సంగీత చికిత్సతో...

12 Dec, 2016 14:54 IST|Sakshi
సంగీత చికిత్సతో...

సంగీత చికిత్స ద్వారా రాగాలతో రోగాలు తగ్గించడమనే ప్రక్రియ కోసం బాలమురళి ఎంతగానో శ్రమించారు. ఫలానా జబ్బుకు ఫలానా రాగంతో చికిత్స అని ఏమైనా కనిపెడితే, అది ప్రపంచంతో పంచుకోవచ్చని తపించారు. అందుకే

మ్యూజిక్ థెరపీ మీద ప్రయోగాలు చేశారు. ‘‘అవసరం వస్తే, తెలిసినవాళ్ళు నన్ను అడిగితే, సంగీత చికిత్స చేస్తాను. అయితే, ఫలానా అస్వస్థతకు ఫలానా రాగం పాడాలంటూ సాధారణీకరించి చెప్పలేం. అది సదరు రోగిని బట్టి, ఆ వ్యక్తి శారీరక, మానసిక స్థితిని బట్టి మారిపోతుంటుంది. అంతేతప్ప, ఫలానా రోగ లక్షణం ఉన్నవాళ్ళందరికీ ఫలానా రాగం పనికొస్తుందని చెప్పలేం. అయినా, వ్యాధి తగ్గాలంటూ చూపే అనురాగాన్ని మించిన రాగం (సంగీతం) ఏముంటుంది’’ అని నవ్వుతూ అనేవారు.

‘భారతరత్న’ ఎప్పుడో ఇవ్వాల్సింది!
‘‘గంభీరమైన, అద్భుతమైన మంచి బేస్ వాయిస్ బాలమురళి గారిది. సంక్లిష్టమైన కర్ణాటక శాస్త్రీయ సంగీతం పాడేటప్పుడు స్వరస్థానాల్ని అందంగా రూపొందించి, అంతే అందంగా, జనరంజకంగా పాడడం ఆయనలోని గొప్పతనం. అందుకే, ఒకే కీర్తనను కొన్ని వందల మంది పాడినా, బాలమురళి పాటే విలక్షణంగా ఉంటుంది. సాహిత్యానికి విలువనిస్తూ, సంగీతాన్ని సమన్వయం చేస్తూ పాడే దిట్ట ఆయన. పి.వి. నరసింహారావు గారి పేరిట ‘నృసింహ ప్రియ’ అనీ అప్పటికప్పుడు కొత్త రాగాన్ని కనిపెట్టి, పాడిన స్రష్ట ఆయన. అంత శాస్త్రీయ సంగీత మేధావి అయినా, సినిమా పాట దగ్గరకు వచ్చేసరికి, సినిమాకు తగ్గట్లు మలుచుకొని అద్భుతంగా పాడడం చూస్తాం. ఆయన పాడిన కీర్తనలున్న ‘రాగసుధా రసం’ అనే క్యాసెట్‌ను ఏడో తరగతిలో ఉండగా మా నాన్న గారు తెచ్చి ఇస్తే, విని నేర్చుకున్నా. అలా నేను ఆయనకు ఏకలవ్య శిష్యుణ్ణి. పెద్దయ్యాక చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో తొలిసారిగా ఆయనను స్వయంగా కలసినప్పుడు ‘కమలదళాయతాక్షీ...’ అనే ఆయన కీర్తన చిన్నప్పుడు విన్నది పాడితే చాలా సంతో షించారు. నా సినిమా సంగీతంలోని పాటలన్నీ ఆయనకు పాడి, వినిపిస్తే మెచ్చుకు న్నారు. ఒక్కమాటలో ఆయన సంగీత గని. రాగనిధి. సరస్వతీ పుత్రుడు. సాక్షాత్తూ సరస్వతీ అంశ. అలాంటి ఆయన ‘భారతరత్న’కు ఎప్పుడో సంపూర్ణంగా అర్హులు. ఆ అవార్డెప్పుడో ఇవ్వాల్సింది. కానీ, రకరకాల రాజకీయాలు, బ్యూరోక్రసీ వల్ల ఇవ్వకపోవడం చాలా దారుణం, బాధా కరం. మనిషి మరణించాక కీర్తిస్తే ఏం లాభం? బతికున్నప్పుడు గౌరవించకుండా!’’
- కె.ఎం రాధాకృష్ణన్, ‘ఆనంద్, గోదావరి’చిత్రాల సంగీత దర్శకుడు-శాస్త్రీయసంగీతజ్ఞుడు

త్యాగరాజస్వామి ప్రత్యక్ష శిష్యపరంపరలో నేను 5వ తరం వాణ్ణి... త్యాగరాజస్వామి, వారికి మానాంబుచావిడి (ఆకుమళ్ళ) వెంకట సుబ్బయ్య, ఆయనకు సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి, సుసర్లకు పారుపల్లి రామకృష్ణయ్య, ఆయనకు నేను... ఇలా! గానమే కాకుండా అనేక వాద్యాల మీద నాకు పట్టు మొదలైంది ద్వారం  వయొలిన్ కచ్చేరీతో! ఆయన వాయిస్తుంటే విని విని, చూసి చూసి, చటుక్కున వయొలిన్ తీసి వాయించడం మొదలు పెట్టాను. తర్వాత వయోలా, మృదంగం, కంజీరా, వీణ ఇలా... చాలానే!  నేను పాడిన తెలుగు సినిమా పాటల్లో నాకిష్టమైనవి... ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు..’ (ఉయ్యాల - జంపాల), ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా...’ (గుప్పెడు మనసు), ‘పాడనా వాణి కల్యాణిగా...’ (మేఘసందేశం), ‘నర్తనశాల’లోని ‘సలలిత రాగ సుధారస సారం’  వగైరా!

సంగీతానికి నేనిచ్చే నిర్వచనం... లైఫ్! సంగీతం అంటే ప్రాణం, జీవం. అదే మనిషి జీవితం. అంతేతప్ప, సంగీతం అంటే ఏవో నాలుగైదు కీర్తనలు పాడడం కాదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొనే మాటల్లో కూడా సంగీతం ఉంటుంది. ఆ సంగీతం సరిగ్గా కుదరకపోతే, ఒకరు మాట్లాడేది మరొకరికి అర్థం కాదు. ఆ సంగీతం సమశ్రుతిలో ఉంటే, అదే బ్రహ్మానందం!

- ‘సాక్షి’తో మంగళంపల్లి బాలమురళీకృష్ణ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు