ఏకాంత ప్రార్థనా జీవితంతో విజయం

18 Jun, 2016 22:44 IST|Sakshi
ఏకాంత ప్రార్థనా జీవితంతో విజయం

సువార్త

 

పాలరాయి భవానికి అందాన్నిస్తుందేమో కానీ పటిష్టత మాత్రం అగోచరమైన, అందవిహీనమైన పునాది రాళ్లతోనే వస్తుంది. పునాది మారదు, మాట్లాడదు, మిడిసిపడదు, కదలదు, కనిపించదు. అందంలాంటి తేలికపాటి బాహ్యాంశం పునాదికి పట్టదు. అందువల్ల తననెవరూ పట్టించుకోకున్నా నొచ్చుకోదు. పునాది జీవితం, భాష కూడా పటుత్వమే, దృఢత్వమే!

 
అప్పుడే ఆరంభమైన ఏలియా ప్రవక్త పరిచర్యకు పునాది లాంటి ఆజ్ఞను దేవుడిచ్చాడు. కెరీతు వాగు దగ్గర కొన్నాళ్లు దాగి ఉండమని దేవుడాయన్ను ఆదేశించాడు. ప్రజల్లో భాగంగా ఉంటూ పరిచర్య చేయవలసిన తనను ప్రజలకు దూరంగా వెళ్లి అజ్ఞాతంలో దాగి ఉండమని దేవుడెందుకంటున్నాడో ఏలియాకు ఏలియాకు వెంటనే అర్థమై ఉండదు. అయినా దైవాజ్ఞకు విధేయుడయ్యాడు (1 రాజులు 17:3). పరమ దుర్మార్గుడైన అహాబురాజు ఎదుట నిలబడి దేవుని మాటల్ని నిష్కర్షగా అతనికి కొన్నాళ్ల క్రితమే చెప్పాడు. అహాబునే ఎదుర్కొన్న తాను ఇంకెవరినైనా అవలీలగా ఎదుర్కోగలనన్న భావంతో ఉన్న ఏలియాకు దేవుడే అజ్ఞాతవాసం విధించాడు. అహాబునెదిరించిన అనుభవం ఏలియాకు గొప్పదే కాని దేవుని దృష్టిలో అది చాలా చిన్న అనుభవం. దేవుని ప్రణాళిక ప్రకారం ఒక రోజున ఏలియా కర్మెలు పర్వత శిఖరం మీద వేలాది మంది ఇశ్రాయేలీయులు, వారిని హేయమైన పూజా విధానాలకు పురికొల్పిన బయలు ప్రవక్తల ముందు నిలబడవలసి ఉంది. అక్కడ బయలు ప్రవక్తలను ఆత్మీయంగా చిత్తుచేసి ఓడించి ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్నిని, భయంకరమైన క్షామంతో తల్లడిల్లుతున్న దేశం మీద విస్తారమైన వర్షాలు కురిపించవలసి ఉంది. ఈ కర్మెలు యాగానికి ముందస్తుగా, సిద్ధపాటుగా కెరీతు వద్ద అజ్ఞాతంలో ఉంటూ దేవునితో ఏకాంత ప్రార్థనా జీవితం గడపవలసి ఉంది. కర్మెలు విజయానికి ఈ కెరీతు అనుభవమే పునాది కానున్నది.

 దేవునితో విశ్వాసులు, పరిచారకుల అనుబంధం ఎంత పటిష్టంగా ఉంటే వారి ప్రార్థనలు అంత శక్తివంతంగా ఉంటాయి. లోక విధానాఉల, మానవ శక్తియుక్తులతో సాగే పరిచర్యలు దేవుని త్రాసులో తేలిపోతాయి, వెలవెలబోతాయి. అవి పరిచారకులకు మేలు కలిగిస్తాయేమో కాని దేవునికి మహిమ కలిగించవు. యేసుప్రభువే తరచుగా కొండల్లోకి వెళ్లి పరలోకపు తండ్రితో గంటలకొద్దీ ప్రార్థనలో గడిపే వాడని బైబిలు చెబుతోందంటే ‘ఏకాంత ప్రార్థనానుభవం’ ఎంత శ్రేష్టమైనదో అర్థం చేసుకోవచ్చు.


అందుకే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని యేసుప్రభువు తన శిష్యులను హెచ్చరించాడు (యోహా 14:5). ఆ రహస్యాన్ని పరిచర్యలో అర్థం చేసుకున్న పౌలు ‘నన్ను బలపరుచు దేవునియందే సమస్తం చేయగలనన్నాడు’ (ఫిలి 4:13). తమ జీవితాలు, కుటుంబాలు, చర్చిలు, పరిచర్యల్లో గొప్ప కార్యాలు జరగాలనుకుంటే ముందుగా ‘ప్రార్థన’ అనే పునాది వేసుకోవాలి. ఏకాంత ప్రార్థనా క్రమశిక్షణనలవర్చుకోవాలి. మహా దైవజనులు భక్తసింగ్‌గారు ఎన్నో లక్షల మందికి ఆశీర్వాదకరంగా పరిచర్య చేశారు. హైదరాబాద్‌లో తన రెండు గదుల నిరాడంబర నివాసంలో ఒక గదిని  ప్రత్యేకించి ప్రార్థనకు కేటాయించారు. ఎక్కువ సమయాన్ని అందులోనే గడిపేవారు. నిరాడంబరత్వం, ఏకాంత ప్రార్థనానుభవం, దేవునిపై సంపూర్ణంగా ఆధారపడటం ఇదే కెరీతు అనుభవమంటే. ప్రార్థనా జీవితం బలంగా ఉంటే సాధించలేనిది లేదు, అది బలహీనపడితే సాధించగలిగింది లేదు!!

 - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్

 

మరిన్ని వార్తలు