వితంతు పింఛన్‌ కూడా ఇవ్వని ప్రభుత్వం

26 Mar, 2019 06:20 IST|Sakshi
తిరుపాల్‌రెడ్డి భార్య పద్మావతి, కుమార్తె తనూష, కుమారుడు శ్యాంసుందర్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి(ఫైల్‌ ఫొటో)

నివాళి

ఈ ఫోటోలో ఇద్దరు పిల్లలతో దిగాలుగా ఉన్న మహిళ పేరు పద్మావతి. వారిది అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామం. పద్మావతి భర్త, చీనీ(బత్తాయి) రైతు తిరుపాల్‌రెడ్డి అప్పుల భాదతో విష గుళికలు మింగి ఆత్మహత్యచేసుకోవడంతో ఈ కుటుంబం పరిస్థితి దీనంగా మారింది. చీనీ తోటను కాపాడుకోవడానికి నాలుగు బోర్లు వేసినా నీరు పడకపోవడంతో అప్పులపాలయ్యాడు. ఏడు ఎకరాల్లో పప్పుశనగ సాగు చేసినా పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో రూ.17 లక్షలకు అప్పు పెరిగిపోయింది. అప్పు తీర్చలేనన్న బాధతో 2018 అక్టోబర్‌ 6న తిరుపాల్‌రెడ్డి విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ రైతు కుటుంబం అనాథగా మారింది. రెవిన్యూ అధికారులు విచారణ చేసి రూ.17 లక్షలు అప్పు ఉన్నట్లు నిర్థారించారు. అయినా తిరుపాల్‌రెడ్డి కుటుంబానికి ఎటువంటి సహాయమూ అందలేదు. ప్రభుత్వం ద్వారా చిల్లి గవ్వ రాకపోవడంతో పాటు పద్మావతికి వితంతు పించన్‌ కూడా మంజూరు చేయలేదు. ‘ఆయన మమ్మల్ని వదిలి వెళ్లాడు. ఇద్దరు పిల్లలను ఎలా పోషించాలో అర్థం కావడం లేద’ని పద్మావతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కనీసం వితంతు పింఛన్‌ కూడా ఇవ్వకపోతే ఎలా అని ఆమె కన్నీటి పర్యంతమౌతోంది. ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు.  

– కాకనూరు హరినాథ్‌రెడ్డి, సాక్షి, పుట్లూరు, అనంతపురం జిల్లా

మరిన్ని వార్తలు