సుఖజీవనం సాగించే .....

23 Feb, 2015 23:37 IST|Sakshi
సుఖజీవనం సాగించే .....

మహిళారైతు భూదేవి-8
 
మెట్ట పొలంలో ఒకటికి పది రకాల సంప్రదాయ(పాత) పంటలను సేంద్రియ పద్ధతుల్లో పండించుకుంటూ.. అప్పుల పాలవకుండా సుఖజీవనం సాగించే వ్యవసాయ సంస్కృతికి గడ్డమీది నర్సమ్మ(55) నిదర్శనంగా నిలుస్తోంది. ఈమె స్వగ్రామం మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలంలోని టేకూర్. ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లకు తల్లి అయిన నర్సమ్మ తమకున్న ఐదెకరాల భూమిలో వర్షాధారంగానే పంటలు పండిస్తూ తిండికి బట్టకు లోటు లేకుండా జీవనం సాగిస్తోంది. డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) మహిళా రైతు సంఘంలో సభ్యురాలైన తర్వాత రసాయనిక ఎరువుల జోలికి వెళ్లకుండా 20 ఏళ్లుగా సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తోంది.
 నర్సమ్మ కుటుంబానికి పది వరకు పశువులున్నాయి.

సొంతంగా తయారు చేసుకునే వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు మాత్రమే పొలానికి వేస్తున్నారు. పొలంలో ఏదో ఒక పంటే వేస్తే కాలం కలిసిరాకపోతే తినడానికేమీ ఉండదు. అందుకే, 10 నుంచి 15 పంటలు కలిపి వేస్తే.. కొన్ని కాకపోతే కొన్ని పంటలైనా పండుతాయని, తిండికి ఇబ్బంది ఉండదనీ అంటుంది నర్సమ్మ. సంఘంలో చేరిన దగ్గరి నుంచి సామ, జొన్న, కొర్ర, ఆవాలు, సజ్జ, కంది, శిరిశనగ, శనగ, తెల్ల, నల్లకుసుమ, గోధుమ, యవ్వలు.. ఇలా అనేక రకాల పాత పంటలను నర్సమ్మ పండిస్తోంది. ఒక పంటలోనే అనేక రకాల విత్తనాలుంటాయి. ఎత్తు పల్లాల పొలంలో వర్షాన్ని బట్టి ఏ రకం విత్తనం ఎక్కడ వేస్తే పండుతుందనే సంప్రదాయ జ్ఞానం నర్సమ్మకుంది.
 ఆమె ఇంట్లో తిండిగింజలు, పప్పులకు ఎప్పుడూ లోటుండదు. బుట్టలు, కడవల్లో కనీసం 25 రకాల విత్తనాలు ఉంటాయి. పండించిన పంటలో తాము తినగా మిగిలిన వాటిలో విత్తనాల కోసం నిల్వ ఉంచుకొని ఇంకా మిగిలితే డీడీఎస్‌కు, ఇతరులకు అమ్ముకుంటుంది. ఉప్పు, నూనె, బియ్యం తప్ప మిగతావన్నీ పొలంలో పండించుకొని తింటారు. నర్సమ్మ పత్తి వంటి పంటల జోలికెళ్లదు. సేద్యమంతా వర్షాధారంగానే. పొలంలో బోర్లు లేవు. బావి తవ్వినా నీటి జాడలేదు. అయినా, కరువు కాలంలోనూ పాత పంటలతో ధీమాగా సేద్యం చేస్తోంది. తాను చేసే వ్యవసాయం గురించి ఇతర రైతులకూ వివరంగా చెబుతుంది.
 పంపినవారు: ఎస్. శివకుమార్,
 న్యాల్‌కల్, మెదక్ జిల్లా
 
నర్సమ్మ
 

మరిన్ని వార్తలు