యుద్ధంలో చివరి మనిషి

24 Jun, 2019 06:03 IST|Sakshi

కొత్త బంగారం

తూర్పు ఐరోపా. 1944. రెండవ ప్రపంచ యుద్ధపు ఆఖరి నెలలు. డచ్‌ నవలిక అయిన ‘యాన్‌ అన్‌టచ్డ్‌ హౌస్‌’లో– పేరు, నేపథ్యం ఉండని ఒక డచ్‌ సైనికుడే ప్రధాన పాత్రా, కథకుడూ. అతను తన పక్షపు భిన్నదేశాల సైనిక దళాలతో కలిసి, పేరుండని ప్రాంతం లో యుద్ధంలో పాల్గొంటూ నాలుగేళ్లు కావస్తుంది. జర్మన్లు అతన్ని అనేకసార్లు పట్టుకున్నా, ఎలాగో తప్పించుకోగలుగుతాడు. మురికి పట్టి, దిక్కుతోచకుండా, అలిసిపోయుంటాడు. 

ఆ ‘హొలాందర్‌’ సైనికుని పటాలం దారి తప్పినప్పుడు, అతను ఒంటరిగా ఒక ఊర్లో ఖాళీగా పడున్న విలాసవంతమైన ఇంట్లోకి ప్రవేశిస్తాడు. చుట్టుపక్కల ఆవహించిన భీతావహమైన వాతావరణం నుండి ఆ ఇల్లు అతనికి తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పుడు, ‘ఎంతో కాలానికి మొట్టమొదటిసారి ఒక నిజమైన ఇంటికి వచ్చాను,’ అనుకుంటాడు. ‘యుద్ధం జరగనే లేదు’ అనిపించడం మొదలవుతుంది.
అలసట వల్ల బయటి కాల్పులూ, పేలుళ్ళనీ మరచిపోయి, ఆ సంపన్నమైన ఇంట్లో స్నానం, భోజనం చేసి, బీరువాలో ఉన్న బట్టలు తొడుక్కుని వైన్‌ తాగి నిద్రపోతాడు. జర్మన్‌ సైన్యం తలుపు తడుతుంది. పట్టుబడకుండా బతికుండేందుకూ, తిరిగి యుద్ధానికి వెళ్ళకుండా తప్పించుకోడానికీ, తానే ఇంటి యజమానినైనట్టు నటిస్తూ, శత్రువులైన ఆ నాజీలకు ఇంట్లో చోటిస్తాడు. వారి కల్నల్‌ పలికే డాంబికాలను వింటాడు. 

ఆ తరువాత, అసలైన ఇంటి యజమాని తిరిగి వచ్చినప్పుడు, ‘యీ ఇల్లు, చుట్టూతా ఉన్న పచ్చగడ్డి ఉన్నంత కాలమూ, సమస్త లోకం మాయమైనప్పటికీ నాకెందుకు!’ అనుకుంటూ, తన సౌకర్యవంతమైన జీవితాన్ని వదలుకోవడం ఇష్టపడక, అతన్ని చంపేస్తాడు.  జర్మన్లు ఆ ఊరిమీద అధికారాన్ని మరొకసారి కోల్పోయినప్పుడు, తన మారువేషాన్ని వదిలి జయప్రదమైన ప్రజాసైనిక దళాలతో కలిసిపోతాడు. వారందరూ ఉద్రేకంతో ఆ ఇంటిని సర్వనాశనం చేస్తారు. జర్మన్‌ కల్నల్‌ను పియానో తీగతో కట్టి వేళ్ళాడదీసి, సైనికులను హత్య చేస్తారు.

కథకుడు తన వంతుగా ఒక చేతి బాంబును ఇంట్లోకి విసిరి, వినాశనాన్ని పూర్తి చేస్తాడు. ఆఖరిసారి ఆ ఇంటిని చూస్తూ, ‘ఇంతకాలమూ ఇది నటిస్తూ ఉండి, ఇప్పుడు మాత్రమే తన నిజ స్వరూపాన్ని చూపించుకుంది. నిజానికి ఇదెప్పుడూ బోలుగానే ఉంటూ, మధ్యభాగంలో కుళ్ళుతూ కంపు కుడుతున్న బిలమే’ అనుకుంటాడు. గతంలో యుద్ధ తాకిడికి గురవని ఆ ఇంటి కథ అలాగున ముగుస్తుంది.  

తన్ని తాను సమర్థించుకుంటూ, ‘యుద్ధాలు జరగకపోయినా కానీ మృత్యువు ఎవరినీ వదలదు. తేడా ఏముంది?’ అని ప్రశ్నిస్తాడు కథకుడు. అతనికి కారణాలు కానీ నైతికత కానీ అనవసరం. బతికుండటమే అత్యవసరం. బాధితులకీ, అపరాధులకీ మధ్యనుండే తేడా కనిపించదు. యుద్ధపు హింసాత్మక ప్రవర్తనలో– సభ్యత అనే ముసుగు జారినప్పుడు కలిగే తీవ్రమైన భయాన్ని, వణుకు పుట్టించేలా వర్ణిస్తారు డచ్‌ రచయిత విలియమ్‌ ఫ్రెడరిక్‌ హర్మన్స్‌ (1921–95). నూటా ఇరవై పేజీల యీ చిన్న పుస్తకం– మానవత్వానికుండే క్రూరత్వాన్ని కనబరుస్తుంది. విజేతలంటూ ఎవరూ ఉండని యుద్ధానికుండే అసంబద్ధత యొక్క నిస్తేజ చిత్రణ ఇది.

కేవలం ఒకే అధ్యాయంతో నడిచే నవలికలో– కథనం పరధ్యానంగా చెప్తున్నట్టుంటుంది. ఇంపైన శైలే అయినా భాషలో నిశ్శబ్దమైన కఠినత్వం కనబడుతుంది.1951లో ప్రచురించబడిన పుస్తకాన్ని డేవిడ్‌ కోమర్‌ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. పుష్కర్‌ ప్రెస్‌ దీన్ని 2018లో ప్రచురించింది. 

1939 సెప్టెంబర్‌ 1న నాజీ జర్మనీ– పోలండ్‌ మీద దాడి మొదలుపెట్టిన రోజే హర్మన్స్‌కు 18 ఏళ్ళొచ్చాయి. సంవత్సరంలోపే తన దేశమైన నెదర్లాండ్స్‌ కూడా పోలండ్‌ను అనుసరిస్తూ జర్మన్‌ ఆక్రమణ కిందకి రావడాన్ని చూశారాయన. అది ఇంచుమించుగా 1945లో యుద్ధం పూర్తయేవరకూ కొనసాగింది. హర్మన్స్‌ తొలిరాతలు ప్రపంచయుద్ధాన్నే ఇతివృత్తంగా చేసుకుని రాసినవి. ఆయన రాతలన్నీ జ్ఞానాత్మాక శూన్యవాదంపైనే ఆధారపడినవి అంటారు పండితులు. 
-కృష్ణ వేణి

మరిన్ని వార్తలు