తిట్టుకున్నా సరే... రాజీ పడను!

11 Mar, 2016 23:03 IST|Sakshi
తిట్టుకున్నా సరే... రాజీ పడను!

విధి, కావ్యాంజలి, ఉమ్మడి కుటుంబం, రాధాకళ్యాణం, ఆహ్వానం, దామిని... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సీరియళ్లే ఉన్నాయి శ్రీరామ్ ఖాతాలో. అయితే ఈ మధ్య ఆయన స్క్రీన్ మీద కనిపించడం లేదు. స్క్రీన్ వెనుక మాత్రం పెద్ద బాధ్యతనే నిర్వర్తిస్తున్నారు. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, వరూధినీ పరిణయం లాంటి హిట్ సీరియళ్ల నిర్మాతగా బిజీ బిజీగా ఉన్నారు. పలకరిస్తే ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం...
 
చాలా మంచి నటుడు మీరు. మరి నటనకు దూరంగా ఉంటే ప్రేక్షకులు మిమ్మల్ని మిస్సవ్వరా?

అదేం ఉండదు. ఎవరు కనిపిస్తే వాళ్లకే కనెక్టయిపోతారు ప్రేక్షకులు. శ్రీరామ్ అనే నటుడు ఉన్నాడన్న విషయం గుర్తుంటుందేమో కానీ, అతను ఏమైపోయాడు అని దిగులు పడేంతగా ఏమీ ఉండదు.
 
అసలు నిర్మాతగా ఎందుకు మారాలనిపించింది?
అదేమీ నా లక్ష్యం కాదు. అనుకోకుండా జరిగిందంతే. నా ఫ్రెండ్స్ కొందరిని దర్శకులుగా ప్రోత్సహించడం కోసం నేను నిర్మాతగా మారాను. ‘శైలు’ నా మొదటి సీరియల్. కొన్నాళ్లపాటు నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే నటించాను. కానీ నిర్మాత బాధ్యతలు చాలా పెద్దవి. వాటితో పాటు నటన అంటే కష్టమైపోయింది. క్వాలిటీ మిస్సవుతానేమోనని భయమేసింది. అందుకే కొన్నాళ్లు నటనకు దూరంగా ఉందామనుకున్నాను. ఓటమిలో ఉన్నప్పుడు విజయం కోసం కష్టపడతాం. కానీ విజయం సాధించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. ప్రస్తుతం నేను అదే చేస్తున్నా.

సీరియల్ నిర్మాణం అంటే చిన్న విషయం కాదు. ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?
ఏ కొత్త పని మొదలుపెట్టినా సవాళ్లనేవి ఉంటాయి. అప్పుడనేంటి... ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నాను. ముఖ్యంగా నటీనటుల విషయంలో సమస్య వస్తుంది. కొంతమంది ఉంటారు. కాస్తో కూస్తో పేరు రాగానే యాటిట్యూడ్ మారిపోతుంది. సీరియల్ సక్సెస్‌కి తామే కారణం అన్న భావనలోకి దిగిపోతారు. దాంతో  పనిమీద నిర్లక్ష్యం వస్తుంది. పర్‌ఫెక్షన్ తగ్గుతుంది. నేను చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. నేనూ నటుణ్నే కాబట్టి నటనలో పరిణతి ఎంత అవసరం అనేది చెబుతుంటాను. కొందరు వింటారు. కొందరు వినరు. అలాంటప్పుడు వాళ్లని మార్చాల్సి వస్తుంది. అలా చాలాసార్లు మార్చాను కూడా.
 
ఇలా చేస్తే ఎవరూ బాధపడరా?

పడతారు. కానీ నేనేం చేస్తాను? క్వాలిటీ ముఖ్యం కదా! ఈరోజు నేను నిర్మాతగా నిలబడ్డాను అంటే క్వాలిటీ విష యంలో రాజీపడకపోవడం వల్లే. ఐదేళ్లుగా జీ తెలుగుకి సీరియల్స్ చేస్తున్నాను. వాళ్లు నన్ను చాలా ప్రోత్సహిస్తారు. ఎందుకంటే శ్రీరామ్ సీరియల్ అంటే బాగుంటుంది, తను క్వాలిటీ మెయింటెయిన్ చేస్తాడు అన్న నమ్మకం ఉండటం వల్లే కదా! నేను ప్రతిక్షణం ప్రతి విషయాన్నీ చూసుకుంటాను. నటించి చూపిస్తాడు. ఒక్కోసారి డెరైక్ట్ చేసి చూపిస్తాను. స్క్రిప్ట్ రాసిన రోజులు కూడా ఉన్నాయి. ఇదంతా క్వాలిటీ కోసమే. నాకు కోపమెక్కువని, తిడతానని అంటారు. తిట్టుకుంటారు. అయినా రాజీపడను.
 
ఈ మధ్య సీరియళ్లు కూడా సినిమాల్లోలాగా పాటలు, ఫైట్లు, రొమాన్స్‌తో నిండిపోతున్నాయి. అవంత అవసరమా?
ప్రేక్షకులకు కొన్ని నచ్చుతాయి. వాటిని యాడ్ చేయడంలో తప్పు లేదు కదా!
 
కానీ సీరియళ్లు నెగిటివ్ ప్రభావం ఎక్కువ చూపిస్తాయన్న కామెంట్ ఉంది. దానికేమంటారు?
చూడటం మానేయమనండి. మేం కూడా తీయడం మానేస్తాం. ఓ సీన్ మధ్యలో ఆపితే తర్వాత ఏమవుతుందోనని ఆసక్తిగా తర్వాతి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తారు. వాళ్ల ఆసక్తిని బట్టే మేం సీరియల్స్ తీసేది. వాళ్లు చూడనిది మేం ఎందుకు తీస్తాం చెప్పండి!
 
డబ్బింగ్ సీరియల్స్ ఎక్కువవుతున్నాయి. పోటీ పెరుగుతోందా?

డబ్బింగ్ సీరియల్స్ మన సీరియల్స్‌కి ఎప్పుడూ పోటీ కాదు.
 
మరి వాటిని ఆపేయమని గొడవ ఎందుకు?
ఎందుకంటే... సీరియళ్ల మీద ఆధారపడి కొన్ని వేలమంది బతుకుతున్నారు. వాళ్లందరికీ పని లేకుండా పోతుందని. అంతేతప్ప అవి మనకు పోటీ అవుతాయని కాదు.
 
కానీ ఇన్ని సీరియళ్లు వస్తున్నాయి, జనం చూస్తున్నారు. అంటే మన దగ్గర లేనిదేదో వాళ్ల సీరియళ్లలో ఉందనేగా?
అదే నిజమైతే ఆ సీరియళ్లన్నీ హిట్టయ్యి ఉండేవి. కానీ అయ్యాయా? ఏవో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడానికి మనవాళ్లు డబ్బింగ్ సీరియళ్లని ఫిల్లర్స్‌లాగా వాడుకుంటున్నారు. అందుకే సూపర్ ప్రైమ్ టైమ్‌లో డబ్బింగ్ సీరియళ్లు ఉండవు. అన్నీ తెలుగు సీరియళ్లే ఉంటాయి. దాన్నిబట్టే తెలుస్తోంది కదా!
 
కానీ హిందీ సీరియళ్ల క్వాలిటీ మనవాటిలో ఉండదుగా?
వాళ్లది ఇంటర్నేషనల్ మార్కెట్. మనది రీజినల్ మార్కెట్. వాళ్లు ప్రపంచంలో ఎక్కడైనా వాటిని అనువదించి ప్రసారం చేసుకోగలరు. కానీ మన మార్కెట్ అంత విస్తరించలేదు. ఆ అవకాశం లేదు కూడా. కన్నడలో డబ్బింగ్ సంస్కృతే ఉండదు. వాళ్లు ఇష్టపడరు. అంటే మనం పక్క రాష్ట్రంలో కూడా మన సీరియల్‌ని మార్కెట్ చేయలేం. అందుకే మన బడ్జెట్ తక్కువ ఉంటుంది. ఆ బడ్జెట్‌కి సరిపడానే క్వాలిటీ ఉంటుంది. నిజానికి నేను  ఖర్చు ఎక్కువే పెడతాను. దాంతో కొందరు ఫ్రెండ్స్... ‘ఎందుకంత ఖర్చు పెడతావు, నువ్విది అలవాటు చేస్తే అందరికీ ఇబ్బంది’ అని నవ్వుతూనే అంంటుంటారు, నేను నవ్వుతూనే వింటాను. బట్ నో కాంప్రమైజ్.
 
సినిమా నిర్మాణం వైపు వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా?
 నాకో డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. దాన్ని సీరియల్‌గా తీయడం కుదరదు. సినిమాగానే తీయాలి. కాబట్టి బహుశా వెళ్తానేమో!
 
మళ్లీ శ్రీరామ్‌ని నటుడిగా చూసే అవకాశం లేదా?

అదేం లేదు. తప్పకుండా మళ్లీ నటిస్తాను. ఎందుకంటే నేను నటనను చాలా మిస్ అవుతున్నాను. అందుకు చాలా బాధపడుతున్నాను కూడా. అవకాశం దొరగ్గానే ఓ సర్‌ప్రయిజింగ్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తాను.
- సమీర నేలపూడి
 

మరిన్ని వార్తలు