ఆడ'వార్‌'

25 May, 2017 23:51 IST|Sakshi
ఆడ'వార్‌'

ప్రపంచ యుద్ధ క్షేత్రాలలో 'షి'శస్త్రం

వియ్‌ కెన్‌ డు
యుద్ధం క్రూరంగా ఉంటుంది. మహిళలో కారుణ్యం ఉంటుంది. ఎలా ఈ రెండూ మ్యాచ్‌ అవడం? యుద్ధంలో శత్రువు యుద్ధధర్మాన్నీ, యుద్ధనీతినీ విస్మరిస్తాడు. ఆ శత్రువుకు మహిళ బందీగా దొరికితే ఇంకేమైనా ఉందా?! యుద్ధంలో ఊహించని విధంగా దుర్భరమైన
పరిస్థితులు ఏర్పడతాయి. మహిళ మానసికంగా వాటిని తట్టుకుని నిలబడవచ్చు. కానీ శారీరకంగా ఆమె శక్తి సరిపోకపోతే? ఇదిగో.. ఇన్ని డౌట్‌లు వస్తాయి.. మహిళను యుద్ధభూమికి పంపడానికి!!

‘వియ్‌ కెన్‌ డు ఇట్‌’ అని మహిళలు ఎంత చెయ్యెత్తి పిడికిలి బిగించినా, ‘వి కాంట్‌ డూ ఇట్‌ ప్లీజ్‌’ అని ప్రపంచ దేశాలు మహిళల్ని కంబాట్‌ (యుద్ధం)లోకి తీసుకోలేమని చెప్పి, దశాబ్దాలపాటు నిరుత్సాహపరుస్తూ వచ్చాయి. సైన్యంతో నిమిత్తం లేకుండా తమకై తాముగా కదన రంగంలోకి దుమికిన క్వీన్‌ బోడికా (రోమ్‌కు వ్యతిరేకంగా బ్రిటన్‌ తరఫున), జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ (ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌ తరఫున) వంటి వారు చరిత్రలో ఉన్నప్పటì కీ వారు మగవేషంలో మాత్రమే ఫైట్‌ చేయవలసి వచ్చింది.

సుమారు 18వ శతాబ్దం వరకు ప్రపంచంలో ఎక్కడా మహిళలు ఒక ప్రత్యేక సైనిక విభాగంగా యుద్ధక్షేత్రానికి వెళ్లింది లేదు. తొలిసారి రష్యా మొదటి ప్రపంచ యుద్ధంలోకి ఒక మహిళా దళాన్ని పంపింది. ఆ తర్వాత ఒక్కో దేశం రష్యాను అనుసరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, జర్మనీ.. తమ దేశ మహిళలకు శత్రుదేశాల విమానాలను కూలగొట్టే యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్‌ యూనిట్‌లలో శిక్షణ ఇప్పించి మరీ యుద్ధానికి పంపాయి. ఆ తర్వాతి రెండు శతాబ్దాలలోనూ అనేక దేశాలు మహిళలను యుద్ధ విధుల్లోకి తీసుకోవడం మొదలు పెట్టాయి.
భారత్‌ అయితే మరీ ఇటీవల మాత్రమే తన మహిళలకు ఈ అవకాశాన్ని కల్పించింది.

మహిళలను యుద్ధక్షేత్ర విధుల్లోకి తీసుకునేది లేదని 2015లో స్పష్టంగా ప్రకటించిన అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ 2016లో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ‘పోరాటంలోకి మీరూ రావచ్చు’ అని త్రివిధ దళాలలోకి మహిళలకు ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏ దేశం ఎప్పుడు తన మహిళలకు యుద్ధరంగపు సైనికులుగా అవకాశం కల్పించిందో ఒకసారి చూద్దాం.

అమెరికా: 2013 జనవరి 24న అమెరికా రక్షణశాఖ కార్యదర్శి లియోన్‌ పనెట్టా యుద్ధరంగంలోకి మహిళలు రావడంపై అప్పటి వరకు ఉన్న నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేశారు.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌: 2016 జూలైలో భూతలంపై పోరాడే యుద్ధ సైనికులుగా మహిళలను నియమించడానికి అవరోధంగా ఉన్న నిబంధనలను యు.కె.తొలగించింది.

జర్మనీ: 2011లో అన్ని ఫైటింగ్‌ యూనిట్‌లలోకి మహిళలను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.

ఆస్ట్రేలియా: 2011 నుంచి 2013 వరకు విడతల వారీగా దేశ రక్షణ దళాలలోని పోరాట విభాగాలలో మహిళలకు అవకాశం కల్పించింది.

కెనడా: ‘కెనడా మానవ హక్కుల చట్టం’ ప్రకారం కెనడా సైనిక దళాలలోనూ మహిళలకు స్థానం కల్పిస్తూ 1989లో నిర్ణయం తీసుకుంది. 2000 సంవత్సరంలో.. జలాంతర్గాములలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రద్దు చేసింది.

డెన్మార్క్‌: మహిళలు యుద్ధరంగంలోకి పనికొస్తారా అనే విషయంపై సర్వే చేయించి, సైన్యంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమైన పోరాట పటిమను కనబరుస్తారని ఆ సర్వేలో తేలడంతో 2010 నుంచి మహిళల్ని యుద్ధంలోకి తీసుకుంటోంది.

ఫిన్‌లాండ్‌: ‘మగవాళ్లకు మాత్రమే’ అనే నిబంధనేమీ ఫిన్‌లాండ్‌లో లేదు. అలాగే మహిళలకు ప్రత్యేక ఆహ్వానమేమీ లేదు. మహిళలు తమకు ఇష్టమైతే ఆర్మీలోని యుద్ధ విభాగాలలో చేరొచ్చు.  

ఫ్రాన్స్‌: ఈ దేశపు యుద్ధ విధుల్లో ఐదింట ఒక శాతం వరకు మహిళలు ఉన్నారు. మహిళలు యుద్ధ విధుల్లోకి రావడానికి అక్కడ ఉన్న నిబంధలను ఫ్రాన్స్‌ తన అవసరాన్ని బట్టి సడలించుకుంటూ వస్తోంది.

ఇజ్రాయిల్‌: 2000లో ‘సైనిక సేవల్లో సమానత్వ సవరణ బిల్లు’ను తీసుకువచ్చింది. నాటి నుంచి మహిళల నియామకాలు ఎక్కువయ్యాయి.

నార్వే: 1985లోనే సబ్‌మెరైన్స్‌లోకి మహిళల్ని తీసుకుంది! 2015 నాటికి ‘కంపల్సరీ మిలటరీ సర్వీస్‌’లోకి కూడా మహిళలు వచ్చేశారు.

శ్రీలంక: సాధారణ యుద్ధరంగంలో తప్ప..  ప్రత్యేక దళాలు, పైలట్‌ బ్రాంచ్, నావల్‌ ఫాస్ట్‌ ఎటాక్‌.. వంటి ‘డూ ఆర్‌ డై’ విభాగాలలోకి మాత్రం ఇప్పటికీ మహిళలకు అవకాశం లేదు.

స్వీడన్‌: 1989 నుండి అన్ని యుద్ధ విధుల్లోకి స్వీడన్‌ తన మహిళల్ని స్వాగతిస్తోంది.

మరిన్ని వార్తలు