స్టెంట్‌ వేయించుకున్న తర్వాత గుండెజబ్బు మళ్లీ వస్తుందా?

4 May, 2017 23:44 IST|Sakshi

కార్డియాలజీ కౌన్సెలింగ్‌

నా వయసు 56 ఏళ్లు. ఇదివరకు ఒకసారి గుండె రక్తనాళాల్లో ఒకచోట పూడిక ఏర్పడిందని నాకు స్టెంట్‌ వేశారు. ఇటీవల నాకు మళ్లీ అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తోంది. ‘ఇదివరకే స్టెంట్‌ వేయించుకున్నాను కదా, గుండెపోటు రాదులే’ అనుకొని కొంతకాలంపాటు ఛాతీనొప్పిని పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ సందేహం వస్తోంది. ఒకసారి స్టెంట్‌ వేయించుకున్న తర్వాత మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి.   
– రామ్మోహన్, కోదాడ

 ఒకసారి స్టెంట్‌ వేయించుకున్న తర్వాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రావని చాలామంది మీలాగే అపోహ పడుతుంటారు. కానీ అది నిజం కాదు. స్టెంట్‌ సహాయంతో అప్పటికి ఉన్న అవరోధాన్ని మాత్రమే తొలగిస్తారు. కానీ కొత్తగా, మరోచోట పూడికలు రాకుండా ఆ స్టెంట్‌ అడ్డుకోలేదు. ఒకసారి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి స్టెంట్‌ పెట్టిన తర్వాత... మళ్లీ పూడికలు రాకుండా ఉండాలంటే... వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీరు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులు నిర్ణయిస్తారు.

ఒకవేళ బైపాస్‌ అవసరం అని చెప్పినా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అత్యాధునిక వైద్యవిధానాలతో చిన్న కోతతోనే బైపాస్‌ చేయడమూ సాధ్యమే. మీరు మీ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. మందులతోనే నయం అయ్యే పరిస్థితి ఉంటే ఆపరేషన్‌ కూడా అవసరం ఉండదు. ఇక సాధ్యమైనంతవరకు మీరు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
– డాక్టర్‌ సుఖేష్‌ కుమార్‌ రెడ్డి, సీనియర్‌ కార్డియోథొరాసిక్‌ సర్జన్,
యశోద హాస్పిల్స్, సోమాజిగూడ, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు