‘చరిత’ నడవాలని..

2 Sep, 2016 23:23 IST|Sakshi
‘చరిత’ నడవాలని..

వజ్ర సంకల్పం
మనమంతా దేవుడు చేసిన మనుషులమే.. ఒక్కోసారి ఆ దేవుడు కూడా పనిభారం ఎక్కువయ్యో ఏమోగానీ కొందరిని కొన్ని లోపాలతో పుట్టిస్తుంటాడు. కవిత, వజ్రాచారి దంపతులకూ అలాంటి ఓ బిడ్డనే ప్రసాదించాడు. అన్నీ బాగానే ఇచ్చి.. నడిచేందుకు కాళ్లను మాత్రం సరిగా ఇవ్వలేదు. ఆ దంపతులకు ఆయన మీద చాలా నమ్మకం.. ఇవ్వాళ్ల కాకపోతే రేపు.. నా బిడ్డకు దేవుడు న్యాయం చేయకపోతాడా అని. ఆ నమ్మకంతోనే వజ్రాచారి గట్టి సంకల్పం చేసి,  ‘తన కూతురు కర్రసాయం లేకుండా కాళ్లతో నడవాలని... కర్రతోనే భారీ గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు ఓ తపస్సులా... ఇరవై రోజులుగా గణేశుడి తయారీలో లీనమైపోయాడు. ఈ తండ్రి కథ ఇది...
 
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లోని కావేరి నగర్‌లో నివాసం ఉంటున్న ఏలేటి వజ్రాచారి వడ్రంగి పనినే నమ్ముకుని దాంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వజ్రాచారి దంపతులకు ఇద్దరు బిడ్డలు ఒకేసారి పుట్టారు. చరిత, చార్మి అని పేర్లు పెట్టుకుని, ఇద్దరినీ అల్లారుముద్దుగా పెంచారు. రెండేళ్లదాకా అంతా ఆనందంగానే సాగింది. ఆ తర్వాత.. చార్మి బుడిబుడి అడుగులు వేస్తోంది.. నడుస్తోంది.. పరుగులూ పెడుతోంది. కానీ.. తన కన్న కొన్ని నిమిషాలు పెద్దదైన చరిత మాత్రం కనీసం నిల్చోలేక పోతోంది. ‘కొంచెం పెద్దగయితే నడుస్తుందిలే..’ అని సర్దిచెప్పుకున్నారు కానీ నాలుగేళ్లయినా చరిత నడవడం లేదు. మంచానికే పరిమితమైంది.
 
ఎన్ని ఆస్పత్రులో.. ఎన్ని గుళ్లో..

ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ ఇలా.. అన్ని పెద్దాసుపత్రులకూ తీసుకెళ్లారు. గుళ్లకు తిరిగారు. ఆమె నడవలేకపోవడానికి నరాల బలహీనత వంటి కొన్ని కారణాలున్నాయన్నారు డాక్టర్లు. చివరకు ఎవరో చెబితే, తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు చరిత కాళ్లకు ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత నుంచి కర్రసాయంతో నెమ్మదిగా నడుస్తోంది చరిత. శారీరకలోపం ఉన్నా.. తన బిడ్డ చదువులో వెనుకబడకూడదన్న తపనతో ఆమెను బడికి తీసుకెళ్లాడు వజ్రాచారి. ప్రస్తుతం పదమూడేళ్ల చరిత తమ వీధిలోనే ఉండే పాఠశాలలో సెవెంత్ క్లాస్ చదువుతోంది.
 
దేవుడు కరుణిస్తాడేమోనని..

కర్రల సాయం లేకుండా చరిత నడవాలంటే ప్రత్యక్ష దైవాలైన వైద్యుల పని పూర్తయింది. ఇక ఆ దైవానుగ్రహమే మిగిలిందని ఆ దేవుడికే ప్రాణప్రతిష్ట చేసేందుకు సిద్ధమయ్యాడు  వజ్రాచారి. ఇరవై రోజుల క్రితం నిర్మల్‌లోని మల్లన్నగుట్టపై గల హరిహరక్షేత్రంలో గణపతికి పూజ చేసి సంకల్పం తీసుకున్నాడు. ‘గణపయ్యా.. నా బిడ్డ కర్రలు లేకుండా నడవాలి. అందుకోసం కర్రతో నీ విగ్రహాన్ని తయారుచేస్తా..’ అని మొక్కుకున్నాడు. ఆరోజు నుంచి నిర్విరామంగా గణనాథుడి తయారీలో నిమగ్నమయ్యాడు వజ్రాచారి. బిడ్డ కోసం భర్త తీసుకున్న దీక్షకు భార్య కవిత, తమ్ముడు ప్రసాద్ కూడా తోడయ్యారు. పూర్తిగా టేకు కర్రతో.. ‘వజ్ర’ సంకల్పంతో తయారు చేసిన గణేశుడి విగ్రహాన్ని స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్దగల సంఘభవనంలో ప్రతిష్ఠిస్తామని తెలిపారు. ఇక.. ఆ దేవుడు కరుణించడమే మిగిలి ఉంది. ఆ ఆడబిడ్డపై గణనాథుడు కరుణ కురిపించాలని మనం కూడా మనసారా వేడుకుందాం.
- రాసం శ్రీధర్, నిర్మల్ రూరల్, ఆదిలాబాద్
 
నడిస్తే దీక్ష నెరవేరినట్లే..
దేవుడి కృపతో తాను అందరిలా నడుస్తుందన్న నమ్మకంతోనే గణపతి విగ్రహ తయారీ మొదలుపెట్టాను. ఇదే మొదటి విగ్రహమైనా మనసు నిండా స్వామిని నింపుకోవడం వల్లనేమో ఎలాంటి లోపం లేకుండా విగ్రహం తయారైంది. ఇక ఆ దేవుడు కరుణించి చరితను నడిపిస్తే.. నా దీక్ష నెరివేరినట్లే.
- ఏలేటి వజ్రాచారి, చరిత తండ్రి
 
నడకొస్తే అమ్మానాన్నలను బాగా చూసుకుంటా!
నా కోసం అమ్మానాన్నా ఇంతగా తపిస్తుండటం చూస్తుంటే వాళ్ల బిడ్డగా పుట్టడటమే నా అదృష్టం అనుకుంటాను. ఆ గణేశుని దయవల్ల నాన్న కోరిక నెరవేరి.. నాకు నడక వస్తే బాగా చదివి ఉద్యోగం సాధిస్తా. అమ్మానాన్నలను బాగా చూసుకుంటా.
- చరిత, ఏడో తరగతి

>
మరిన్ని వార్తలు