అసుర సంహారం

9 Oct, 2016 23:36 IST|Sakshi
అసుర సంహారం

స్త్రీ శక్తి అన్నది పురుషులు ఎప్పటికీ జీర్ణించుకోలేని మాట. అయితే అది మగవారి జీర్ణశక్తికి సంబంధించిన విషయంగానే మనం పరిగణించాలి. స్త్రీ రాణించడం, స్త్రీ పోరాడడం అన్నవి ఎప్పటికీ గొప్ప సంగతులు. పరిమిత అవకాశాల్లోంచి ఆమె రాణిస్తుంది. పరిమిత ఆయుధాలతోనే సాధిస్తుంది. ఆమె తొలి పోరాటం తల్లి గర్భంలో! బతికి బయటపడేందుకు స్త్రీ శిశువు చేసే పోరాటాన్ని మించిన యుద్ధం మానవ జన్మలోనే లేదు.

ముందుకు ఒక చిన్న అడుగు వెయ్యడం కూడా స్త్రీ లక్ష్య సాధనలో గొప్ప విజయమే! అంతగా ఆమె సంప్రదాయపు సంకెళ్లకు బందీ. అంతగా ఆమె తన దేహధర్మాలకు బందీ. అంతగా ఆమె.. మగవాడు తెచ్చిపెట్టే ఉత్పాతాలకు, తలనొప్పులకు బందీ. ఇన్ని బంధనాల్లోంచి ఒక స్త్రీ విజేతగా నిలబడిందీ అంటే బయటి శక్తులతో ఎంతగా పోరాడి ఉండాలి! తనతో తను ఆమె ఎంతగా పోరాటం చేసి ఉండాలి! లోపలి నుంచి ఎన్ని శక్తుల్ని కూడగట్టుకుని ఉండాలి!

స్త్రీ విజయం సాధించిందీ అంటే ఆ దారిలో ఒక దుష్టసంహారం జరిగిందనే. దీనర్థం ఆమె పోరాడి గెలిచిందనీ. పోరాడితేనే ఆమె గెలుస్తుందనీ! అందుకే స్త్రీ గెలుపు లోకానికి వేడుక. పెద్ద సెలబ్రేషన్. దుర్గమ్మ అయినా, ఏ కాలపు అమ్మాయి అయినా.

గురువు ద్రోణాచార్యుడు పక్షికి బాణాన్ని గురిపెట్టమన్నప్పుడు అర్జునుడు పక్షి కన్ను మాత్రమే చూడగలిగాడు. పక్షి తోక, పక్షి ముక్కు, పక్షి ఇతర శరీర భాగాలేవీ అర్జునుడికి కనిపించలేదు. భేష్ అన్నాడు ద్రోణాచార్యుడు.

 ఇప్పుడూ ఇంటికో అర్జునుడు ఉన్నాడు. స్మార్ట్‌ఫోన్ అతడి పక్షికన్ను. న్యూస్ పేపర్ అతడి పక్షి కన్ను. స్పోర్ట్స్ చానల్ అతడి పక్షి కన్ను. ఎందులో ఉంటే అందులోనే ఒకే కాన్‌సన్‌ట్రేషన్‌తో ఉండిపోతాడు. గృహిణికి అలా కుదరదు. తను ఫోన్‌లో ఉన్నా, పేపర్‌లో ఉన్నా, టీవీలో ఉన్నా..  మిగతావాటిపైన కూడా ఒక కన్నేసి ఉంచాలి. పాలు పొంగుతున్నాయేమో చూడాలి. పిల్లాడు ఎందుకేడుస్తున్నాడో చూడాలి. ఇంటాయనకు ఏం కావాలో చూసుకుంటూ ఉండాలి. ఆవేళ్టి లక్ష్యాల పక్షికన్నులన్నింటి పైనా ఒక కన్ను వేసి వాటిని ఎప్పుటికప్పుడు ఛేదిస్తూ ఉండాలి. 

అమ్మాయిలు ర్యాంకులు కొట్టేస్తున్నారంటే చదువొక్కటే వాళ్ల పక్షికన్ను అయిందని కాదు. ఇంట్లో అనుకూలంగా లేని పరిస్థితుల్ని, దారిలో వెంబడించే చికాకుల్ని ఓర్పుగా సంహరించి గెలుస్తున్నారని. మహిళలు ఉద్యోగాలకు వెళ్లి వస్తున్నారంటే ప్రతిభను నిరూపించుకోవడం ఒక్కటే వాళ్ల పక్షికన్ను అయిందని కాదు. ఒత్తిళ్లను, వేధింపులను నేర్పుగా సంహరించి నెగ్గుకొస్తున్నారని. పరిధి పెరిగే కొద్దీ స్త్రీని వెనక్కి లాగే శక్తులు పెరుగుతాయి. వాటన్నిటినీ జయించి ముందుకు వెళ్లాలి కాబట్టే స్త్రీ విజయానికి అంత గౌరవం. అంత విలువ.

దుర్గమ్మ దుష్టసంహారం చేసింది. రాణి రుద్రమ్మ శత్రుసంహారం చేసింది. ఆ స్ఫూర్తి ఏ అమ్మాయిలో, ఏ మహిళలో కనిపించినా ఈ సమాజం ఆమెకు చేతులెత్తి నమస్కరించాలి. ఆమె విజయాన్ని షేర్ చేసుకోవాలి. ప్రేరణ పొందాలి.

షెర్లీ పాల్... కీచక సంహారం
రెండేళ్ల క్రితం వరకు షెర్లీ పాల్(45) అంధేరిలోని ఎం.ఎ. హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయురాలు. 2014లో ఆమె ఉద్యోగం పోయింది. అందుకు కారణం... అక్కడే పనిచేస్తున్న యోగేశ్ యాదవ్ అనే అసిస్టెంట్ టీచర్‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం. 2013లో యోగేశ్ యాదవ్ ఆ స్కూల్‌లోని 40 మంది టెన్త్ విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. అతడి వేధింపుల గురించి బాధిత విద్యార్థినుల ద్వారా వినికూడా, స్కూలు యాజమాన్యం స్కూలు ప్రతిష్ట దెబ్బతింటుందన్న భయంతో విషయాన్ని దాచి ఉంచింది. బైట పెట్టకండని విద్యార్థిలను కూడా హెచ్చరించింది. కానీ షెర్లీ పాల్ ఊరుకోలేదు. సాక్ష్యాధారాలతో సహా పోలీసు కేసు పెట్టారు. కోర్టు అతడిని మూడు నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

మూడు నెలల తర్వాత యాజమాన్యం మళ్లీ అతడిని ఉద్యోగంలోకి తీసుకుంది. తమ అదేశాలను ధిక్కరించి అతడి మీద ఫిర్యాదు చేసినందుకు షెర్లీని మాత్రం ఉద్యోగంలోంచి తొలగించింది! ఈ చర్య అక్రమం అని షెర్లీ రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. ఇన్నాళ్లూ జీతం లేకపోవడం అమెను ఆర్థికంగా కుంగదీసింది. దానికి తోడు అనారోగ్యంతో ఉన్న తల్లికి మందులు కొనలేని స్థితి. అయినా ఆమె మనోధైర్యం సడలలేదు. వాయిదాలకు వెళ్లారు. పోరాడారు. తన వైపు వాదనను వినిపించారు. ఇటీవలే కోర్టు తీర్పు వచ్చింది... ఆమెను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని. బాధిత విద్యార్థినులు బ్యాచ్ కంప్లీట్ అయి వెళ్లిపోయినా, ఆమెను వెతుక్కుంటూ వచ్చి కృతజ్ఞతలు తెలిపారు.

నిధి దూబె... భయ సంహారం
నిధి దూబె వయసు 25 ఏళ్లు. గర్భిణి. నాలుగో నెల. భర్త ముఖేశ్ కుమార్ దూబె అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు! భారత సైన్యంలో అతడు సిపాయి. భర్త చనిపోయిన రెండో రోజే నిధిని ఇంట్లోంచి వెళ్లగొట్టారు మెట్టినింటివాళ్లు. దుఃఖాన్ని దిగమింగుకుని ఇండోర్ నుంచి సాగర్‌లోని పుట్టింటికి చేరింది. అక్కడే సుయాష్‌కు జన్మనిచ్చింది. వాడిని తల్లి రక్షణలో ఉంచి తిరిగి ఇండోర్ వెళ్లిపోయింది. ఎంబీఏ చేసింది. ఏడాదిన్నర పాటు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసి, తిరిగి సాగర్ వచ్చింది.

భర్త పనిచేస్తూ చనిపోయిన చోటే తనూ బతుకును వెతుక్కోవాలనుకుంది! సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షలకు దరఖాస్తు చేసింది.  పగలు ఆర్మీ స్కూల్‌లో పాఠాలు చెప్పింది. రాత్రి తన పరీక్షలకు  చదువుకుంది. పరీక్ష రాసింది. ఫెయిల్ అయింది. మళ్లీ రాసింది. మళ్లీ ఫెయిల్ అయింది. మళ్లీ మళ్లీ మళ్లీ రాసింది. ఆఖరికిగా ఐదవ ప్రయత్నంలో పాస్ అయింది. పది రోజుల క్రితమే సెప్టెంబర్ 30న చెన్నైలో ట్రైనింగ్‌కి నిధి ఎంపికయింది.

అనోయర... తిమిర సంహారం
అనోయర 18 ఏళ్ల అమ్మాయి. పశ్చిమ బెంగాల్లోని సుందర్‌బన్ దీవుల్లోని ఒక పేద కుటుంబంలో పుట్టింది. పేదరికం ఆమెను పసిగా ఉన్నప్పుడే పనిమనిషిగా మార్చింది. అప్పుడే అక్రమ రవాణాకు గురైంది. ఎలాగో తప్పించుకుంది. ఇప్పుడు బాలలను కాపాడేందుకు పాటు పడుతోంది! బాల్య వివాహాలకు, బాల కార్మిక వ్యవస్థకు, బాలల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే చేస్తోంది. మొదట ఆమె తన గ్రామస్థులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ‘ముందు నీ జీవితాన్ని చక్కదిద్దుకో. తర్వాత మా పిల్లల్ని దిద్దుదువు గాని’ అన్నారు. అనోయర నిరుత్సాహపడలేదు. ‘సేవ్ ద చిల్డ్రన్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సహకారం తీసుకుని ప్రజల్లోకి వెళ్లింది.

ప్రస్తుతం అనోయర ఒక్కో గ్రూపులో 10 నుంచి 20 వరకు కార్యకర్తలు ఉండే 80 గ్రూపులను ఒక సైనిక దళంలా నడిపిస్తోంది. అంతా కూడా బాలల జీవితం బుగ్గిపాలు కాకుండా సమాజంలో చైతన్యం తెస్తున్నారు. వీళ్ల ప్రతినిధిగా అనోయర ఇప్పటికే రెండు సార్లు (గత ఏడాది, ఈ ఏడాది) ఐక్యరాజ్య సమితికి వెళ్లొచ్చారు. అక్కడికి వచ్చిన మిగతా దేశాల ప్రతినిధులతో తన అనుభవాలను పంచుకున్నారు. స్త్రీలు సంఘటితంగా ఉన్నప్పుడే సమాజంలో అవకాశాలు మెరుగుపడతాయని అనోయరా చెప్పే మొదటి పాఠం. స్త్రీ చదువుకున్నప్పుడు అవకాశాలు తమంతట తామే ఆమె కోసం వెతుక్కుంటూ వస్తాయన్నది ఆ తర్వాత పాఠం.
- మాధవ్ శింగరాజు

మరిన్ని వార్తలు