దీపాలతో 250 ఎంబీపీఎస్‌ ఇంటర్నెట్‌!

26 Jun, 2019 10:58 IST|Sakshi

లైట్లతోనే వైఫై! ఇది పాత విషయమే కావచ్చుగానీ.. ఏకంగా 250 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుందంటే మాత్రం విశేషమే. ఫిలిప్స్‌ లైటింగ్‌ కంపెనీ (ఇప్పుడు సిగ్నిఫై అని పిలుస్తున్నారు) మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన ట్రూలైఫై లైట్లతో ఇది సాధ్యమే. సాధారణంగా ఇంటర్నెట్‌ సమాచారం మొత్తం రేడియో తరంగాల రూపంలో మనకు అందుతూంటే.. ట్రూలైఫైలో మాత్రం కాంతి తరంగాలు ఉపయోగపడతాయి. కొన్నేళ్లుగా ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఈ నేపథ్యంలో సిగ్నిఫై ట్రూలైఫైను అందుబాటులోకి తెచ్చింది. రేడియో తరంగాల వాడకం నిషిద్ధమైన ఆసుపత్రులు, పారిశ్రామిక ప్రాంతాల్లోనూ దీన్ని వాడుకోవచ్చు.

వైఫై నెట్‌వర్క్‌పై ఉన్న భారాన్ని తగ్గించడంతోపాటు నెట్‌ వేగాన్ని గణనీయంగా పెంచేందుకు ట్రూలైఫైలో ప్రత్యేకమైన ఆప్టికల్‌ ట్రాన్స్‌రిసీవర్‌ను ఏర్పాటు చేశారు. అప్‌లోడింగ్‌ డౌన్‌లోడింగ్‌ రెండింటికీ 150 ఎంబీపీఎస్‌ వేగానిన ఇవ్వడం దీనికున్న ఇంకో ప్రత్యేకత. ఒక పాయింట్‌ నుంచి ఇంకో పాయింట్‌కు మాత్రమే సమాచార ప్రసారం జరగాలనుకున్నప్పుడు వేగం 250 ఎంబీపీఎస్‌ వరకూ ఉంటుంది. ఏఈఎస్‌ 128 బిట్‌ ఎన్‌క్రిప్షన్‌ వాడటం వల్ల సమాచారం భద్రంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. లైట్‌ వెలుగును తగ్గించినా, లేదా ఆఫ్‌ చేసినా లైఫై మాత్రం పనిచేస్తూనే ఉంటుందని కంపెనీ చెబుతోంది. లైఫైతో పనిచేసే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చేంతవరకూ ఒక యూఎస్‌బీని వాడటం ద్వారా లైఫైను వాడుకోవచ్చునని సిగ్నిఫై తెలిపింది.

మరిన్ని వార్తలు