ఐఫోన్ లేకున్నా...

25 Mar, 2015 00:16 IST|Sakshi
ఐఫోన్ లేకున్నా...

ఆపిల్ స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లోకి వచ్చేందుకు ఇంకా ఒక నెల సమయముంది. ఈలోపుగానే దాంట్లోని ఫీచర్లపై పుకార్లమీద పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఐఫోన్ లేకపోతే వాచ్ బేకార్ అని, నెట్ కనెక్షన్ కూడా ఉండదని... ఇలా రకరకాల వదంతులు. వీటిల్లో కొన్ని నిజం కూడా. ఐఫోన్ ఉన్నప్పుడే వాచ్ నెట్‌కు కనెక్ట్ అవుతుంది. సిరి, మెయిల్ వంటి అప్లికేషన్లు పనిచేస్తాయి. థర్డ్‌పార్టీ అప్లికేషన్లు పనిచేయాలన్నా ఫోన్ ఉండాల్సిందే. అయితే ఫోన్ లేకుండా వాచ్ చేయగల కొన్ని పనులు ఇలా ఉన్నాయి...
 వాచ్ అన్నాక టైమ్ చూపకుండా ఉంటుందా? కచ్చితంగా చూపిస్తుంది. అలారమ్ సెట్ చేసుకోవడంతోపాటు స్టాప్‌వాచ్, టైమర్లను మామూలు వాచీల మాదిరిగానే వాడుకోవచ్చు. ఐఫోన్ అవసరం లేకుండా... అలాగే ఆపిల్ ఐవాచ్‌లో దాదాపు 2 జీబీల స్టోరేజీ మ్యూజిక్, ఫొటోల కోసం కేటాయించారు. వైర్‌లెస్ బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ ద్వారా మ్యూజిక్ వినవచ్చు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ మాత్రం సాధ్యం కాదులెండి. దీంతోపాటు దాదాపు 75 ఎంబీల వరకూ ఉండే ఫొటోలను ఐక్లౌడ్ ఫొటో లైబ్రరీ ద్వారా చూడవచ్చు.
 ఆరోగ్య సమాచారం...
 ఐఫోన్ తోడుంటే ఆపిల్ వాచ్ మీ ఆరోగ్య సూచికలపై పూర్తిస్థాయిలో కన్నేసి ఉంచగలదు. గుండె కొట్టుకునే వేగం, ఎక్కిన మెట్లు, దిగిన మెట్ల సంఖ్య, ఎంత దూరం నడిచింది? కూర్చుని, నుంచుని ఉన్న సమయాలు వంటి వివరాలన్నీ సేకరించి పెట్టగలదు. ఐఫోన్ లేకపోతే  ఇంటర్నెట్ కనెక్షన్, తద్వారా జీపీఎస్ ట్రాకింగ్ అందుబాటులో ఉండవు కాబట్టి... నడక దూరాన్ని మాత్రం అంచనా వేయలేదు. మిగిలిన సమాచారం మాత్రం స్థానికంగా స్టోరై ఉంటుంది. ఐఫోన్ అందుబాటులోకి రాగానే సింక్ అవుతుంది.
 చెల్లింపులకూ...
 ఆపిల్ పే అప్లికేషన్‌తో కూడిన ఐవాచ్‌ను చెల్లింపుల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌సీ రీడర్  దగ్గర ఆపిల్ పే ను యాక్టివేట్ చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఐఫోన్‌లో ఉన్న గిఫ్ట్‌కార్డ్స్ తదితరాలకు సంబంధించిన చెల్లింపులను కూడా దీని ద్వారా చేయవచ్చు.
 దీంతోపాటు ఐఫోన్‌లో ఉన్న ఆపిల్ రిమోట్ అప్లికేషన్‌ను వాచ్‌లో ఏర్పాటు చేయడం వల్ల ఆపిల్ ఐటీవీని చేతివాచీ ద్వారా నియంత్రించవచ్చు.
 ఐట్యూన్స్, ఐట్యూన్స్ రేడియోలను కంట్రోల్ చేసేందుకు కూడా ఇదే రిమోట్ ఉపయోగపడుతుంది.
 
 

మరిన్ని వార్తలు