స్త్రీలోక సంచారం

19 Nov, 2018 00:04 IST|Sakshi

కోల్‌కతాలోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’ పూర్వ విద్యార్థిని అంజు సేత్‌ ఆ ఇన్‌స్టిట్యూట్‌ తొలి మహిళా డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇటీవలి వరకు ఆమె యు.ఎస్‌.లోని వర్జీనియా టెక్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. 2008లో అక్కడ చేరడానికి ముందు ఇల్లినాయిస్‌ యూనివర్సిటీలో డైరెక్టర్‌గా, హ్యూస్టన్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 25 ఏళ్ల తన కెరీర్‌లో అంజు సేత్‌ ఎక్కువ భాగం విదేశాలలోనే గడిపారు. సేత్‌ ఢిల్లీలో పట్టభద్రులయ్యారు. 1978లో కోల్‌కతా ఐ.ఐ.ఎం.లో ఎం.బి.ఎ. చేశారు.

ఇండియాలో ఎక్కువలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో 83 శాతం మంది, తమిళనాడులో 63 శాతం మంది మహిళలు అవాంఛిత గర్భాన్ని పోగొట్టుకోడానికి డాక్టర్ల అనుమతి లేకుండానే, సొంతంగా ఫార్మసీలకు వెళ్లి అబార్షన్‌ పిల్స్‌ కొని తెచ్చుకుంటున్నట్లు న్యూయార్క్‌లోని గట్మాకర్‌ ఇన్‌స్టిట్యూట్, ముంబైలోని ‘ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌’ కలిసి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు అస్సాం, బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో ‘అవాంఛిత గర్భం – గర్భవిచ్ఛిత్తి మాత్రల వాడకం’ అనే అంశంపై అధ్యయనం జరిపిన ఈ రెండు సంస్థలు.. ప్రమాదకరమైన ఈ ధోరణిని నివారించడానికి, ప్రభు త్వం సురక్షితమైన విధానాలను మహిళలకు అందుబాటులోకి తేవాలని తమ అధ్యయన ఫలితాల నివేదికలో సూచించాయి.

ప్రముఖ బెంగాలీ నటి నఫీసా అలీ (61) తను స్టేజ్‌ త్రీ క్యాన్సర్‌తో ఉన్నట్లు వెల్లడించారు! ఇటీవలే ‘సాహెబ్‌ బీవీ ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌ 3’లో కనిపించిన నఫీసా ఈ వార్తను తన అభిమానులు, ఫాలోవర్‌లను ఉద్దేశించి ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నారు. కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీతో  ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసి, దాని కింద.. ‘ఇప్పుడే నా అపురూపమైన స్నేహితురాలిని కలిసి వచ్చాను. నా స్టేజ్‌ త్రీ క్యాన్సర్‌ నుంచి నేను కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు’’ అని రాశారు. నఫీసా అలీ మోడల్, పొలిటీషియన్, సామాజిక కార్యకర్త కూడా. మొదట కాంగ్రెస్‌లో ఉండి, తర్వాత సమాజ్‌వాదిలో చేరి, తిరిగి ఆమె కాంగ్రెస్‌లోకి వచ్చేశారు.

మరిన్ని వార్తలు