బరిలో నారీమణులు

23 Jul, 2018 01:33 IST|Sakshi

పాక్‌ ఎన్నికలు

పాకిస్తాన్‌లో ఈ నెల 25న జరుగనున్న లోక్‌సభ (నేషనల్‌ అసెంబ్లీ) ఎన్నికలలో తమ ముద్ర చాటేందుకు మహిళానేతలు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. సభలోని 342 సీట్లకు గాను 272 జనరల్‌ సీట్లు కాగా, మిగతా 70 సీట్లు ప్రత్యేకంగా మహిళలకు, మైనారిటీలకు కేటాయించినవి. పరిమితమైన కేటాయింపులే అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 171 మంది మహిళలు పోటీ చేస్తున్నారు.


ఎక్కువ సీట్లిచ్చింది ప్రతిపక్షమే
ఎల్లుండి పాకిస్తాన్‌లో జరుగుతున్న నేషనల్‌ అసెంబ్లీ ఎన్నికలకు వివిధ రాజకీయపార్టీల నుంచి పోటీచేస్తున్న మహిళలు 105 మంది ఉండగా,  స్వతంత్రులుగా  66 మంది బరిలో నిలిచారు. ప్రతిపక్షమైన పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) అత్యధికంగా 19 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. మితవాద  ముత్తహిత మజ్లీస్‌–ఏ–అమల్‌ (ఎంఎంఏ) పార్టీ కూడా 14 మంది మహిళలను అభ్యర్థులుగా నిలిపింది.

పాకిస్తాన్‌ తెహరీక్‌–ఏ–ఇన్సాఫ్, పీఎంఎల్‌–ఎన్‌ పార్టీల నుంచి 11 మంది చొప్పున మహిళలు ఎన్నికల్లో నిలుచున్నారు. అల్లాహో అక్బర్‌ పార్టీ నుంచి  ముగ్గురు మహిళలు పోటీలో ఉన్నారు. గతంలో 2013 ఎన్నికల్లో 135 మంది మహిళలు పోటీ చేశారు. వారిలో ఇండిపెండెంట్లు 74, వివిధ రాజకీయపార్టీల నుంచి 61 మంది ఉన్నారు. అంతకుముందు 2008 లో కేవలం 72 మంది మహిళలు మాత్రమే బరిలో ఉండగా, పార్టీల నుంచి 41 మంది, స్వతంత్రులుగా 31 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

పోటీలో ప్రముఖ మహిళలు
ప్రస్తుతం జనరల్‌ సీట్లలో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో పీఎంఎల్‌–ఎన్‌ నుంచి సుమైరా మాలిక్, తెహ్మినా దౌల్తానా, పీపీపీ నుంచి అస్మ ఆలంగిర్, మెహ్రీన్‌ అన్వర్‌ రాజా, సమైనా ఖాలిద్‌ గుర్ఖి, పీటీఐ నుంచి మాజీ మంత్రి ఫిరదౌస్‌ ఆషిక్‌ ఆవాన్, యాస్మిన్‌ రషీద్‌ ఉన్నారు. పీటీఐ చీలికగ్రూపు నేత అయేషా గులాలై నాలుగుచోట్ల నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. గిరిజన జిల్లాల నుంచి అలీ బేగంఖాన్‌ (ఇండిపెండెంట్‌) ఒక్కరే మహిళా అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

సునీతా పర్మర్‌ అనే 31 ఏళ్ల హిందూ మహిళ కూడా జనరల్‌ సీటు నుంచే పోటీలో ఉన్నారు. ప్రొవిన్షియల్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన తొలి హిందూ మహిళగా ఆమె గతంలో చరిత్ర సృష్టించారు. ఖైబర్‌ ఫఖ్తున్‌ఖ్వా ప్రాంతం నుంచి ఒక వయోధిక వృద్ధురాలు పాకిస్తాన్‌ మాజీ క్రికెట్‌ సార«థి, ప్రధాన రాజకీయపార్టీనేత ఇమ్రాన్‌ఖాన్‌పై పోటీచేస్తోంది. సింథ్‌ ప్రావిన్స్‌లోని థార్‌పార్కర్‌ నుంచి ఓ మహిళా అభ్యర్థి మొదటిసారి ఎన్నికల బరిలో నిలుస్తోంది.

పోటీ చేస్తే ప్రయోజనమెంత?
అయితే చట్టసభల్లో ఎక్కువమంది మహిళా సభ్యులున్నంత మాత్రాన మహిళల సమస్యల పరిష్కారంలో ఒరిగేదేమీ లేదని అక్కడి మహిళా హక్కుల సంఘాలు పెదవి విరుస్తున్నాయి. గతంలోని అనుభవాలు కూడా ఇందుకు ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేవని ఉమెన్‌ యాక్షన్‌ ఫోరంకు చెందిన తాహిర అబ్దుల్లా అభిప్రాయపడ్డారు.

చాలా మంది మహిళా ప్రతినిధులు ముఖ్యంగా మతసంస్థలకు చెందిన వారు మొత్తం పార్లమెంట్‌ సమావేశాల్లోనూ ఒక్కసారి కూడా నోరువిప్పిన  సందర్భాలు లేవని ఆమె అంటున్నారు. రిజర్వ్‌ సీట్ల నుంచి గెలుపొందిన వారు, సెనేట్‌ నుంచి వచ్చినవారే జాతీయ అసెంబ్లీలో లేదా సెనేట్‌లో (ఎగువ సభ) మహిళల సంబంధిత విషయాలు ప్రస్తావిస్తున్నారని రాజకీయ విశ్లేషకుడు ఘాజి సలావుద్దీన్‌ పేర్కొన్నారు.

మరో 18 ఏళ్లు పట్టొచ్చు!
ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు ఇటీవల ఈసీపీ అనేక చర్యలు చేపట్టినా ఈ ఎన్నికల్లో దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చనే అంటున్నారు. ఇప్పుడు అమలవుతున్న చర్యలను బట్టి ఓటర్‌ రిజిస్ట్రేషన్లో ప్రస్తుతమున్న స్త్రీ, పురుష తారతమ్యాలు తగ్గేందుకు మరో 18 ఏళ్లు పట్టవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో మహిళల పాత్ర పెరిగేలా చేసేందుకు  మత, సాంస్కృతిక  కట్టుబాట్లు, ఆంక్షలను వారు అధిగమించేలా చేయడంతోపాటు, సంస్కరణల ప్రక్రియ వేగవంతం చేయాల్సిన అవసరముంది.

ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల ఓటింగ్‌ రిజిస్ట్రేషన్‌ను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే పరిస్థితిలో మార్పు రావొచ్చునంటున్నారు.  పాకిస్తాన్‌లో చట్టసభలతో పాటు అన్ని నిర్ణాయక ప్రక్రియల్లోనూ స్త్రీ–పురుష సమానత్వం కోసం ప్రయత్నంతో పాటు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తే అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పు రావొచ్చునని ఆశిస్తున్నారు.


పదేళ్లకు గానీ రాని ఓటు హక్కు
పాకిస్తాన్‌కు స్వాతంత్య్రం లభించాక దాదాపు పదేళ్ల తర్వాత 1956లో తొలిసారి మహిళలు ఓటు వేసేందుకు అక్కడి చట్టం అనుమతిచ్చింది. అప్పటి నుంచి మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. మహిళలకు 33 శాతం కోటా ఇందుకు దోహదపడింది. అయితే బ్యాలెట్‌ పేపర్లపై మహిళా అభ్యర్థుల పేర్లున్నా మహిళా ఓటర్లు వారికి ఓట్లు వేస్తారా లేదా అన్నది కూడా స్పష్టంగా చెప్పలేమంటున్నారు.

మరోవైపు పాకిస్తాన్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సమానత్వ సాధనకు మహిళలు ఇంకా మరిన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. మొత్తం నమోదైన 9.7 కోట్ల ఓట్లలో పురుషులు 5.45 కోట్లు, మహిళలు 4.24 కోట్లు ఉండగా, దాదాపు లక్ష మంది ట్రాన్స్‌జండర్లు ఉన్నారు. పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం (ఈసీపీ) గణాంకాల ప్రకారం బాగా అభివృద్ధి చెందిన లాహోర్, ఫైసలాబాద్‌ వంటి ప్రాంతాల్లోనూ పురుష, మహిళా ఓటర్ల సంఖ్యలో (జిల్లాల వారీగా వివరాలు పరిశీలిస్తే) పెద్ద మోతాదులోనే వ్యత్యాసాలున్నట్టు వెల్లడైంది.

ఇప్పటికీ ఓటు వేయడం కష్టమే
పాకిస్తాన్‌లో ఓటుహక్కు వినియోగించుకోవాలంటే ముందుగా నేషనల్‌ ఐడెంటిటీ కార్డు (ఎన్‌ఐసీ) కోసం రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  వీటì  గురించి తెలియక లేదా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక చాలా మంది మహిళలు ఈ కార్డులు పొందలేకపోయారు. ఎన్‌ఐసీల కోసం ఎవరైనా వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్‌లోనూ విజ్ఞప్తి చేయవచ్చు. అయితే స్త్రీలు స్వేచ్ఛగా బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతోపాటు ఇంటర్నెట్‌ ఉపయోగించేందుకు అనేక మందికి అనుమతి లభించడం లేదు.

మహిళలపై మతపరమైన, సాంస్కృతిక వివక్ష కూడా పెద్ద అడ్డంకిగా మారుతోంది. తమ ఇళ్లలోని మహిళలు ఓటు వేసేందుకు అనుమతినివ్వొద్దని పురుషులను హెచ్చరిస్తూ గత ఎన్నికల సందర్భంగా కరపత్రాలు కూడా పంపిణీ అయ్యాయి. దాంతో 2008లో అక్కడి పంజాబ్‌ ప్రాంతంలోని 31 పోలింగ్‌ స్టేషన్లలో ఒక్క మహిళా ఓటు కూడా పోల్‌ కాలేదు. 2015 ఖైబర్‌ ఫఖ్తున్‌ఖ్వా స్థానిక ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో 800 పోలింగ్‌ స్టేషన్లలో పదిశాతం కంటే తక్కువగా మహిళలు ఓట్లు వేశారు. 17 జిల్లాల్లో  అయిదు శాతం కంటే తక్కువ మహిళా ఓటర్లు  మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

– రాహుల్‌

మరిన్ని వార్తలు