ఎందుకు గౌరవించాలంటే...

5 Jun, 2014 23:08 IST|Sakshi
ఎందుకు గౌరవించాలంటే...

ఒక అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాని దాపులో ఒక తిత్తిరి పిట్ట, ఒక కోతి, ఒక ఏనుగు నివసిస్తూ ఉండేవి. ఒకరోజు ఆ మూడూ కలిసి ‘‘మనలో ఎవరు పెద్దో తెలుసుకుందాం. ఆ పెద్దని మిగిలిన రెండూ గౌరవిద్దాం. అది చెప్పినట్లు నడుచుకుందాం’’ అనుకున్నాయి.  
 
ముందుగా ఏనుగు, ‘‘మిత్రులారా... నాకు ఈ మర్రి చెట్టు చిన్నప్పటి నుంచే తెలుసు. ఇది చిన్న చెట్టుగా ఉన్నప్పుడు నేను దీనిని ఒరుకుంటూ పోయేదాన్ని’’ అంది.
 
‘‘అలాగా, నేనైతే దీని పక్కన కూర్చొని కొమ్మ చివర్లలోని ఇగుర్లను తినేదాన్ని, నాకు ఈ చెట్టు మరీ చిన్న మొక్కగా ఉన్నప్పటి నుంచే తెలుసు’’ అంది కోతి.
 
తిత్తిరి పిట్ట మౌనంగా ఉండిపోయింది. ‘‘ఏంటీ నువ్వేం మాట్లాడవు’’అన్నాయి ఏనుగు, కోతి.
 
అప్పుడా తిత్తిరి పిట్ట, ‘‘మిత్రులారా! ఈ అడవి చివర ఒక  మహా మర్రి ఉంది. నేను దాని పండును తిని, విత్తనాలను ఇక్కడ వదిలాను. ఆ విత్తనాల నుంచి వచ్చిందే మీరు చెబుతున్న మర్రిచెట్టు’’ అంది.
 
శరీర ఆకారం కంటే, ఎక్కువ అనుభవ జ్ఞానం ఉన్న అతిచిన్నదైన తిత్తిరిపిట్టే తమకంటే పెద్దదని కోతి, ఏనుగు అంగీకరించాయి. ఆ నాటి నుంచీ అవి ఆ పిట్టను గౌరవిస్తూ, నమస్కరిస్తూ, దాని సలహా మేరకు జీవించాయి - అని బుద్ధుడు ఈ కథను ముగించి, ‘‘వృద్ధుల్ని మనం ఇందుకే గౌరవించాలి. వారు మనకంటే ఎక్కువ జ్ఞానాన్ని అనుభవం ద్వారా పొంది ఉంటారు కాబట్టి’’ అని చెప్పాడు.
 
- బొర్రా గోవర్ధన్
 

మరిన్ని వార్తలు