స్త్రీలోక సంచారం

5 Nov, 2018 00:48 IST|Sakshi

భారతీయ నావికాదళంలోని ‘సీ–గోయింగ్‌ క్యాడర్‌’లోకి మహిళలను తీసుకునే విషయమై రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో ఉన్నతస్థాయి అధికారులు చర్చించారు. ఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో నౌకాదళంలోకి మరింతగా మహిళలను ఆహ్వానించేందుకు అవసరమైన నిర్ణయాలను తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం భారతీయ నౌకాదళంలో మహిళా ఉద్యోగులు ఉన్నప్పటికీ, వారిని సముద్రం మీది విధులకు అనుమతించడం లేదు. నేవీలో ఇప్పుడున్న 639 మంది మహిళా సిబ్బందిలో 148 మంది మెడికల్‌ ఆఫీసర్లు, ఇద్దరు డెంటల్‌ ఆఫీసర్‌లు కాగా.. తక్కినవారు విద్య, చట్ట, నౌకా నిర్మాణం వంటి సాధారణ బ్రాంచీలలో ఉన్నవారే.

యూట్యూబ్‌లో ప్రత్యేకించి మహిళల కోసం నడుస్తున్న చానళ్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. కాస్త చదువుకున్న వారు, సామాజిక బాధ్యత తెలిసిన వారు, స్త్రీ సాధికారతకు సమానత్వానికి ప్రాముఖ్యం ఇస్తున్న వారు నడిపిస్తున్న ఈ చానళ్లలో స్త్రీలకు వినోదం అందించేవి మాత్రమే కాకుండా, ఆసక్తికరంగా స్త్రీల సమస్యలను చర్చించేవి కూడా ఉండటంతో వీటిని వీక్షించే నవతరం మహిళల సంఖ్య పెరుగుతోంది. ‘మోస్ట్‌లీ సేన్‌’, ‘గర్లియప’, ‘బ్లష్‌’, ‘విటమిన్‌ స్త్రీ’, ‘నిషా మధూలిక’, ‘రిక్షావాలీ’ అనే ఆరు మహిళా చానళ్లకు ప్రస్తుతం మహిళా నెటిజన్‌ల రేటింగ్‌ ఎక్కువగా ఉంది.

పెద్దల చిత్రాలలో నటిస్తున్న మహిళా ఫిల్మ్‌స్టార్స్‌ని నీలి చిత్రాల నటీమణులుగా పిలవడం పితృస్వామ్య వ్యవస్థ అవలక్షణం అని
బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ బాలీవుడ్‌ నటి రీచా చద్ధా అన్నారు. షకీలా బయోపిక్‌ కోసం ప్రస్తుతం ఆమె బెంగళూరులో ఉన్నారు. ‘షకీలా’ చిత్రం లోగో రెండు రోజుల క్రితమే విడుదలైంది. అందులో ‘నాట్‌ ఎ పోర్న్‌ స్టార్‌’ అనే ట్యాగ్‌లైన్‌ ఉంటుంది. ‘‘లైఫ్‌లో సక్సెస్‌ అయిన మహిళల్ని వాళ్ల సక్సెస్‌తో కాకుండా ఒక మహిళగా మాత్రమే చూడటం కూడా పురుషస్వామ్యపు ఆధిక్యపు గుణమేనని కూడా చద్ధా అన్నారు. 

మరిన్ని వార్తలు