అవని కల్యాణం

9 Oct, 2016 23:31 IST|Sakshi
అవని కల్యాణం

హిందూ జీవన విధానంలోని వైవిధ్యానికీ, బహుముఖ ఆరాధనా రీతులకి తిరుగులేని రుజువు దసరా పండుగ. ఈ పదిరోజులు పూజలు అందుకునే దుర్గ, మహిషాసురమర్దని, శక్తి- ఎలాంటి భావనతో, కల్పనతో ఆమె ఆరాధనకు ఉపక్రమించినా, అదంతా శాక్తేయం ద్వారా భారతీయతను స్పృశించిన విశిష్ట ఆధ్యాత్మిక ధార. అన్నింటి ఫలశ్రుతి ఒక్కటే - చెడు ఎప్పటికీ విజయం సాధించలేదు. ఎప్పటికైనా మంచి మాత్రమే గెలిచి తీరుతుంది.

దుర్గతిని నాశనం చేసే మహోన్నత శక్తి కాబట్టి ఆమె దుర్గ. దుర్గ అంటే దుర్గం- అభేద్యమైనదని కూడా అర్థం. ఆసేతుశీతాచల పర్యంతం దసరాకు పూజించే అమ్మవారు దుర్గ. ఆమెకు అనేక నామాలు. పార్వతి, కాళిక, శక్తి, సతి, అంబిక, జగద్ధాత్రి, భవాని, అంబిక, అన్నపూర్ణ, తార- ఏ పేరైనా అమ్మవారిదే. అలాగే ఆమెకు అనేక రూపాలు. ఆ దేవతామూర్తికి పది చేతులు ఉంటాయి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం. ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క పరమార్థం. ఈ భావనలన్నీ కొన్ని చింతనల సమాహారం. అవన్నీ మనిషికి తన మీద తనకు విశ్వాసం పెంచేవే. చెడు మీద పోరాటానికి సదా సంసిద్ధంగా ఉంచడానికి ఉపకరించేవే.

అతి భయానకంగా... పరమ ప్రసన్నంగా...
దేవదానవులకు వందల ఏళ్లపాటు యుద్ధం జరిగిందని పురాణాలు చెబుతాయి. ఈ యుద్ధంలో దానవ గణాలను నడిపించినవాడే మహిషాసురుడు. అయితే ఇతడికి శివుడి వరం ఉంది. ఏ పురుషుడికీ అతడిని సంహరించే శక్తి లేని రీతిలో మహిషాసురుడు బోళాశంకరుని నుంచి వరం పొందాడు. ఇటు దేవతల సేనాని ఇంద్రుడు. దేవతలను ఓడిస్తే స్వర్గం మహిసారునిదే. ఈ యుద్ధంలో ప్రతికూల శక్తిని దట్టించుకున్న దానవులదే పైచేయి అయిన సందర్భంలో పార్వతి వచ్చి దేవతల పక్షాన నిలిచింది. సృష్టి, స్థితి, లయల కు ఆమె ప్రతిరూపమైంది.

ఒకసారి భయానకంగా, ఒకసారి ప్రసన్నంగా, మరొకసారి అగ్నిజ్వాలలు ఉమిసే జ్వాలాముఖిలా కనిపించే ఆమె ముఖ వర్చస్సు శివుని ప్రసాదమే. శ్రీమహావిష్ణువు ఆమె పది చేతులుగా మారాడు. మానవాళి జీవన విధానాన్ని శాసించే బ్రహ్మదేవుడు ఆమె పాదపద్మాలై నడిపించాడు. ఆమె కళ్ల నుంచి వర్షించే అగ్నిశిఖలను సాక్షాత్తు అగ్నిదేవుడే కూర్చాడు. సృష్టిలోని భూమి, ఆకాశం, నీరు, వాయువు, సూర్యాస్తమయాలు ఆమెలో భాగమైనాయి. ఆ పదిచేతులలో కనిపించే ఆయుధాలు ఆయా దేవతామూర్తులు అందించినవే.

చెడుకు విష్ణు చక్రం... సుస్థిరతకు శంఖం
అమ్మవారి చేతులలో కనిపించే ఆయుధాల పరమార్థం గురించి తెలుసుకోవడం మంచి అనుభవం. కుడివైపున ఉన్న ఐదు చేతులలో పైన ఉన్న చేతి చూపుడు వేలుకు తగిలించి ఉంటుంది విష్ణుచక్రం. ఇది ధర్మరక్షణకు ప్రతీక. చెడును సంహరిస్తుంది. మంచికి అండగా నిలుస్తుంది. తరువాత - శంఖం. ఇది ఎడమవైపు ఉన్న ఐదు చేతులలో మొదటి చేతిలో కనిపిస్తుంది. ఇది ఓంకారనాదానికి ప్రతీక. ప్రతికూలతను పెంచే భావాలను దూరంగా ఉంచేదే పంచాక్షరి. అంటే తన భక్తులకు అమ్మవారు ప్రశాంతి, సుస్థిరతలను అనుగ్రహిస్తుంది. శంఖం పూరించడంలోని భావం ఇదేనని చెబుతారు. ఆ మహాశక్తికి సూర్యభగవానుడు బహూకరించినవే ధనుర్బాణాలు. ఎడమ వైపు చేతుల వరసలో రెండోచేతిలో ఇవి కనిపిస్తాయి. ఆమెను విశ్వసించేవారికి జీవితంలో అడ్డంకులు ఎదురుకావు అన్న సందేశం ఈ ధనుర్బాణాల ద్వారా వినిపిస్తుంది.

గుణగణాల సమతూకం... త్రిశూలం
అమ్మవారికి కుడివైపు రెండో చేతిలో గొప్ప కరవాలం కనిపిస్తుంది. అయితే ఇది అజ్ఞానాన్ని తెగ నరకాలన్న సందేశాన్ని సునిశితంగా అందిస్తుంది. అజ్ఞానాంధకారాన్ని చీల్చి వెలుగు వైపు కూడా వెళ్లడానికి తోడ్పడుతుంది. ఈటె మరొక ఆయుధం. ఇది శుభాన్ని ఇచ్చి, ప్రతికూల శక్తులను తుదముట్టిస్తుంది. దండం- ఈ ఆయుధం వెనుక ఉంచిన ఉద్దేశం ఆసక్తిదాయకంగా కనిపిస్తుంది. శత్రువు శక్తియుక్తులను బలహీనం చేసేదే దండం. త్రిశూలం అమ్మవారి కూడివైపు నాలుగో హస్తంలో అలరారుతూ ఉంటుంది. మనిషిలోని సత్వరజస్తమో గుణాలకు త్రిశూలం ప్రతీక. జీవనం సాఫీగా సాగాలంటే ఆ మూడు గుణాలు సమతూకంలో ఉండాలని చెప్పడమే ఆ ఆయుధాన్ని పట్టించడంలోని అసలు ఆశయం.

స్త్రీ శక్తికి మహోగ్రరూపమే అమ్మవారు
శక్తి కేంద్ర బిందువుగా అనేక గాథలూ, కథలూ అవతరించాయి. శివపురాణం, మార్కండేయ పురాణం, దేవీ భాగవతం అమ్మవారి గురించి బీభత్స, కరుణ రసాలతో కూడిన ఘట్టాలను ఆవిష్కరించాయి. మరెన్నో గ్రంథాలు కూడా అమ్మవారి ఉద్భవం గురించి చెప్పాయి. ఇవన్నీ కూడా పురుషుని సాయం లేకుండా, రాక్షస గణాలపై ఒక స్త్రీశక్తి మహోగ్రంగా సాగించిన భీకర యుద్ధం గురించి రమణీయంగా వెల్లడిస్తాయి. దుర్గ అంటే పార్వతి నుంచి రాలిన చర్మమని ఒక కథ.

శుంభ, నిశుంభలతో పార్వతీదేవి సమరం చేసినప్పుడు ఆమె శరీరం రాలిపోయిందని, అదే దుర్గగా అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే చెడు మీద తాను సాగిస్తున్న పోరాటంలో సహకారం అందించేందుకు పార్వతి కొన్ని శక్తులకు జన్మ నిచ్చిందనీ, కాళి అలాంటి శక్తేనని మరొక కథనం. ఇవన్నీ అమ్మవారికి ఎన్ని రూపాలు ఇచ్చినా, ఆమెకు నిర్దేశించిన లక్ష్యం మాత్రం ఒక్కటే- దుర్గుణాల నుంచి ఈ సకల జగతిని రక్షించిన చైతన్యంగానే వ్యాఖ్యానించాయి. వీటికి పరాకాష్ట- మహిషాసుర మర్దనం.

 

 కమలమూ దుర్గమ్మ ఆయుధమే!
విశ్వ కల్యాణానికి బెడదగా తయారైన ప్రతికూల శక్తిని కూడా తక్కువ అంచనా వేయకూడదన్న సంకేతం అమ్మవారి ఒక చేతిలో కనిపించే పిడుగు లేదా ఉరుము అందిస్తున్నది. అలాగే పోరాటం ఆరంభించిన తరువాత విశ్వాసం వదులుకోకూడదు. అంటే వెనుకడుగు వేయరాదన్న సందేశం కూడా ఈ పిడుగులో ఉంది. కమలం కూడా ఒక చేతిలో కనిపిస్తుంది. ఆధ్యాత్మిక వికాసానికీ, తద్వారా సాధ్యమయ్యే ఆత్మ వికాసానికి ప్రతీక. దానవులతో జరిగిన యుద్ధంలో ఆమె ధరించిన కవచం చేసి ఇచ్చినవాడు విశ్వకర్మ. నిజమే- అమ్మవారు ప్రధానంగా సమరానికి అధిష్టానదేవత. అదే సమయంలో జ్ఞానరూపిణి. ఈ రెండే ఆ రూపాలలో, ఆమె చేతిలోని ఆయుధాల ద్వారా వ్యక్తమవుతోంది.  కొన్ని విగ్రహాలలో అమ్మవారు త్రినేత్రిగా కనిపిస్తుంది. అలాగే పదికి మించిన ఆయుధాలు కూడా కనిపిస్తాయి.

 జగన్మాత... జగద్ధాత్రి... మహాకాళి
అమ్మవారికి ఎన్నో పేర్లు అని కదా! మార్కండేయ పురాణంలో ఆమెకు దుర్గ, దశభుజి, సింహవాహన, మహిషాసురమర్దని, జగద్ధాత్రి, కాళి, ముక్తకేశి, తార, చిన్నమస్తిక వంటి పేర్లతో ప్రస్తావించడం కనిపిస్తుంది. మధు, కైటభులతో యుద్ధం చేసినప్పుడు ఆమె పేరు మాయ. నవదుర్గలుగా కూడా నవరాత్రులలో ఆమెను ఆరాధిస్తారు. ఆ విధంగా అత్యున్నత శక్తికి అమ్మవారిని ప్రతీకగా నిలుపుకున్న విషయం అవగతమవుతుంది. దేవీమహాత్మ్యం మహామాయ, మహాశక్తిగా పిలిచింది. - డాక్టర్ గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు