శివుడు శ్మశానవాసి అని ఎందుకంటారు?

20 May, 2018 01:54 IST|Sakshi

‘అరిష్టం శినోతి తనూకరోతి’ అరిష్టాలను తగ్గించేది శివం అని అర్థం. శ్మశానం అంటే ఎటువంటి భయాలు, ఆశలు, కోరికలు, కోపాలు, ఆందోళనలు, బంధాలు లేని ప్రదేశం. అక్కడున్న శరీరాలు ఎండకు, చలికి, వర్షానికి... ఇలా దేనికీ చలించవు. ఎవరు ప్రతి కర్మను (పనిని) కర్తవ్యంగా చేస్తారో, నిత్యం ప్రశాంతంగా ఉంటారో, సుఖ దుఃఖాలను సమానంగా చూస్తారో, ప్రతి విషయానికి ఆవేశ పడరో, అటువంటి వారి మనసులో శివుడుంటాడని అర్థం. భగవద్గీతలో కృష్ణుడు కూడా తనకు అలాంటి వారంటేనే ఇష్టం అని చెప్పాడు.

మనం ఆలోచిస్తే మనం ఆందోళన పడకపోతేనే అన్ని పనులు సక్రమంగా, అనుకున్న కాలానికన్నా ముందే, మరింత గొప్పగా పూర్తి చేయగలుగుతాం. అంతేకాదు ఎంతగొప్పవాడైనా, బీదవాడైనా, ఎంత తప్పించుకుందామన్నా ఆఖరున చేరేది స్మశానానికే. అలాగే ప్రతి జీవుడు(ఆత్మ) ఆఖరున ఏ పరమాత్మను చేరాలో, ఏ ప్రదేశాన్ని చేరడం శాశ్వతమో, ఎక్కడకు చేరిన తరువాత ఇక తిరిగి జన్మించడం ఉండదో, ఆ కైవల్యపదమే శివుడి నివాస స్థానం అని అర్థం. అందుకే శివుడు స్మశానవాసి అన్నారు. అంతేకాని శివుడు స్మశానంలో ఉంటాడు కనుక ఆయన్ను ఆరాధించకూడదని, శివాలయానికి వెళ్ళరాదని ఎక్కడ చెప్పలేదు...

మరిన్ని వార్తలు