మహిళంటేనే లీడర్‌షిప్‌

18 Mar, 2019 00:24 IST|Sakshi

పరిచయం డాక్టర్‌ విజయశారదారెడ్డి 

ఆమెకు చదువుకోవడం ఇష్టం, చదువు చెప్పడం అంతకంటే ఎక్కువ ఇష్టం. ఈ రెండు ఇష్టాలను నెరవేర్చుకోవడంలోనే సాగిపోతోంది ఆమె జీవన ప్రస్థానం. ఎం.ఎ హిస్టరీ, ఎంఈడీ చేశారు. ఎంబీఏ, ఎం.ఎస్‌ సైకాలజీ, ఎం.ఫిల్‌... ఇంతవరకు ఇండియాలో. ఆ తర్వాత సాఫ్ట్‌ స్కిల్స్‌లో ట్రైనర్‌గా ఉండి, యుఎస్, యూకేల్లో పర్సనల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు చేశారు.

అవన్నీ పూర్తయిన తర్వాత ‘ఐ విల్‌’ అంటూ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ మీద పరిశోధన చేశారు. బెంగళూరు ఐఐఎమ్‌ ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘ఉమెన్‌ ఇన్‌ లీడర్‌షిప్, ఇండియా’ కోర్సును తన పరిశోధన ద్వారా క్షేత్రస్థాయికి తీసుకెళ్లారామె. ఇవన్నీ కూడా మహిళల సమగ్ర వికాసానికి ప్రోత్సాహాన్ని అందించడానికే అంటున్నారు  డాక్టర్‌ అరిమండ విజయ శారదారెడ్డి. 

గుంటూరు జిల్లా పల్నాడులోని కొదమగుండ్ల.. విజయశారద సొంతూరు. తండ్రి ఉద్యోగ రీత్యా గుంటూరులో పెరిగారామె. అత్తగారిల్లు తెనాలి దగ్గర కొల్లిపర. భర్త వరప్రసాద్‌ రెడ్డికి మిధానిలో ఉద్యోగం. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సంతోష్‌ నగర్‌లో కాపురం. రోజంతా ఖాళీగా ఉండడం నచ్చని గుణం ఆమె టీచర్‌గా మారడానికి కారణమైంది. ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్‌గా చేరి చదువు చెప్పడంలో ఉండే సంతోషాన్ని ఆస్వాదించడం మొదలు పెట్టారు. ఆమె విద్యాభ్యాసం అంతా సిస్టర్స్‌ కాన్వెంట్‌లో సాగడంతో, ఇంగ్లిష్‌ మీద సాధించిన పట్టు విజయశారదను మంచి టీచర్‌గా నిలబెట్టింది. క్రమంగా నలంద, హోలీమేరీ విద్యాసంస్థల స్థాపనకు దారి తీసింది కూడా సిస్టర్స్‌ కాన్వెంట్‌లో పడిన పునాది, టీచింగ్‌ మీదున్న ఇష్టమేనన్నారామె. అయితే అంతటితో తన చదువుకు స్వస్తి చెప్పకపోవడమే ఆమెలోని విలక్షణత.

మన శక్తిని మనమే గుర్తించాలి
నాయకత్వ లక్షణాలు మగవాళ్లకే పరిమితం కాదు, మహిళల్లోనూ పుష్కలంగా ఉంటాయి. పుట్టుకతో స్వతహాగా వచ్చిన నాయకత్వ లక్షణాలు కూడా మన మహిళల్లో అంతర్లీనమైపోతున్నాయి. అవి అంతర్థానమై పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. ఆ ప్రయత్నంలో భాగమే బెంగళూరు ఐఐఎమ్‌లో విజయశారద చేసిన ‘ఐ విల్‌’ కోర్సు. ‘‘ఐ విల్‌ అంటే... ఇండియన్‌ ఉమెన్‌ ఇన్‌ లీడర్‌షిప్‌. మహిళల్లో అంతర్లీనంగా ఉండిపోతున్న నాయకత్వ లక్షణాలు వెలికి తీయడానికి రూపొందిన కోర్సు అది. విదేశాల్లో మహిళలకు స్వతంత్ర భావాలు, దృఢమైన వ్యక్తిత్వం స్వతహాగా కనిపిస్తాయి. తాము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరొకరి ఆమోదం, అంగీకారం కోసం ఎదురు చూడరు.

భర్త మద్దతు ఆశించరు. కష్టమైనా, నష్టమైనా తామే భరిస్తారు. అక్కడి సమాజాలు కూడా అందుకు దోహదం చేస్తాయి. మన దగ్గర ఒక మహిళ సొంతంగా నిర్ణయాలు తీసుకుని వ్యాపారరంగంలో ముందడుగు వేసినా సరే, సమాజం నుంచి ఆమోదం పెద్దగా లభించదు. అదే మహిళ భర్త సహకారంతో వ్యాపారం మొదలు పెడితే ప్రభుత్వపరమైన అనుమతులు రావడం కొంత సులువు అవుతుంది. ఒక మహిళ భర్త సహకారం లేకుండా పరిశ్రమను స్థాపించింది.. అంటే చాలా సందర్భాల్లో ఆమెకు బ్యాంకు రుణాలు కూడా కష్టమవుతుంటాయి. ఈ ధోరణిని తుడిచేయడానికి కంకణం కట్టుకోవాల్సింది మహిళలే’’ అన్నారు విజయ శారద. 

చట్రం నుంచి బయటికి రావాలి
మన మహిళలు అనేక బాలారిష్టాలను ఎదుర్కొని పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. అయితే పరిధిని విస్తరించుకోవడంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ‘‘ప్రపంచదేశాల్లో జరిగే ఎంట్రప్రెన్యూర్‌ మీట్‌లలో విదేశీ మహిళల్లో ఎక్కువ మంది ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ నడిపేవాళ్లు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల నిర్వహకులు కనిపిస్తారు. మనవాళ్లు.. ముఖ్యంగా తెలుగు వాళ్లు వంటింటి ఉత్పత్తులు, బ్యూటీ ప్రోడక్ట్స్, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ దుస్తులు, కుట్లు అల్లికలు, వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ ఆభరణాలతో వస్తుంటారు. వాటికి అమెరికాలో మంచి మార్కెట్‌ ఉన్న మాట వాస్తవమే.

అవన్నీ క్రియేటివిటీకి ప్రతీకలే. అయితే అవేవీ ఉత్పాదకతను పెంచవు. ఓవరాల్‌ డెవలప్‌మెంట్‌కి దారి తీసే రంగాలు కాదు. అందుకే మనం ఆ చట్రం నుంచి బయటికొచ్చి ఇతర రంగాల్లో నైపుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రపంచంతోపాటు పరుగెత్తగలుగుతాం. మనలో ఉన్న సంప్రదాయమైన స్కిల్స్‌కే పరిమితం కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు కొంత వరకు ముందడుగులో ఉంటున్నాయి’’ అన్నారామె.

పాలనా నైపుణ్యమూ ఉండాలి
‘‘పరిశ్రమల రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ మహిళల భాగస్వామ్యం మన దగ్గర చాలా తక్కువ. 33 శాతం రిజర్వేషన్‌ గురించి చైతన్యవంతం చేయడంతోపాటు, రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకుంటే బూత్‌ స్థాయి నుంచి కెరీర్‌ని మొదలు పెట్టాలని చెబుతుంది ‘ఐ విల్‌’ కోర్సు. సింగపూర్‌లో రాజకీయ నాయకులు.. రాజకీయ రంగాన్ని, ఉపాధి రంగాన్ని కలవనివ్వరు. ఉపాధి కోసం ఎవరికి వాళ్లు సొంత వ్యాపారాలు చేసుకుంటూ, సేవాభావంతో రాజకీయ రంగంలోకి వస్తారు. ప్రజలకు సర్వీస్‌ చేయడానికి మాత్రమే ఉంటుంది రాజకీయరంగం. అందుకే సింగపూర్‌ పార్లమెంట్‌... బెస్ట్‌ పార్లమెంట్‌గా గుర్తింపు పొందింది. కోర్సులో భాగంగా అక్కడికి వెళ్లి అధ్యయనం చేయడం వల్ల నా దృష్టి కోణం విస్తృతమైంది. మన దగ్గర స్థానిక సంస్థల్లో మూడవ వంతు రిజర్వేషన్‌ కల్పించడం వల్ల కొన్ని తొలి అడుగులు పడుతున్న మాట వాస్తవమే.

అయితే అలా ఎన్నికైన మహిళలు చాలామంది ప్రతి చిన్న విషయానికీ భర్త, కుటుంబ సభ్యుల మీద ఆధారపడుతూ, సంతకాలకే పరిమితం అవుతున్నారు. అలా కాకుండా పాలన నైపుణ్యం పెంచుకోవాలి. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్‌ బిల్లుకు మోక్షం వచ్చినప్పుడు మన మహిళ జీవికలో కొత్త కోణాలు బయటకు వస్తాయి. రిజర్వేషన్‌ ఉంటే ఆ స్థానంలో తప్పకుండా మహిళ మాత్రమే ఎన్నికవుతుంది... కాబట్టి అసెంబ్లీ, పార్లమెంట్‌లలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళలు, పిల్లల కోసం చట్టాలు చేయడంలో మగవాళ్ల దృక్పథానికి మహిళ దృష్టికోణం కూడా మమైకమవుతుంది.

యుఎన్‌ఓలో ప్రసంగం
విద్యార్థిగా, పారిశ్రామికవేత్తగా ప్రపంచంలో నాలుగు ఖండాల్లో, ముప్పైకి పైగా దేశాల్లో పర్యటించారు విజయ శారద. అన్ని దేశాల్లోనూ మహిళల సామాజిక స్థితిగతులను మనదేశంతో బేరీజు వేసుకుంటూ వచ్చారు. మహిళలకు వేధింపుల విషయంలో ప్రపంచంలోనే ఏ దేశమైనా ఒక్కటేనన్నారామె. యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌లో భారతీయ సంస్కృతి గొప్పదనం గురించి ప్రసంగించారు. కాలేజ్‌లు నిర్వహణలో ఆమెకొచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి సైకాలజీలో కోర్సు చేశారు. ‘‘వేలాది మంది విద్యార్థులను ఒక తాటి మీదకు తీసుకురావాలంటే చిన్న సంగతి కాదు. వాళ్లకు మనం చెప్పేది మంచి మాటే అయినా, వాళ్లకు నచ్చే రీతిలో చెప్పకపోతే వినరు. అందుకే కౌమారదశలో ఉన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, వాళ్లకు ఎలా తెలియచెప్పాలనే మెళకువలు నేర్చుకోవడానికి సైకాలజీ చదివాను.

ఆ తర్వాత నా నిర్వహణ సామర్థ్యం మెరుగుపడిన సంగతి నాకే తెలిసింది. ఒక సంస్థ నిర్వహణకు అవసరమైనట్లు మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. కోవె(కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎంట్రప్రెన్యూర్స్‌) సదస్సుల్లో కూడా నేను నన్నే ఉదాహరణగా చెబుతుంటాను’’ అన్నారు శారద. ఆమె కోవెలో లైఫ్‌ మెంబర్‌ కూడా.మన చుట్టూ ఉన్న వాళ్లలో... ‘అరవై ఏళ్లు నిండాయి, ఇంక చేసేదేముంది’ అని విశ్రాంత జీవనం గడపడానికి సిద్ధమయ్యేవారిని ఎందరినో చూస్తుంటాం. అయితే శారద ఇరవై నాలుగ్గంటలూ ఉపయుక్తమైన వ్యాపకాలతో నిండి ఉంటుంది. అన్ని పనుల నుంచి కొంచెం వెసులుబాటు దొరికి తీరికగా అనిపించినప్పుడు మరేదైనా కోర్సులో చేరదామా అనిపిస్తుందంటారీ నిత్య విద్యార్థి. ఆమె పేరులో సరస్వతీదేవి ఉంది, విజయమూ ఉంది. తన సంకల్పబలంతో వాటిని సార్థకం చేసుకున్నారు.
– వాకా మంజులారెడ్డి

సాటి మహిళకు సాయం
మహిళను రెండవ స్థాయి పౌరురాలిగా అణచి వేసింది సమాజమే, కాబట్టి ప్రోత్సహించాల్సింది కూడా సమాజమే. పిల్లల పెంపకం కూడా సమాజం నిర్దేశించిన చట్రంలోనే సాగుతుంది. కాబట్టి స్త్రీ పురుషుల మధ్య అంతరం తరతరానికి పెరిగిపోతూ వచ్చింది. దాన్ని తగ్గించడానికి కొన్ని తరాల పాటు పడక తప్పదు. ‘ఐ విల్‌’ కోర్సు ప్రధానాంశాల్లో జీరో ఇన్‌వెస్ట్‌మెంట్‌ పాలిటిక్స్‌ కూడా ఒకటి. మా బ్యాచ్‌లో శిక్షణ తీసుకున్న మహిళలు ఢిల్లీ, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. విద్యాసంస్థల నిర్వహణలో నెలకు ఐదు వందల మందికి జీతాలివ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది.

ఆ బాధ్యతను పక్కన పెట్టి మరొకటి తలకెత్తుకునే పరిస్థితిలో లేకపోవడంతో నేనటువైపు అడుగు వేయలేదు. క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టకపోయినప్పటికీ నా దృష్టికి వచ్చిన సామాజిక సమస్యల పరిష్కారానికి నా వంతు సహకారం అందిస్తున్నాను. ముఖ్యంగా స్కూళ్లలో ఆడపిల్లలకు టాయిలెట్‌లు లేవని తెలిసినప్పుడు ఆర్థిక సహాయం చేయడం, మంచినీళ్లు లేని కాలనీలకు ట్యాంకర్‌లు పంపించడం వంటివి చేస్తున్నాను. ఓ మహిళగా సాటి మహిళలకు చిన్న, మధ్య తరగతి పరిశ్రమల స్థాపనకు సహకారం అందిస్తున్నాను.
– డాక్టర్‌ ఎ. విజయ శారదారెడ్డి, హోలీమేరీ విద్యాసంస్థల సెక్రటరీ

మరిన్ని వార్తలు