డేగలు తిరుగుతున్నాయి లేగలు తప్పిపోతున్నాయి

13 Apr, 2018 00:02 IST|Sakshi

అక్రమ రవాణా

భారతదేశంలో మహిళలు, చిన్నపిల్లల అక్రమ రవాణా సమస్య తీవ్ర రూపం దాల్చడం పట్ల ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.  స్త్రీలను, బాలికలను మాయమాటలు చెప్పి, మోసం చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాలు కొత్త కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. బాధితులు ప్రాథమిక గుర్తింపు, జాతీయత అనేవి కూడా తుడిచిపెట్టుకు పోయేలా చేస్తూ, చివరకు భారత పౌరులుగా కూడా వారి గుర్తింపు, మనుగడే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారు! 

ఉపాధి పేరుతో నరకంలోకి!
ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. విదేశాల్లో మంచి జీతమొచ్చే ఉద్యోగం ఉందంటూ స్థానిక ఏజెంట్లు నమ్మించి మహిళలు, అమ్మాయిలను ఇతర దేశాలకు తీసుకెళుతున్నారు. చైనా, థాయ్‌లాండ్, సింగపూర్, మయన్మార్‌ తదితర దేశాల్లో ఇళ్లల్లో పనిమనిషిగా లేదా చిన్న పిల్లల సంరక్షణ వంటి పనులు చేసే వారికి డిమాండ్‌ ఉందని, ఆహారంతో పాటు వసతి కల్పిస్తామనీ చెబుతూ, మంచి జీతాన్ని ఎరగా చూపుతున్నారు. స్థానికంగా అంతగా ఉపాధి అవకాశాలు లేని కారణంగా ఈ మోసపు మాటల పట్ల అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారు. ముందుగా ఈ ప్రాంతాల నుంచి వారిని మయన్మార్‌కు తీసుకెళుతున్నారు. మిజోరం బాలికలనైతే సరిహద్దులోని మయన్మార్‌ గ్రామానికి, మణిపూర్‌కు చెందిన వారిని మరో పట్టణానికి తరలిస్తున్నారు. వీరిని అతి సులభంగా ద్విచక్రవాహనాలపై సరిహద్దు దాటించేస్తున్నారు. 

మూడంచెల మాయా వ్యూహం
భారత్, మయన్మార్, గమ్యస్థాన దేశం ఇలా మూడు అంచెల్లో ఈ ఏజెంట్ల నెట్‌వర్క్‌ వ్యవస్థ పనిచేస్తోంది. వారు అక్కడకు చేరుకోగానే ఆధార్‌కార్డు, మొబైల్‌ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లను ఏజెంట్లు తీసేసుకుంటున్నారు. యాంగాన్, తదితర చోట్లకు చేరాక ఈ అమ్మాయిలను వారి రూపురేఖల ఆధారంగా విభజిస్తున్నారు. అందంగా ఉన్న వారిని బ్యూటీపార్లర్‌లలో, ఇతరులను ఇళ్ల పనుల్లో శిక్షణ నిచ్చి అక్కడి నుంచి మరో దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. సింగపూర్, థాయ్‌లాండ్‌లకు వెళ్లేందుకు వీలుగా బర్మా భాషలో వారికి శిక్షణనిచ్చి వారికి మారుపేర్లతో  మయన్మార్‌ పాస్‌పోర్టులు సిద్ధంచేస్తున్నారు. మరో దేశానికి చేరిన వెంటనే ఏజెంట్లు వారి పాస్‌పోర్టులు సైతం లాగేసుకుంటున్నారు.

కనిపెట్టడం కష్టమౌతోంది!
బాధితులు ఎక్కడున్నారు, ఏమి చేస్తున్నారనే విషయాన్ని కనుక్కోవడం కూడా వారి కుటుంబసభ్యులకు అసాధ్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మిస్సింగ్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ విధంగా తీసుకెళుతున్న మహిళలు లేదా బాలికల్లో అధికశాతం మందిని ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి.

బాధితులు తమ గుర్తింపును కోల్పోయి, కొత్త పేర్లతో చెలామణీ అవుతుండడంతో అధికారులు వారిని కనిపెట్టడం అసాధ్యం అవుతోంది. ఈ విధంగా మిజోరం నుంచి సింగపూర్‌కు వెళ్లిన 17 ఏళ్ల మెర్సీ ఆత్మహత్యకు పాల్పడితే, ఆమె భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకురాలేక పోయారు! ఆమె తల్లితండ్రులు కూడా పేదవారు కావడంతో అక్కడకు వెళ్లేందుకు డబ్బులతో పాటు పాస్‌పోర్టు లేక కనీసం చివరిచూపు కూడా దక్కించుకోలేకపోయారు. మెర్సీ మయన్మార్‌ పాస్‌పోర్టుపై అక్కడకు వెళ్లినట్టు అప్పుడే బయటపడింది.మహిళలు, బాలికల అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం చేయాల్సింది చేస్తూనే ఉన్నా.. పరదేశీ ‘ఎర’లకు చిక్కుకోకుండా, తమను, తమ పిల్లల్ని ఎవరికివారు జాగ్రత్తగా కాపాడుకోవలసిన పాడు కాలం వచ్చేసింది. 
– కె.రాహుల్, సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా