వాయిదా వేయొద్దు..

2 May, 2014 22:12 IST|Sakshi
వాయిదా వేయొద్దు..

ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన.. పాట తరహాలోనే మనం చాలా విషయాలను వాయిదావేసేస్తుంటాం. ఆ తర్వాత  ఆఖరు నిమిషంలో ఆదరాబాదరాగా పరుగెడుతుంటాం. ఆర్థికపరమైన ప్లానింగ్ విషయాల్లో ఇలాంటి ధోరణి మరింతగా ఉంటుంది. దీనికి తోడు .. కొన్ని అంశాల్లో స్థిరమైన అభిప్రాయాన్ని పెట్టేసుకుని.. విపరీతమైన కాన్ఫిడెన్సుతో రావాల్సిన ప్రయోజనాలను కూడా పోగొట్టుకుంటూ ఉంటాం. అలాంటి కొన్ని అపోహలు.. వాటికి పరిష్కార మార్గాల సమాహారమే ఈ కథనం..
 
రిటైర్మెంట్ ప్లానింగ్ ఇప్పుడే ఎందుకు
 
పదవీ విరమణ తర్వాత ఆదాయం గణనీయంగా తగ్గి ఖర్చులు పెరుగుతుంటాయి. ఇందుకోసం కెరియర్ ప్రారంభం నుంచే ప్రణాళిక వేసుకుంటే అప్పుడు కంగారు పడనక్కర్లేదు. కానీ, రిటైర్మెంట్ ఎప్పుడో వస్తుంది.. ఇప్పట్నుంచి ప్లానింగ్ ఎందుకు అని మనలో చాలా మంది పక్కన పెడుతుంటారు. ఏడాదంతా ఆటల్లో గడిపేసి సరిగ్గా పరీక్షల ముందు రోజు పుస్తకం తీసినట్లుగా.. రేపో ఎల్లుండో రిటైర్ అవుతున్నామనగా అప్పుడు హడావుడి పడుతుంటారు. కానీ ఒక్కరోజులోనో లేదా అయిదేళ్లలోనో రిటైర్మెంట్ అవసరాలకు కావాల్సినంత డబ్బును సమకూర్చుకోవడం సాధ్యం కాదు కదా. కాబట్టి, పెరిగే ధరలు, వైద్యం ఖర్చు లు, పదవీ విరమణ చేసిన తర్వాత ఎదురయ్యే అనిశ్చితి పరిస్థితులను ధీమాగా ఎదుర్కొనేందుకు ఎంత ముందు నుంచి ప్రణాళిక వేసుకుంటే అంత మంచిది. ఇప్పటి లైఫ్‌స్టయిల్‌నే రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగించాలంటే ఎంత డబ్బు పోగు చేసుకోవాలన్నది లెక్కలు వేసుకుని, ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలి. దీన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేయకుండా ముందు నుంచే ప్రణాళిక వేసుకుంటే తప్ప నిశ్చింతగా రిటైర్మెంట్ సాధ్యం కాదు.
 
ఇప్పుడప్పుడే ఇన్వెస్ట్ చేయలేను
 
భవిష్యత్  అవసరాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా అంటే ఠక్కున సమాధానం చెప్పగలిగే వారు ఏ కొందరో ఉంటారు. మిగతా వారంతా ఇంటి ఖర్చులు, ఈఎంఐలు మొదలైన సమస్యల గురించి చెప్పుకొస్తారు. ఇవన్నీ తీరితే గానీ ఇన్వెస్ట్‌మెంట్ల వైపు చూడలేమంటారు. ఈలోగా సమయం కాస్తా గడిచిపోతుంది. అలా కాకుండా.. అవసరమైతే వినోదం, టూర్లు వంటి ఖర్చుల్లో కొంత కోత పెట్టుకునైనా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టడం మంచిది. ఎంత ఇన్వెస్ట్ చేశామన్నదాని కన్నా ఎంతో కొంతైనా దాచిపెట్టగలగడం మంచిదని గుర్తుంచుకోవాలి.
 
ఫిక్స్‌డ్ డిపాజిట్లు చాల్లే ..
 
సరే.. ఇన్వెస్ట్ చేయాలని బలంగా అనుకున్న తర్వాత మనం పెట్టుబడి అత్యంత సురక్షితంగా ఉండాలనే కోరుకుంటాం. షేర్లు వగైరా లాంటి రిస్కీ సాధనాల్లోకి వెడితే అసలుకే మోసం వస్తుందని... సురక్షితంగా ఉంటుందని ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు చూస్తుంటాం. ఈ జాగ్రత్తల్లో పడి పన్నులు పోగా ఎఫ్‌డీలపై ఎంత రాబడి వస్తుంది, పెరిగిపోతున్న ధరలను ఆ రాబడితో ఎదుర్కొనగలమా లేదా అన్నది అంతగా లెక్కలు కట్టుకోము. కాబట్టి, దీర్ఘకాలానికి సంబంధించిన ఎఫ్‌డీలనే నమ్ముకుని కూర్చోకుండా ఇతరత్రా ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలవైపు కూడా చూడాలి.
 
మ్యూచువల్ ఫండ్లలో డబ్బు పోతుంది
 
సర్వసాధారణంగా వినిపించే మరో విషయం ఇది. వాహనం నడపడం నేర్చుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు కింద పడిపోయామని నేర్చుకోవడమూ మానేయము.. నడపడమూ మానేయం. ఇదీ అలాంటిదే.  ఎందులో ఇన్వెస్ట్ చేసినా ఎంతో కొంత రిస్కు ఉంటుంది. దీర్ఘకాలిక అవసరాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు పరిస్థితులను బట్టి కొన్ని సార్లు పెట్టుబడుల విలువ హెచ్చుతగ్గులకు లోను కావొచ్చు. అంత మాత్రం చేత అసలు దాని జోలికే వెళ్లకూడదనుకుంటే అధిక రాబడులు వచ్చే అవకాశాలను కోల్పోవచ్చు. షేర్లలోనూ, డెట్ సాధనాల్లో .. ఈ రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ పథకాలూ ఉన్నాయి. మన రిస్కు సామర్థ్యం, లక్ష్యాన్ని చేరడానికి కావాల్సిన సమయం లాంటివి అంచనా వేసుకుని తగిన పథకాన్ని ఎంచుకోవాలి.
 
టర్మ్ ఇన్సూరెన్స్ దండగ వ్యవహారం..
 
పైసా పెట్టుబడి పెడుతున్నామంటే... దానిపై ఎంతో కొంత రావాలని ఆశిస్తాం. ఆఖరికి జీవిత బీమా విషయంలో కూడా అలాగే అనుకుంటాం. జీవితానికి భరోసా కల్పించే బీమా వేరు .. రాబడులు అందించే పెట్టుబడి సాధనాలు వేరు అన్న సంగతి మర్చిపోతుంటాం. రెండింటినీ ఒకే గాటన కట్టేసి బీమా కోసం కట్టే డబ్బు సైతం తిరిగిరావాల్సిందే అని భావిస్తాం. కానీ, బీమా ఫీచర్లతో రాబడులు కూడా అందించే ఇతర పాలసీలు కాస్త ఖరీదైనవిగా ఉంటాయి.  కట్టిన ప్రీమియం తిరిగి రాకపోయినా.. ఇతర పాలసీలతో పోలిస్తే టర్మ్ పాలసీలు అత్యంత తక్కువ ఖర్చుతో అత్యధిక రక్షణ కల్పిస్తాయని గుర్తెరగాలి.
 
నాకెవ్వరూ సలహాలివ్వక్కర్లేదు..
 
ఆర్థిక విషయాలకు సంబంధించి చాలా సందర్భాల్లో మనకు మనం ఇలా సర్ది చెప్పుకుంటూ ఉంటాం. డబ్బు విషయాలను మేనేజ్ చేసుకోవడం చాలా సులభమైన విషయం.. ఇందుకోసం ఫైనాన్షియల్ ప్లానర్ల సహాయమో లేదా మరొకరి సలహాలో అనవసరం అనుకుంటాం. ఏముందీ.. పన్నులు గట్రా చూసుకోవడం, పీఎఫ్, ఎఫ్‌డీలు మొదలైనవి చేసుకుంటే సరిపోతుందని భావిస్తాం. కానీ, ఆరోగ్య సమస్య వస్తే డాక్టరు దగ్గరికి, చట్టపరమైన సమస్యలు వస్తే లాయర్ల దగ్గరికి ఎలా వెళ్లక తప్పదో ఆర్థిక అంశాల విషయంలోనూ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
 
ఖర్చులను అదుపు చేసుకోగలం..
 
ప్రత్యేకంగా బడ్జెట్ వేసుకోనక్కర్లేదు.. ఖర్చులను అదుపు చేసుకునే సామర్ధ్యం మనకి ఉంది అను కుంటాం. అదే ఉద్దేశంతో క్రెడిట్ కార్డులనూ తీసుకుంటాం. అవసరమైనప్పుడే వాటిని వాడుతున్నామనీ సర్ది చెప్పుకుంటాం. కానీ అప్పు ఏదైనా అప్పే. క్రెడిట్ కార్డులతో రివార్డు పాయింట్లని కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. సరైన సమయానికి బిల్లు కట్టకపోతే కష్టమే. కాబట్టి సరైన బడ్జెట్ వేసుకుని, దానికి కట్టుబడి ఉంటేనే పురోగమించగలం.
 
ఎమర్జెన్సీకి వ్యక్తిగత రుణం..

అత్యవసర పరిస్థితి తలెత్తిందంటే అర్జెంటుగా పర్సనల్ లోన్ ఎక్కడ దొరుకుతుందా అని వెతికేస్తాం. కానీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా, బంగారం పైనా, బీమా పాలసీలపైనా, ప్రావిడెంట్ ఫండ్‌పైనా లోన్ తీసుకునే అవకాశం ఉందన్న సంగతి ఠక్కున గుర్తుకురాదు. ఇవి వ్యక్తిగత రుణాల కన్నా తక్కువ వడ్డీ రేటుకే లభిస్తాయి కూడా. అయితే, అత్యవసర పరిస్థితుల్లో రుణాల కోసం తిరగాల్సిన పరిస్థితి లేకుండా ముందునుంచే ఇలాంటి సందర్భాల కోసం కొంత అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
 
ఆఫీసు ఇచ్చే వైద్య బీమా చాలు..

ఉద్యోగం చేసే కంపెనీ ఎలాగూ వైద్య బీమా సదుపాయం కల్పిస్తోంది కాబట్టి.. వ్యక్తిగతంగా మరో పాలసీ తీసుకోవడం దండగ అనుకుంటాం. కానీ ఇది నిజంగా సరిపోతుందా అంటే కచ్చితంగా సరిపోదు. సదరు కంపెనీలో పనిచేసినంత కాలం మాత్రమే కవరేజి లభిస్తుంది. మరో కంపెనీకి మారినా, ఉద్యోగం మానేసినా ఆ కవరేజి పోయినట్లే. కాబట్టి, కంపెనీ మెడి క్లెయిమ్ పాలసీ ఇచ్చినప్పటికీ ముందునుంచి వ్యక్తిగతంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం మంచిది.
 

మరిన్ని వార్తలు