పిండం ప్రతీకారం

17 Oct, 2016 22:41 IST|Sakshi
పిండం ప్రతీకారం

అమ్మ జుట్టు... నాన్న కళ్లు... అమ్మమ్మ రంగు... నాన మ్మ ముక్కు.. ఇవన్నీ వచ్చినప్పుడు అమ్మ కష్టం, నాన్న బాధ... అమ్మమ్మ అలజడి, నానమ్మ భయం ఇవన్నీ పిల్లలకు రావా? గర్భంలో ఉన్న బిడ్డకు అన్నీ తెలుస్తాయి.  బిడ్డ పుట్టి, పెద్దగా అయ్యాక కూడా, ఆ ఆలోచనలు సబ్ కాన్షియస్‌లో మిగిలిపోయి ఉంటాయి. జీవితాన్ని ఒక కప్పు టీలా చక్కగా ఆస్వాదిస్తున్నా కూడా ఎక్కడో అడుగునమిగిలిపోయిన టీ పొడిలా ఆ బాధలు, భయాలు బ్లాక్ స్పాట్స్‌లా మిగిలిపోతాయి. వాటిని కడిగేసుకుంటే జీవితం తుడిచిన అద్దంలా క్లీన్‌గా ఉంటుంది.

 

వర్షకు ఏదో కసి తీరినంత ఆనందంగా ఉంది. ముఖ్యంగా తల్లి మీద ప్రతీకారం తీర్చుకున్న భావన.  ఇవాళ తను పెళ్లి చేసుకుంది. ఎస్. రిజిస్టర్ ఆఫీసులో తనకు నచ్చినవాణ్ణి చేసుకుంది. ఎవరు ఏమనుకుంటే తనకేంటి? రిజిస్టర్ ఆఫీస్ నుంచి భర్తతో నేరుగా ఇంటికి చేరుకుంది. పట్టు బట్టలు, మెడలో దండలు, పక్కన కట్టుకున్నవాడు ఉన్న కూతురిని చూసిన తల్లిదండ్రులు సుజాత, శంకర్ షాకైపోయారు. వర్ష వారి ముందుకు వచ్చి అంది. ‘‘మీకు అభి నచ్చలేదు కదా! అందుకే రిజిస్టర్ ఆఫీసులో ఇప్పుడే పెళ్లి చేసుకొని వచ్చా.’’ నోట మాట రానట్టుగా అలాగే ఉండిపోయారు సుజాత, శంకర్. ‘‘ఇక నుంచి మీరు నా పీడ విరగడైందనుకుని హ్యాపీగా హాయిగా ఉండండి. మీకు కావాల్సింది అదేగా’’  భర్త చెయ్యి పట్టుకొని వెళ్లి పోయింది. మరునిమిషం నిల్చున్న చోటనే సుజాత కుప్పకూలిపోయింది. తేరుకున్న శంకర్ ఆమెను దగ్గర్లోనే ఉన్న ఆసుపత్రిలో చేర్చాడు. డాక్టర్ పరీక్షించి... ‘‘ఏదో విషయంలో విపరీతమైన టెన్షన్‌కు లోనైనట్టున్నారు. ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి’’ అన్నాడు.  ట్రీట్‌మెంట్ పూర్తయ్యాక ఇల్లు చేరుకున్నారు సుజాత, శంకర్.

 
ఏం పాపం చేశామని?

కూతురు చేసిన పనికే కాదు, ఇంటి నుంచి  వెళుతూ వెళుతూ గుండెల మీద తన్ని వెళ్లడం ఆ తల్లినీ తండ్రినీ బాధించేస్తోంది. ‘ఏమిటండీ ఇదీ... ఏ జన్మలో ఏం పాపం చేశాం. ఇలాంటిదాన్ని కూతురిగా ఇచ్చాడు ఆ దేవుడు. పుట్టిననాటి నుంచి మనల్ని ఏడిపిస్తూనే ఉంది. ఏదో ఒక ఆరోగ్య సమస్య. ఎన్ని హాస్పిటళ్లకు తిప్పాం. ఒక్కతే కూతురు అని కళ్లలో పెట్టుకొని కాపాడుతూ వచ్చాం కదండీ! ఇంకొకరు పుడితే దీన్ని సరిగ్గా పెంచలేమేమో అని ఇక పిల్లలే వద్దనుకున్నాం. అన్ని ఆశలూ దీని మీదే పెట్టుకుంటే చివరకు ఇలా చేసింది. మీరన్నట్టు అప్పుడే అబార్షన్ చేయించుకుని ఉంటే మనకు ఇప్పుడీ బాధ తప్పేది’ ఏడుస్తూనే ఉంది సుజాత. శంకర్‌కి సుజాతను ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. కూతురు మీద బెంగతో సుజాత ఆరోగ్యం మరింతగా క్షీణించింది. మంచం మీద నుంచి లేచే పరిస్థితి లేదు. రోజులు భారంగా గడుస్తున్నాయి.

కథ అడ్డం తిరిగింది
‘‘ఛీ.. ఛీ .. కథ అడ్డం తిరిగింది. నిన్ను చేసుకున్నాక మొదట మీ అమ్మా నాన్న ఒప్పుకోకున్నా తర్వాత సర్దుకుపోయి ఇంట్లోకి రానిస్తారనుకున్నా. నువ్వేమో వాళ్లతోనే తెగదెంపులు చేసుకొని వచ్చాశావు. పోయి పోయి నీలాంటి రోగిష్టిదాన్ని చేసుకుని అనుభవిస్తున్నాను. పో.. పోయి మీ నాన్నను అడిగి డబ్బులు తీసుకురా...’’  అభి మాటలకు మాటలకు నివ్వెరపోయింది వర్ష. ‘‘పెళ్లయి నెల కూడా కాలేదు. నీ నిజరూపం ఇదా..’’ నిలదీసింది వర్ష.  ‘‘అవును.. మీ బాబు బాగానే సంపాదించాడుగా. కూర్చొని తినచ్చు అనుకున్నా.  కానీ, ఇలా దరిద్రం వెంటాడుతుంది అనుకోలేదు’... అన్నాడు అభి. పదే పదే డబ్బు తీసుకురమ్మని వేధించడంతో భర్తతో రోజూ గొడవపడేది వర్ష. దీంతో ఈ ఇంట్లోనే ఉండనంటూ అతను ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ‘ఇప్పటి వరకు అమ్మనాన్నకే నా మీద ప్రేమ లేదనుకున్నా కానీ ఎవరికీ ప్రేమ లేదు...’ అని వెక్కి వెక్కి ఏడ్చింది.


చేయూత దొరికింది
రోజు రోజుకూ పూట గడవడం కష్టంగా మారింది వర్షకు. ఏదైనా ఉద్యోగం చేసుకుందామన్నా ఇప్పటికప్పుడు ఏ ఉద్యోగం చేయాలో తెలియలేదు. పుట్టుకతోనే వచ్చిన గుండెజబ్బు ఎప్పుడే ముప్పును తెచ్చిపెడుతోందోనని భయపెడుతోంది. దీనికి తోడు ఇరవై ఏళ్లుగా ఉన్న మైగ్రెయిన్ సమస్య మరింతగా బాధిస్తోంది. అనుకోకుండా ఓ రోజు మార్కెట్‌లో కలిసింది స్నేహితురాలు ఉష. ప్రస్తుతం తనున్న పరిస్థితులను దుఃఖాన్ని దిగమింగుకొని చెప్పింది. ఏదైనా ఉద్యోగం ఉంటే చూసి పుణ్యం కట్టుకోమని బతిమాలింది. తెలిసినవారి వద్ద అడిగి చెబుతానని, తప్పక సాయం చేస్తాననీ అంది ఉష. తానో చోట వర్క్‌షాప్‌కి వెళుతున్నాను అని చెబితే, ఒంటరిగా ఉన్న వర్ష తను కూడా వస్తానని వెంట వెళ్లింది.

 
పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపీ

అది గతజన్మల తాలూకు ప్రభావాలు (పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపీ) తెలిపే వర్క్‌షాప్. ప్రతి మనిషి సబ్‌కాన్షియస్ మైండ్‌లో జ్ఞాపకాలు ఉంటాయి. ధ్యాన స్థితిలో సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్లి అక్కడ ఉన్న జ్ఞాపకాలలో మార్పులు, చేర్పులు చేయవచ్చు. ఈ ధ్యాన ప్రక్రియ ఎలా ఉంటుందంటే మనిషిని సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా అతడు గతంలో జీవించి వచ్చిన దానినంతా తిరిగి అనుభవంలోకి తీసుకొచ్చేంత గాఢంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ ధ్యానప్రక్రియ గత జన్మల వరకూ వెళ్లవచ్చు. పాశ్చాత్య సమాజంలో ఈ ప్రక్రియను సాధన చేస్తున్న వైద్యులు, సైకియాట్రిస్టులు ఎందరో ఉన్నారు. దీని ద్వారా సత్ఫలితాలు పొందవచ్చనే కేస్‌స్టడీస్ కూడా ఉన్నాయి. ఇదంతా అక్కడి నిర్వాహకుల ద్వారా విని తన జీవితంలో ఎదురైన సమస్యలకు మూలం తెలుసుకోవాలనుకుంది వర్ష. ఆమె కోరిక మేరకు  ఆమెకు ధ్యాన ప్రక్రియ ద్వారా రిగ్రెషన్ థెరపీ ఇచ్చారు.

 
తొలగిన బ్లాక్!
తనిప్పుడు పిండం. అవును... ధ్యాన ప్రక్రియ ద్వారా వర్షను దాదాపు గర్భస్థ పిండం స్థితి వరకూ తీసుకువెళ్లారు. బల్ల మీద పడుకుని ధ్యానంలో ఉందన్న మాటేకాని అమ్మ కడుపులో పిండంలా ఉన్నప్పటి భావన తెలుస్తూ ఉంది. అక్కడ చీకటిగా ఉంది. తల్లి ఆందోళనగా ఉండటం.. ఆమెతో తండ్రి మాట్లాడుతూ ఉండటం తెలుస్తూ ఉంది.


‘‘ఏమండీ ఎలా ఇప్పుడు?’’ అంటోంది తల్లి. ‘‘అబార్షన్ చేయిద్దామా?’’ తండ్రి అంటున్నాడు. ‘‘అదే మంచిది, ఇప్పుడు ఈ బరువు మోయగలమా?!’’ తల్లి అంటోంది.పిండం ఉలిక్కిపడింది. ‘ఏమిటి... తనను తన తల్లి వద్దనుకుంటుందా? తండ్రి అందుకు సమ్మతిస్తున్నాడా? తను వీరికి అక్కర్లేదా?’ సరిగ్గా ఆ సందర్భంలోనే  పిండావస్థలో ఉన్న వర్ష మైండ్‌లో బ్లాక్ ఏర్పడింది. అంటే చేతనలో ఒక అగాధం. ఆ అగాధమే పుట్టినప్పటి నుంచి ఆమెకు తల్లి మీద వ్యతిరేకత పెంచింది. కాని ఇప్పుడు ఆ సందర్భాన్ని రీవిజిట్ చేస్తుంటే తల్లిదండ్రుల పరిస్థితి అర్థమయ్యింది.  ‘‘మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. నా ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఇప్పుడు కంటే పాపను సరిగ్గా చూసుకోగలమా’’ అని తల్లి అంటుంటే ‘‘అదే నేనూ అనుకుంటున్నాను. వ్యాపారం కోసం నేను వేరే చోటుకి వెళ్లాల్సి ఉంది. ఇబ్బంది పడతావని అబార్షన్ సంగతి ఎత్తాను’’ అంటున్నాడు తండ్రి. అన్ని ఇబ్బందుల్లో ఉన్నా తల్లిదండ్రులు తనకు జన్మనివ్వడానికే ఆఖరుకు సిద్ధపడ్డారన్న సంగతి అర్థమయ్యి వర్ష మనసు పశ్చాత్తాపంతో కరిగిపోయింది. తనని క్షమించమని మనస్ఫూర్తిగా తల్లినీ తండ్రినీ కన్నీళ్లతో వేడుకుంది. ఆమె మైండ్‌లో పడిన బ్లాక్ తొలిగిపోయింది.

 
విముక్తి

ఎప్పుడైతే తల్లిదండ్రుల పరిస్థితి అర్థమైందో వర్ష మనసులోని ద్వేషం అంతా కొట్టుకుపోయింది. తల్లి మీద ప్రతీకార భావన పోయింది. దాంతో ఎన్నో ఏళ్లుగా బాధిస్తున్న మైగ్రెయిన్ సమస్య నుంచి వర్ష విముక్తి పొందింది. మెల్లగా గుండె బలహీనత సమస్య కూడా తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత వర్ష ఉద్యోగం చేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడటానికి ప్రయత్నించింది. తల్లిదండ్రులు కూతురికి మనస్ఫూర్తిగా అండగా నిలిచారు.      

 

అబార్షన్లు ఎందుకు జరుగుతాయి?
డంలో చేతన ఎప్పుడు ప్రవేశిస్తుంది అనే విషయం మీద భిన్న అభిప్రాయాలున్నాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవంలోనూ ఈ ప్రస్తావన ఉంది. మొదటి మూడు నాలుగు నెలల్లో పిండంలో చేతన ఎప్పుడైనా ప్రవేశించవచ్చు. దానికన్నా ముందు బీజం గర్భంలోకి చేరినప్పుడే పైలోకాల నుంచి చేతన దానిని రిజర్వ్ చేసుకునే ప్రాసెస్‌లో ఉంటుంది. చేతన ఆ జన్మ వద్దనుకుంటే 2-3 నెలల్లో ఆ పిండాన్ని వదిలి వెళ్లిపోతుంది. కొందరు తల్లిదండ్రులు ఆ బిడ్డ వద్దనుకుని అబార్షన్ చేయించుకోవచ్చు. కొన్నిసార్లు తెలియకుండానే గర్భ విచ్ఛిత్తి కావచ్చు. తల్లిదండ్రులు తన రాకకు సిద్ధంగా లేరని చేతన గ్రహిస్తుంది. తొమ్మిది నెలల ప్రయాణంలో ప్రతి దశలోనూ పిండం తల్లిదండ్రుల మంచి-చెడు ప్రభావాలకు లోనవుతూనే ఉంటుంది.   - డా. న్యూటన్ కొండవీటి, లైఫ్ రీసెర్చ్ అకాడమీ,  హైదరాబాద్

 

గర్భంతో ఉన్నప్పుడు ఏం చేయాలి?
పిల్లలను సాకడంలో తల్లి - తండ్రి పాత్రలు ఎంత ముఖ్యమైనవో, వారి పుట్టుక విషయంలో తీసుకునే శ్రద్ధా అంతే ప్రధానమైనది అంటారు డా.థామస్ ఆర్ వెర్నీ. అమెరికన్ సైకాలజిస్ట్ అయిన థామస్ ‘సీక్రెట్ లైఫ్ ఆఫ్ ది అన్‌బార్న్ చైల్డ్’(ఇంకా పుట్టని పిల్లల జీవిత రహస్యాలు) అనే అంశం మీద పరిశోథనలు చేశారు. ఆయన ఏమంటారంటే...


గర్భంతో ఉన్నప్పుడు తల్లి శారీరక ఆరోగ్యంపైనే కాదు, ఆమె మానసిక ఆరోగ్యమూ బాగుండేలా ఇంటిల్లిపాదీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో గర్భిణి మనస్తత్వం అతి సున్నితంగా మారిపోతుంది. కనుక భర్త వేధింపులు అత్తింటి ఆరళ్లు.. ఉండరాదు. ఏ బాధ అయినా దాని తాలూకు భయాలన్నీ ‘ఇన్ ప్రింట్‌గా’ పిండంలో ప్రోగ్రామింగ్ అయిపోతాయి. తల్లి ఏదైనా కొత్త సృజనాత్మక అలవాటు మీద దృష్టిపెట్టాలి. అంటే, ఓ కొత్త భాష, పెయింటింగ్.. వంటివి ఏది నేర్చుకున్నా అది బిడ్డకు చేరిపోతుంది.    భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ప్రతీరోజూ ఆమె గర్భాన్ని స్పర్శిస్తూ ఉంటే లోపల ఉన్న బిడ్డకు ఒక రక్షణలో ఉన్నాననే భావన కలుగుతుంది. చైనాలో భర్త తన భార్య గర్భాన్ని రోజూ తప్పనిసరిగా స్పృశించాలి అనే నియమం ఉంది. ఇలా చేయడం వల్ల గర్భంలో శిశువు కదలికలు వేగంగా మారడం, తండ్రి రాకను పిండం పసిగట్టడం వంటివి గమనించారు.

 

పిల్లలు తల్లిదండ్రులను ఎందుకు ద్వేషిస్తారు?
తల్లి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి ద్వారా నేర్చుకున్న చక్రవ్యూహం విద్య వల్ల అభిమన్యుడు చరిత్రలో గొప్ప వీరుడిగా నిలిచిపోయాడు. కాని తల్లిదండ్రుల అసూయ ద్వేషాలు పిండరూపంలో పుణికిపుచ్చుకున్న దుర్యోధనుడు అతని సోదరులు చరిత్ర హీనులుగా మిగిలిపోయారు. పిల్లలు అకారణంగా తల్లిదండ్రులను ద్వేషించడం, అర్థం చేసుకోకపోవడం వంటి సమస్యలకు వారి పిండదశపై పడిన చెడు ప్రభావాలే కారణం అంటారు అమెరికన్ సైకాలజిస్ట్ ఎలిజబెత్ హార్లెట్. ‘పిండదశ-ప్రభావాలు’ పైన పరిశోధనలు జరిపిన ఈమె తల్లిదండ్రులు బిడ్డను ఏ విధంగా ఈ లోకంలోకి ఆహ్వానించాలో తెలియజేశారు. శిశువు ఈ లోకానికి వచ్చే సమయాన్ని మూడు భాగాలుగా విభజించారు. అవి.. 1. గర్భం దాల్చడం 2. తొమ్మిది నెలల సమయం 3. జనన సమయం. ఈ మూడు సమయాల్లోనూ తల్లిదండ్రులు రాబోయే సంతానం పట్ల సద్భావనతో ఉండాలి. అప్పుడే తల్లిదండ్రులు-పిల్లల మధ్య ఘర్షణ తక్కువ ఉంటుంది.

 

ప్రసవ సమయంలో శిశువు స్థితి
పూర్వకాలంలో పెద్దలు ఎంతో పవిత్రంగా బిడ్డను ఈ లోకంలోకి ఆహ్వానించడానికి జాగ్రత్తలు తీసుకునేవారు. కారణం.. ప్రసవ సమయంలో తల్లిలో ఆందోళన, విపరీతమైన నొప్పుల తాలూకు భయం ఉంటే ఆ భయం కూడా శిశువు మైండ్‌లో చేరిపోతుంది. కనుక జాగ్రత్త తీసుకునేవారు. ఇప్పుడు అవన్నీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘ప్రసవం ఎంత సహజంగా ఉండాలి?’ అనే అంశం మీద పరిశోధన చేసిన డాక్టర్ ఫ్రెడరిక్ లేబ్రియర్ అనే ఫ్రెంచ్ డాక్టర్ ఏమంటారంటే....   ప్రసవ సమయంలో మంద్రస్థాయి సంగీతం ఉండాలి. చుట్టూ తక్కువ కాంతి ఉండాలి.  సహజ ప్రసవాలకే తావు ఇవ్వాలి.  బిడ్డ బయటకు రాగానే చాలా వరకు వెంటనే బొడ్డు తాడును కట్ చేస్తారు. ఆ బొడ్డు తాడు ద్వారానే అప్పటివరకు శిశువుకు ఊపిరి అందుతుంది. అది కట్ చేయగానే షాక్‌కి గురవుతారు. దీంతో ఇక్కడ ఓ బ్లాక్ ఏర్పడుతుంది. అందుకే, శిశువు బయటి వాతావరణంలో కొన్ని ఊపిరులు తీసుకునేంతవరకు అంటే, కనీసం కొన్ని నిమిషాలైనా బొడ్డు తాడును కట్ చేయకుండా ఉంచాలి.  శిశువు ఏడవడంలేదని తలకిందులుగా చేసి బిడ్డను కొడతారు. ఇక్కడో భయం (బ్లాక్) ఏర్పడుతుంది.  ఇవన్నీ పుట్టబోయే, పుట్టిన శిశువుల్లో పొరలు పొరలుగా మైండ్‌లో చేరిపోయే భయాలు. తనను తాను రక్షించుకునేందుకు ఆ తర్వాత బిడ్డ తీసుకునే మార్గాలు తల్లిదండ్రులకు, సమాజానికి పెద్ద ప్రశ్నలా కనిపిస్తాయి. అందుకే, గర్భస్థ సమయాన్ని అత్యంత జాగ్రత్తగా పరిగణించాలి.

- నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు