కోవిడ్‌ రాయని మరణ శాసనం

17 Jun, 2020 03:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తల్లి, ఇద్దరు బిడ్డలు... మూడు ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. ఈ మరణాలను నిర్ణయించింది కోవిడ్‌ కాదు, వైద్యులు. గర్భిణిని హాస్పిటల్‌లో చేర్చుకోలేదెవ్వరూ. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా ఐదు హాస్పిటళ్ల మెట్లెక్కింది. ఆమె కడుపులో పెరుగుతున్న ఇద్దరు బిడ్డలు భూమ్మీదకొస్తామని తల్లిని తొందర పెడుతున్నారప్పటికే. ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘోరానికి బలైపోయిన ప్రాణం పేరు సుధా సైనీ.

ఇంత పెద్ద శిక్షా!
సుధాసైనీ ఒక పేదింటి మహిళ. భర్త కమలేశ్‌  కురిపిస్తున్న ప్రేమ సంపన్నత తప్ప, సమాజంలో బతకగలిగిన సంపన్నత లేదు. కమలేశ్‌ భార్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. సుధకు ఏడు నెలలే నిండాయి. అయినా సరే... పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమె నెలనెలా చూపించుకుంటున్న ప్రభుత్వ హాస్పిటల్‌కి వెళ్లింది. నర్సులు... ‘తొమ్మిది నెలలు నిండిన తర్వాత రండి’ అని పంపించేశారు. ‘నొప్పులు భరించలేకపోతున్నాను, హాస్పిటల్లో చేర్చుకోండి’ అని వేడుకున్నా కనికరించలేదు. డెహ్రాడూన్‌లోని డూన్‌ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, కోరోనేషన్‌ హాస్పిటల్‌తోపాటు మరో రెండు ప్రైవేట్‌ హాస్పిటళ్లకు కూడా వెళ్లింది. అందరూ వెనక్కి పంపేశారు. సుధ నొప్పులతోనే ఇంటికి వెళ్లిపోయింది.

ఈ నెల తొమ్మిదో తేదీన ఇంట్లోనే ప్రసవం అయింది. బిడ్డలిద్దరూ కొంతసేపటికే ప్రాణాలు వదిలేశారు. మరో మూడు రోజులకు తల్లి ప్రాణం కూడా బిడ్డలను వెతుక్కుంటూ వెళ్లిపోయింది. శుక్రవారం భార్య అంతిమ సంస్కారాలు పూర్తి చేశాడు కమలేశ్‌. బిడ్డల అంతిమ సంస్కారం చేసిన రోజు నుంచే తిండి మానేశాడతడు. ఇప్పుడు భార్యను కూడా కాటికి అప్పగించేసి జీవచ్ఛవంలా ఉన్నాడు. ‘‘భూమ్మీదకు రావడానికి నా బిడ్డలు తెలియక తొందరపడ్డారు, డాక్టర్లు వైద్యం చేయకుండా నా బిడ్డలకు ఇంత పెద్దశిక్ష వేస్తారా? బిడ్డలను భూమాత కడుపులో దాచి వచ్చిన తర్వాత సుధ నాతో ‘మన దగ్గర బాగా డబ్బు ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు కదా. మన బిడ్డలు బతికేవాళ్లు’ అని కన్నీళ్లు పెట్టుకుంది. సుధ మాట నిజమే కదా’’ అని కూడా అంటున్నాడు కమలేశ్‌.

నిజంగా కరోనా వచ్చిందా!
సుధా సైనీని అడ్మిట్‌ చేసుకోవడానికి నిరాకరించిన డాక్టర్ల అనుమానం ఒక్కటే ‘ఆమె కరోనా పేషెంట్‌ కావచ్చు’ అని. ఆమె ప్రాణం పోయిందని తెలిసి ఇప్పుడు నాలుక్కరుచుకుంటున్నారు. తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ‘ఆమె ఇప్పటి వరకు చూపించుకున్న హాస్పిటల్‌ ఎందుకు చేర్చుకోలేదు’ అనే తెలివైన ప్రశ్న సంధించారు. స్థానిక ఎమ్మెల్యే హర్భజన్‌ కపూర్‌ జోక్యంతో దర్యాప్తు మొదలైంది. జిల్లా ప్రధాన వైద్యాధికారి చెప్తున్న కారణం మరీ విచిత్రంగా ఉంది. ‘హాస్పిటల్‌కు వచ్చేటప్పటికే ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉందిట’ అని సెలవిచ్చారు. మరి... హాస్పిటల్‌కు  వైద్యసహాయం అవసరమైనప్పుడు కాకుండా, హాయిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు హాలిడే వెకేషన్‌కు వచ్చినట్లు వస్తారా? వైద్యుల్లో సున్నితత్వం కనుమరుగైందని సుధా సైనీ మరణమే చెబుతోంది.

ఇంగితం కూడా హరించుకుపోయిందా? ‘చనిపోయిన పేషెంట్‌ స్వాబ్‌ శాంపిల్స్‌ తీసుకున్నాం, కరోనా పరీక్ష నిర్వహిస్తాం’ అని చెప్తున్నారు. పరీక్షించి ఏం చెబుతారు? ఏం చెప్పినా ఒరిగేదేముంటుంది? సుధ, ఆమె బిడ్డలు తిరిగి రారు. వైద్యులు ఒక విషయాన్ని మాత్రం నిర్ధారించగలిగేది ఈ మరణాన్ని కరోనా మరణం కింద నమోదు చేసుకోవాలా, ఇతర మరణం కింద నమోదు చేసుకోవాలా అనేది మాత్రమే. ‘డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా సంభవించిన మరణం’ అనే కాలమ్‌ మన అడ్మినిస్ట్రేషన్‌ చార్టుల్లో ఎక్కడా లేదు కాబట్టి... ప్రభుత్వ లెక్కల ప్రకారం సు«ధది సహజ మరణమే. ఇంకా చెప్పాలంటే... ‘వైద్యసదుపాయాలెన్ని కల్పించినప్పటికీ హాస్పిటళ్లకు వెళ్లకుండా ఇంట్లోనే పురుడు పోసుకోవడం వల్ల సంభవించిన మరణం ఇది’ అని భాష్యం చెప్పడానికి కూడా ఎవరికీ గొంతుకు ఏమీ అడ్డుపడకపోవచ్చు.

మరిన్ని వార్తలు