సౌవార్తిక ఉద్యమంలో బలమైన పాత్ర 'ఆమె'దే!

11 Feb, 2018 00:46 IST|Sakshi

సమాజం అనుసరించే ద్వంద్వ ప్రమాణాలకు బలై స్త్రీ ద్వితీయశ్రేణికి చెందిన జీవిగా, కేవలం వినోద సాధనంగా, పిల్లల్ని పుట్టించే యంత్రంగా పరిగణింపబడుతున్న సమాజంలోకి యేసు అరుదెంచి స్త్రీలను గౌరవించే విషయంలో ఒక విప్లవాన్నే తెచ్చాడు. నాటి స్త్రీలు బయటి ఆవరణాన్ని దాటి ఆలయం లోపలికి ప్రవేశించకూడదు. సమాజ మందిరంలో పురుషులతో సమానంగా కూర్చోకూడదు. పవిత్ర గ్రంథమైన ‘తోరా’ను స్త్రీలు తాకకూడదు. పురుషుడు భార్యతోనైనా బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడకూడదు. స్త్రీని ఇన్ని కట్టుబాట్లకు బానిసగా మార్చిన నాటి సమాజంలో యేసుక్రీస్తు వారికి అత్యంత గౌరవప్రదమైన స్థానాన్నిచ్చాడు.

దేవుడు మనిషిని తన స్వరూపంలో, తన వ్యక్తిత్వాన్నిచ్చి సృష్టించాలనుకున్నప్పుడు అతన్ని పురుషునిగా, స్త్రీగా చేశాడు. అంటే తనను రెండుగా విభజించి ఆ రెండు భాగాలుగా స్త్రీ పురుషులను దేవుడు సృష్టించాడు. కాని కాలక్రమంలో సమాజం దైవాభీష్టానికి వ్యతిరేకంగా పురుషాధిక్య సమాజంగా మారందని యేసు తన బోధలు, కార్యాల ద్వారా హెచ్చరించాడు. అధమజాతికి చెందిన ఒక సమరయ స్త్రీకి యాకోబు బావి వద్ద యేసు అనేక గంటలపాటు ప్రవచనం చెప్పి ఆధ్యాత్మిక లోతులు వివరించాడు (యోహాను 4:7–26). పాపం చేస్తూ, దొరికిన స్త్రీని ‘అమ్మా’ అని అనునయంగా సంబోధించి మరణ శిక్ష నుండి తప్పించి క్షమించాడు. (యోహాను 8:10–11).

రక్తస్రావమనే ఎంతో ఇబ్బందికరమైన వ్యాధితో బాధపడుతున్న స్త్రీని బాగు చేసి ఆమెకు శాంతిని ప్రసాదించాడు. పద్ధెనిమిదేళ్లపాటు నడుము వంగిపోయి వ్యధననుభవిస్తున్న స్త్రీని బాగు చేసిన ఆమెను ‘అబ్రాహాము కుమార్తె’గా ప్రకటించాడు (లూకా 18:16). తనను అత్తరుతో అభిషేకించిన ఒక పాపాత్మురాలైన స్త్రీని అంతా ఈసడించుకుంటే ఆయన మాత్రం ఆమెను పొగిడాడు. మరియ ఆయన పాదాల దగ్గరే కూర్చొని రోజంతా ఆయన మాటలు వింటూంటే ఆమె ఎన్నుకున్నది అత్యుత్తమమైన మార్గమన్నాడు. సిలువను మోస్తూ కూడా యెరూషలేము కుమార్తెలను ఓదార్చాడు. సిలువలో వేలాడుతూ తన తల్లి బాధ్యతల్ని శిష్యునికప్పగించాడు.

తాను పునరుత్థానుడియ్యానని అందరికీ చెప్పమంటూ మగ్దలేనె మరియను ఆదేశించి ఆమెను తొలి సువార్తికురాలిని చేశాడు. విశ్వంలో, ఆకాశంలో స్త్రీది సమాన భాగమని, ఆమెది సగభాగమని ఆచరణలో ప్రకటించిన మహా విప్లవకారుడు యేసుక్రీస్తు. స్త్రీని గౌరవించి ప్రోత్సహించడమే సమాజ పురోగతికి గీటురాయి అని ఆయన బోధలు చెబుతాయి. ఆదిమకాలం నుండి ఇప్పటిదాకా సౌవార్తిక ఉద్యమంలో, చర్చి చరిత్రలో స్త్రీది చాలా ప్రధానమైన పాత్ర. ఒక బలమైన సమాజానికి పునాది బలమైన కుటుంబమైతే, బలమైన కుటుంబ నిర్మాణంలో ముఖ్యపాత్ర తల్లిగా, భార్యగా స్త్రీదే!! స్త్రీకి సమాన హోదానిచ్చి గౌరవించనివాడు అనాగరికుడు, క్రైస్తవ స్ఫూర్తికి విరుద్ధమైన వాడు.

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు