులే కళ్లు. దిక్కులే చెవులు. వేదమే వాక్కు. వాయువే ప్రాణం. విశ్వమే హృదయం. భూమియే పాదం. ఈ విశ్వకర్మే అందరి అంతరాత్మ అని ముండకోపనిషత్తు, వాస్తుసూత్రోపనిషత్‌ తెలిపాయి.

 దేవశిల్పి
దివిలో, భువిలో, అంతరిక్షంలో, పాతాళంలో, అంతటా ఏ చిన్న శిల్పం కనిపించినా అది విశ్వకర్మ నిర్మితమేనని  వాయుపురాణం చెప్తుంది. వేదకాలం నాటి విశ్వకర్మ సకల జగన్నిర్మాతగా కనిపిస్తే పురాణాలలో దేవతలకు కావాల్సిన నగరాలను నిర్మించినట్టు కనిపిస్తుంది.  ఇంద్రుడికి అమరావతిని, ఇంద్రప్రస్థపురాన్ని నిర్మించి  ఇస్తే, కుబేరుడి కోసం లంకానగరం, పుష్పక విమానం, కృష్ణుడికోసం సముద్రం మధ్యలో ద్వారకానగరం, త్రిపురాసురసంహారంలో శివుడి కోసం దివ్య రథాన్ని, కురుచక్రవర్తులకు హస్తినాపురాన్నీ, సూర్యుడిని తరిణెపట్టి ఆ రజును(పొడి)తో విష్ణువుకు సుదర్శనచక్రాన్ని, శివుడికి త్రిశూలాన్ని ఇచ్చిన విషయాలు సుప్రసిద్ధం.

రూపం – పంచముఖుడు
వేదాలలో నిర్గుణ పరబ్రహ్మగా కీర్తించబడిన ఈయన పురాణాల్లో సాకారంగా దర్శనమిస్తాడు. ఐదు తలలు, పది చేతులు, ప్రతి ముఖానికి మూడు కళ్లు, తలపై జటామకుటంతో, శరీరమంతా బంగారపు కాంతితో వెలిగిపోయే విశ్వకర్మ స్వరూపాన్ని స్కాందపురాణం నాగరఖండం వివరించింది. పద్మపురాణం కూడా ఇదే రూపాన్ని వర్ణిస్తూ విశ్వకర్మ చుట్టూ పంచబ్రహ్మలు, పంచశిల్పర్షులు, సకల దేవతలు, సప్తర్షులు నిలిచి ఆయనను సేవిస్తుంటారనీ, పద్మపురాణం స్కందోత్పత్తిప్రకరణం తెలుపుతుంది. విశ్వకర్మ రూపం పొడవైన తెల్లటి గడ్డం, వృద్ధరూపంతో మనకు చాలా చోట్ల దర్శనమిస్తుంది. నిజానికి దేవతలు నిత్యయవ్వనులు కనుక వారికి వార్థక్యం ఉండదు. హేమాద్రి దానఖండం, దేవతామూర్తి ప్రకరణం, రూపమండనం గ్రంథాల్లో ఒకే ముఖంతో రెండు లేక నాలుగు చేతులతో, శ్రీతత్త్వనిధి గ్రంథంలో నాలుగు ముఖాలతో, నాలుగు చేతులతో విశ్వకర్మ దర్శనమిస్తాడు.

సర్వదేవతాత్మకుడు
తన అత్యద్భుత శిల్పకళా చాతుర్యంతో సకలలోకాలను సృష్టించిన విశ్వకర్మ తానే అన్నింటిలో వ్యాపించి ఉన్నాడు. సకలలోకాలకూ అధిపతి కనుక ఇతడు ఇంద్రుడనే పేరు పొందాడు. కర్మఫలం అనుభవించే మనల్ని మంచి మార్గంలోనడిపిస్తాడు కనుక ఇతడే అగ్ని అనీ, స్వయంగా ప్రకాశిస్తూ ఇతరలోకాలను ప్రకాశింపజేయడం వలన ఇతడే ఆదిత్యుడనీ, అంతటా వ్యాపించి ఉండటం వలన విష్ణువనీ, పరమపదాన్ని అనుగ్రహించే రుద్రుడనీ ఇలా పలుచోట్ల పలుపేర్లతో విశ్వకర్మ సర్వదేవతాత్మకుడిగా దర్శనమిస్తాడు.

సకలదేవతార్చితుడు
పద్మపురాణం భూఖండంలో పార్వతీపరమేశ్వరులకు విశ్వకర్మ ఒక భవనం నిర్మించి ఇచ్చినట్లు ఉంది. విష్ణువు వింటినారిపై తలపెట్టి పడుకున్నప్పుడు కుమ్మరి పురుగు తొలిచి తల తెగిపడటంతో గంధర్వుడి శిరస్సు ఖండించి విష్ణువు మొండానికి అతికించి అతడిని హయగ్రీవుడిని చేసింది విశ్వకర్మే. బ్రహ్మహత్యాపాతకంతో బాధపడుతున్న ఇంద్రుడు విశ్వకర్మ యజ్ఞం ఆచరించి తన పాతకాన్ని పోగొట్టుకొన్న విషయం భాగవతంలో కనబడుతుంది. రాముడు లంకానగరానికి సేతువు నిర్మించే సమయంలో విశ్వకర్మను పూజించి నలనీలాదిగా గల వానరుల సహాయంతో సేతునిర్మాణం చేపట్టాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తనకు కర్ణకుండలాలు, జందెం, వస్త్రం మొదలైనవి కావాలని, అవి లేకుండా తాను బయటకు రానని చెప్పిన వాయునందనుడి కోరికను గర్భంలోనే తీర్చాడు విశ్వకర్మ. తన కుమార్తెను సూర్యుడికిచ్చివివాహం చేసిన విశ్వకర్మ, సూర్యుని వేడికి తాళలేని తన కుమార్తె కోసం సూర్యుడిని తరిణె బట్టి అతడి వేడిని తగ్గించాడని ప్రతీతి.

విశ్వకర్మ పూజ వలన ఏం ఫలితం?
ఇంతటి విశిష్టుడైన విశ్వకర్మను మనమంతా అర్చించడం మన విధి. భూమిపై నివసించే ప్రతి ఒక్కరూ తాము నివసిస్తున్న చోటు(వాస్తు)కు అధిపతి అయిన వాస్తోష్పతి ని పూజించాలని అన్ని సూత్రగ్రంథాలు తెలిపాయి. ఆ వాస్తోష్పతే విశ్వకర్మ. విశ్వకర్మ పూజ వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయని, లక్ష్మీప్రాప్తి కలుగుతుందని, మేధస్సు పెరుగుతుందనీ, విద్యాబుద్ధులు లభిస్తాయనీ, సాంకేతిక జ్ఞానం పెంపొందుతుందనీ పద్మపురాణం చెబుతోంది.

విశ్వకర్మ జయంతి ఎలా చేయాలి?
కన్యాసంక్రమణాన్ని పురస్కరించుకుని విశ్వకర్మ జయంతిని జరుపుకోవడం మనకు సంప్రదాయంగా వస్తోంది. ప్రభావసు, యోగాసక్తల కుమారుడైన విశ్వకర్మ వసువు కన్యాసంక్రమణం నాడు జన్మించిన కారణంగా ఆరోజు జయంతి జరుపుతారనీ, సూర్యుడు ఆ రోజు విశ్వకర్మ రూపంలో దర్శనమిస్తాడు కనుక ఆరోజు జయంతి జరుపుతారనీ అంటారు. అయితే సకలదేవతలు, దైత్యులతోపాటు పితృదేవతలను సృష్టించింది విశ్వకర్మయే కనుక పెద్దలను స్మరించుకునే పితృపక్షాలైన ఈ సమయంలో తమ పెద్దల ఆశీస్సులకోసం, వంశవృద్ధి కోసం తండ్రుల కన్న తండ్రిని పూజించుకోవడం మనవిధి.

అందరూ ఆ రోజు నిత్యకృత్యాలు నెరవేర్చుకుని ఐదు ముఖాలతో ఉన్న విశ్వకర్మ ప్రతిమను లేక కలశాన్ని స్థాపించి షోడశోపచారాలతో పూజించి, ‘ఓం నమో విశ్వకర్మణే‘అనే అష్టాక్షరీ మహామంత్ర జపం చేసి, ఐదుగురు సంప్రదాయ శిల్పాచార్యులను విశ్వకర్మ స్వరూపంగా పూజించి, అన్న వస్త్ర తాంబూలాలతో వారిని సంతోషపెట్టాలి. ఈనాడు యజ్ఞం ఆచరించడం ద్వారా విశ్వకర్మను పూజించే సంప్రదాయం దేశమంతా ప్రబలంగా ఉంది. ఈ ఆచరణతో సమస్త మానవాళి సుఖసంతోషాలతో తులతూగుతారు. లోకకళ్యాణం, విశ్వశాంతి కలుగుతుంది.
– కందుకూరి వేంకట
గోవిందేశ్వరశర్మ, విశ్వకర్మాగమ పండితులు

మరిన్ని వార్తలు